ఆర్టీసీని గట్టెక్కిస్తున్నాం


మిర్యాలగూడ టౌన్‌ : గత సంవత్సరం రూ. 545 కోట్ల నష్టాల్లో ఉన్న ఆర్టీసీని ప్రస్తుతం గట్టెక్కిస్తున్నామని ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ జి.సత్యనారాయణ తెలిపారు. ఇప్పటి వరకు 500 కోట్ల రూపాయల నష్టాన్ని పూడ్చామని పేర్కొన్నారు. సోమవారం స్థానిక ఆర్టీసీ డిపోలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నష్టాలను పూడ్చడంలో నల్లగొండ జిల్లా మొదటి స్థానంలో ఉందన్నారు. గతంలో ఈ జిల్లా రూ. 36 కోట్ల నష్టాల్లో ఉండగా నేడు రూ. 19 కోట్లకు చేరిందని వివరించారు.



 ఇతర మార్గాల్లో ఆదాయం పెంచడంలో కూడా నల్లగొండ జిల్లా ప్రథమ స్థానంలో ఉందని అభినందించారు. ఇందుకు కార్మికులు, ఉద్యోగుల కృషి చాలా ఉందని కొనియాడారు. ప్రయాణికుల రద్దీ పెరిగినందున రాష్ట్ర వ్యాప్తంగా 1800 కొత్త బస్సులు మంజూరయ్యాయని పేర్కొన్నారు. సంస్థలో ఉద్యోగ విభజన పూర్తి కావచ్చిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బస్టాండ్లలో మౌలిక వసతులు కల్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.



త్వరలో బయోమెట్రిక్‌ విధానాన్ని అమలు చేస్తామన్నారు. రాష్ట్రంలోని మేజర్‌ బస్టాండ్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మిర్యాలగూడ నుంచి తిరుపతికి నేరుగా,  మిర్యాలగూడ నుంచి భీమారం మీదుగా సూర్యాపేట, పాలకుర్తి, స్టేషన్‌ఘన్‌పూర్, హన్మకొండకు ఎక్స్‌ప్రెస్‌ను నడిపేందుకు వారంలోగా ప్రతిపాదనలు పంపాలని కోరారు.



జర్నలిస్టులకు త్వరలో ఉమ్మడి బస్‌పాస్‌లు

జర్నలిస్టులకు ప్రస్తుతం ఆయా జిల్లా పాస్‌లను విడుదల చేశామని, త్వరలో ఉమ్మడి జిల్లాలకు అనుమతిస్తూ వాటిని మార్చేందుకు చర్యలు చేపడతామని ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ వివరించారు. ఆర్టీసీ సంస్థ అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతోందని, వాటిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు క్యాట్, ఫ్యామిలీకార్డులు లక్ష 20 వేల వరకు మంజూరు చేశామని వివరించారు. ప్రస్తుతం ప్రయాణికులకు ప్రమాద బీమా   లక్ష రూపాయలు అదిస్తున్నామని, దానిని పెంచేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని తెలిపారు.



నల్లగొండ జిల్లాకు 80 ఆర్టీసీ బస్సులు మంజూరు చేయగా మిర్యాలగూడ డిపోకు 22 రానున్నట్లు చెప్పారు. ఆర్టీసీ బస్టాండ్‌లో పనిచేస్తోన్న ఔట్‌ సోర్సింగ్‌ కార్మికుల వేతనాల మంజూరులో ఇబ్బందులున్నా, తక్కువ జీతాలు ఇచ్చినా వెంటనే సంబంధిత కాంట్రాక్టర్‌కు నోటీసులు జారీ చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సమావేశంలో నల్లగొండ ఆర్‌ఎం విజయ్‌కుమార్, డీవీఎం మధుసూదన్‌రావు, డీఎం సుధాకర్‌రావు, అసిస్టెంట్‌ డీఎం ప్రవీణ్‌కుమార్‌ తదిత రులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top