800 కోట్ల దందా

800 కోట్ల దందా


 ప్రైవేట్ వైద్య సీట్ల భర్తీ వెనుక భారీ కుంభకోణం

*   ఒక్కో ఎంబీబీఎస్ సీటుకు రూ. కోటికిపైగా వసూళ్లు

  అక్రమంగా సీట్లు కట్టబెట్టేందుకే తెరపైకి ప్రత్యేక ప్రవేశ పరీక్ష

  వైద్య విద్యలో ప్రతిభకు సమాధి కడుతున్న యాజమాన్యాలు

*   విద్యార్థులతో ముందస్తు ఒప్పందం ప్రకారమే పరీక్షా కేంద్రాలు!

  వైద్యమంత్రికి తెలియకుండానే నోటిఫికేషన్.. అయినా మౌనమే

*   ‘ప్రైవేటు’ పరీక్షపై పునరాలోచనలో ప్రభుత్వం..?

*  జేఎన్టీయూకు అప్పగించే యోచన..     



 ప్రైవేటు వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్ యాజమాన్య కోటా సీట్ల భర్తీలో భారీ కుంభకోణం చోటు చేసుకుంటోంది. ఏకంగా 800 కోట్ల రూపాయలు యాజమాన్యాల జేబుల్లోకి వెళుతున్నాయి. ఇప్పటికే ఎన్నారై కోటాలోని 15 శాతం (300) సీట్లను రూ.కోటీ 25 లక్షల చొప్పున అమ్మేసుకున్న యాజమాన్యాలు.. ఇప్పుడు యాజమాన్య కోటాలోని 735 (35శాతం) సీట్లనూ దాదాపుగా అమ్మేసుకున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.

 

 ఇలా అమ్ముకున్న సీట్లలో ఆయా అభ్యర్థులకే ప్రవేశాలు కల్పించుకొనేందుకు ప్రత్యేక ప్రవేశపరీక్ష పేరిట వ్యవహారాన్ని తెరపైకి తెచ్చాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అసలు వైద్య మంత్రికే తెలియకుండా ‘ప్రైవేటు’ పరీక్ష నోటిఫికేషన్ రావడం, అదీ గుట్టుచప్పుడు కాకుండా చేయడం, ఇన్ని ఆరోపణలు వస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం వంటివన్నీ ఇది భారీ కుంభకోణమని స్పష్టం చేస్తున్నాయని ప్రభుత్వాధికారులే వ్యాఖ్యానిస్తుండడం గమనార్హం.                                    

 - సాక్షి, హైదరాబాద్

 

 ఒత్తిడి తెచ్చి మరీ..

 రాష్ట్రంలోని 15 ప్రైవేట్ వైద్య కళాశాలల్లో 2,100 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. వాటిలో 50 శాతం అంటే 1,050 సీట్లను ఎంసెట్ మెరిట్ ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వమే భర్తీ చేస్తుంది. ఇక మిగిలిన (35 శాతం యాజమాన్య కోటా, 15 శాతం ఎన్నారై కోటా) 1,050 సీట్లు ప్రైవేట్ కళాశాలలకు వందల కోట్ల రూపాయలు కుమ్మరించి పెడుతున్నాయి. ఈ ఏడాది ‘బీ’ కేటగిరీ సీట్లకు ఫీజును రూ.2.4 లక్షల నుంచి రూ.9 లక్షలకు పెంచడంతో పాటు యాజమాన్య కోటా సీట్ల భర్తీ కోసం ప్రత్యేక ప్రవేశ పరీక్ష నిర్వహించుకోవడానికి ప్రైవేటు కాలేజీలు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి.. అనుమతి సాధించుకున్నాయి.

 

 చడీచప్పుడు లేకుండా..

 యాజమాన్య కోటా కింద 750 ఎంబీబీఎస్ సీట్లను భర్తీ చేయడానికి ఉద్దేశించిన నోటిఫికేషన్ ప్రక్రియ యావత్తు చడీచప్పుడు లేకుండా సాగింది. ముందస్తు ప్రకటనగానీ, మీడియా సమావేశంగానీ లేకుండానే ఓ పత్రికకు నోటిఫికేషన్ ఇచ్చి పని కానిచ్చేశారు. అంతకన్నా విచిత్రంగా తెలంగాణలో కాలేజీలు ఉంటే ఇక్కడ నాలుగు కేంద్రాలు మాత్రమే ఏర్పాటు చేసి.. ఏపీలో 10 కేంద్రాలను ఏర్పాటు చేయడం గమనార్హం. రూ.కోటికిపైగా ముట్టజెప్పి ముందే సీట్లు కొనేసిన వారి కోసం పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

