‘సబల’ నిధులు స్వాహా..!


ఐసీడీఎస్‌లో మరో అక్రమం

రూ.75 లక్షలు ఖజానా నుంచి అడ్వాన్స్ గా డ్రా

శాఖ ఉన్నతాధికారుల అనుమతి లేకుండానే..!

కలెక్టర్‌నే తప్పుదోవ పట్టించిన వైనం

సబల నిలిపివేతతో నిధుల కైంకర్యానికి పన్నాగం


ఆదిలాబాద్ : స్త్రీ, శిశు సంక్షేమ శాఖలో మరో భారీ అక్రమం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. గతంలో ఓ సీడీపీవో లక్షల నిధుల స్వాహా వ్యవహారం మరువక ముందే.. తాజాగా ఈ వ్యవహారాన్నే తలదన్నేలా మరోటి చోటుచేసుకుంది.



మహిళా, శిశు సంక్షేమ శాఖ కమిషనర్ నుంచి అనుమతి పొందకుండానే ట్రెజరీ నిధులు విడుదల చేసినట్లు సమాచారం. ఎలాంటి నిబంధనలు పాటించకుండానే సబల పథకానికి సంబంధించిన రూ.75 లక్షలు అడ్వాన్స్‌గా డ్రా చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఈ పథకం నిలిచిపోతుందని ముందుగానే తెలిసిన శాఖలోని పలువురు అధికారులు.. ఈ నిధులను తమ కమీషన్ల కోసం కోడిగుడ్ల కాంట్రాక్టర్లకు చెల్లించేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నట్లు సమాచారం. ఒక పథకం నిధులు మరో పథకానికి మళ్లించొద్దని నిబంధనలున్నా.. అధికారులు తమ స్వార్థం కోసమే ఇలా చేస్తున్నారని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

 

అనుమతిలేకుండానే..

ఐసీడీఎస్‌కు కలెక్టర్ చైర్మన్‌గా వ్యవహరిస్తారు. ప్రతి కొనుగోలుకు సం బంధించి స్త్రీ, శిశు సంక్షేమ శాఖ కమిషనర్ కార్యాలయం నుంచి అనుమతి వచ్చిన తర్వాత ఆ ప్రతిపాదనలను చైర్మన్‌గా ఉన్న కలెక్టర్ అనుమతి పొంది కొనుగోలు చేయాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం నిధులతో సబల పథకాన్ని అమలు చేస్తున్నారు. ఈ పథకం ద్వారా ప్రతినెలా కిశోర బాలికలకు 3 కిలోల బియ్యం, కేజీ కంది పప్పు, అరకిలో నూనె సరుకులను అందజేస్తారు. కాగా.. గత మార్చిలో రూ.75 లక్షలు ఐసీడీఎస్ అధికారులు ట్రెజరీ నుంచి అడ్వాన్స్‌గా డ్రా చేశారు. నూనె కొనుగోలు కోసం రూ.75 లక్షలు డ్రా కోసం అనుమతి ఇవ్వాలని కలెక్టర్‌కు ప్రతిపాదించారు. కలెక్టర్ అనుమతితో ఆ నిధులను డ్రా చేశారు. అయితే.. ఇప్పటి వరకు నూనె కొనుగోలు కోసం ఏపీ ఆయిల్ ఫెడ్‌కు చెల్లించకపోవడం గమనార్హం.



ఆ నిధులను అంగన్‌వాడీలకు కోడిగుడ్లు సరఫరా చేసే కాంట్రాక్టర్‌లకు చెల్లించేందుకు మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆ శాఖ కమిషనర్ కార్యాలయం అధికారులపై ఇందుకు ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం. కోడిగుడ్లకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక నిధులు మంజూరవుతుంటాయి. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సబల నిధులను కోడిగుడ్ల కాంట్రాక్టర్‌లకు చెల్లించాలనే యత్నాలు ఏ విధంగా సబబన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కాంట్రాక్టర్‌ల నుంచి ఐసీడీఎస్ పీడీ కార్యాలయంలో పనిచేసే అధికారులకు, వివిధ ప్రాజెక్టుల సీడీపీవోలకు భారీగా కమీషన్‌లు ముడుతుండడంతోనే ఈ నిధులు మళ్లించేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. అయితే కమిషనర్ కార్యాలయం అధికారులు దీనికి అంగీకరించడం లేదని సమాచారం.



అడ్వాన్స్‌గా డ్రా చేసిన డబ్బులను ప్రభుత్వ ఖజానాకు జమ చేయాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. కలెక్టర్‌కు ప్రతిపాదించిన దానిలో నూనె కొనుగోలు చేస్తామని చెప్పిన అధికారులు ఆ నిధులను తమ కమీషన్‌ల కక్కుర్తి కోసం కోడిగుడ్ల కాంట్రాక్టర్‌కు చెల్లించాలని చూడ్డం విస్తుకలిగిస్తోంది. ఐసీడీఎస్‌కు చైర్మన్‌గా ఉన్న కలెక్టర్‌నే ఈ వ్యవహారంలో ఐసీడీఎస్ అధికారులు తప్పుతోవ పట్టించారు. ఇప్పుడు ఆ నిధులను ప్రభుత్వ ఖజానాకు జమ చేయడమంటే కలెక్టర్ వరకు వ్యవహారం వెళ్తుందని వారిలో గుబులు మొదలైంది.

 

సబల నిలిపివేత..

సబల పథకం నిలిపివేస్తున్నట్లు మే 5న స్త్రీ, శిశు సంక్షేమ శాఖ నుంచి జిల్లా అధికారులకు సమాచారం అందింది. ఈ పథకాన్ని ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, హైదరాబాద్ జిల్లాల్లో అమలు చేస్తుండగా తాజాగా నిలిపివేశారు. కిశోర బాలికలకు ప్రతినెలా 3 కిలోల బియ్యం, కేజీ కంది పప్పు, అరకిలో నూనె, 16 కోడిగుడ్లను అందజేసేవారు. ప్రతి లబ్ధిదారుడికి రోజూ రూ.5 విలువైన సరుకులను నెల కోసం అందిస్తారు.



11 నుంచి 18 ఏళ్ల వయసుగల బడిబయట పిల్లలు సుమారు 1.23 లక్షల మందికి లబ్ధి చేకూర్చే ఈ పథకాన్ని నిలిపివేశారు. పథకం నిలిచిపోతుందని తెలిసే జిల్లా యంత్రాంగాన్నే తప్పుతోవ పట్టించి పీడీ కార్యాలయంలో పనిచేసే కొంత మంది ఉద్యోగులు ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించి నిధులను అడ్వాన్స్‌గా డ్రా చేశారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయంలో ఐసీడీఎస్ పీడీ మీరా బెనర్జీని ‘సాక్షి’ వివరణ కోరగా మార్చి నెలలో సబలకు సంబంధించిన రూ.75.76 లక్షలను నూనె కొనుగోలు కోసం ట్రెజరీ నుంచి విడుదల చేసినట్లు తెలిపారు. వీటిని తిరిగి ప్రభుత్వ ఖజానాకు జమ చేస్తామని వివరించారు. ఇందులో ఎలాంటి దురుద్దేశం లేదని, కమిషనర్ నుంచి వచ్చే ఆదేశాలకు అనుగుణంగా తాము వ్యవహరిస్తామని చెప్పడం కొసమెరుపు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top