 

  ‘ఇదంతా అక్రమంగా సీట్లు కట్టబెట్టేందుకు నడిపిస్తున్న తతంగం అనేది చిన్న పిల్లాడికైనా అర్థమవుతుంది..’ అని ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం సీనియర్ అధికారి ఒకరు పేర్కొన్నారు. ఒక్కో సీటుకు ఫీజును రూ.9 లక్షలకు పెంచిన తరువాత ఎంసెట్‌ను ప్రాతిపదికగా తీసుకోకుండా మరో పరీక్ష ఎందుకని.. దీన్ని బట్టే ఇదో పెద్ద కుంభకోణమని స్పష్టమవుతోందని ఎన్టీఆర్ వర్సిటీలో పదేళ్లపాటు ఎంబీబీఎస్ అడ్మిషన్లను పర్యవేక్షించిన ఆ అధికారి వ్యాఖ్యానించారు.

 

 తీరని ధనదాహం

 యాజమాన్య కోటాలోని 35శాతం సీట్లకు రూ.9 లక్షలు, 15 శాతం ఎన్నారై కోటా సీట్లకు రూ.11 లక్షలు ఫీజుగా నిర్ణయించినా.. ప్రైవేట్ వైద్య కళాశాలల ధనదాహం తీరలేదు. యాజమాన్య కోటాలోని 35 శాతం సీట్లను తామే భర్తీ చేసుకుంటామని మెలిక పెట్టాయి. వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్ చందా దీనిని వ్యతిరేకించినా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ప్రత్యేక ప్రవేశపరీక్షకు ఆమోదం తెచ్చుకున్నాయి. ప్రభుత్వం నిర్దేశించిన ఫీజుకే ఈ 35 శాతం సీట్లను భర్తీ చేయాలనుకుంటే.. ఎంసెట్ మెరిట్‌ను ప్రాతిపదికగా తీసుకోవచ్చు, ఏ దురుద్దేశం లేనట్లయితే ‘ప్రైవేట్’ పరీక్షతో పనే లేదు. కానీ కళాశాలలు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి మరీ ‘ప్రైవేట్’ పరీక్షను సాధించుకున్నాయి. ఎంసెట్‌ను కాదని ప్రైవేట్ కాలేజీల డిమాండ్‌కు ప్రభుత్వం ఎందుకు తలొగ్గిందో అర్థం కావడం లేదని విద్యావేత్తలు అంటున్నారు. కచ్చితంగా దీని వెనక వందల కోట్ల రూపాయల కుంభకోణం ఉంటుందని ఆరోపిస్తున్నారు.

 

 మంత్రిగారి మౌనం ఎందుకు?

 ప్రభుత్వ కనుసన్నల్లో ప్రత్యేక ప్రవేశ పరీక్ష జరుగుతుందని చెప్పిన వైద్యారోగ్య శాఖ మంత్రికే.. ఆ నోటిఫికేషన్ సంగతే తెలియకపోవడం గమనార్హం. ఫలానా పత్రికలో నోటిఫికేషన్ వచ్చిందని మీడియా ప్రతినిధులు చెబితే ఆయన నివ్వెరపోయారు కూడా. మరి ఈ విషయం తెలిసి 24 గంటలు దాటినా మంత్రి లక్ష్మారెడ్డి స్పందించనే లేదు.  

 

 పునరాలోచనలో ప్రభుత్వం..!

 ఎంబీబీఎస్ యాజమాన్య కోటా సీట్ల భర్తీ అంశంలో అవకతవకలు చోటుచేసుకుంటున్నాయనే ఆరోపణల నేపథ్యంలో ‘ప్రైవేటు’ పరీక్షపై రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచనకు వచ్చినట్లు సమాచారం. ప్రైవేటు వైద్య కాలేజీలు ప్రభుత్వానికి తెలియకుండానే నోటిఫికేషన్ విడుదల చేయడం, పదిరోజుల్లోపే పరీక్ష నిర్వహణకు సిద్ధమవడం, పరీక్ష కేంద్రాల ఏర్పాటు వంటివన్నీ అక్రమాల్లో భాగంగానే జరుగుతున్నాయన్న అభిప్రాయాల నేపథ్యంలో.. ఈ సీట్ల భర్తీ కోసం జేఎన్టీయూహెచ్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రవేశ పరీక్ష నిర్వహించాలని యోచిస్తున్నట్లు సమాచారం. కాగా, ఎంబీబీఎస్ సీట్ల భర్తీకి ఇప్పటివరకు ఉన్న విధానాన్నే కొనసాగించాలని ఎమ్మెల్యే ఆర్.కృష్ణయ్య  ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top