ఇక.. కరెంటు కోతలుండవ్

ఇక.. కరెంటు కోతలుండవ్ - Sakshi


రూ.91 వేల కోట్లతో 24 వేల మెగావాట్ల విద్యుత్

రెండేళ్ల తర్వాత సాగుకు 24 గంటల కరెంట్

త్వరలో కాలువల పునరుద్ధరణ పనులు

డ్వాక్రా రుణాల పరిమితి రూ. 5 లక్షల నుంచి రూ. 15 లక్షలకు పెంపు

హరితహారాన్ని విజయవంతం చేయాల్సింది పంచాయతీ అధికారులే

కొప్పుల ఈశ్వర్‌కు మంత్రి పదవిస్తా

ధర్మపురిలోనే పుష్కర స్నానం చేస్తా

కరీంనగర్ జిల్లాలోని పెద్దపల్లి, ధర్మారం సభల్లో సీఎం కేసీఆర్


 

సాక్షి ప్రతినిధి, కరీంనగర్: రాష్ట్రంలో ఇక కరెంట్ కోతలు ఉండవని... రూ.91,500 కోట్ల వ్యయంతో 24 వేల మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసేందుకు ఏర్పాట్లు చేశామని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు తెలిపారు. రాబోయే రెండేళ్ల తరువాత వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్‌ను సరఫరా చేస్తామని చెప్పారు. త్వరలోనే కాలువల పునరుద్ధరణ పనులు చేపడతామని ప్రకటించారు. తద్వారా టెయిల్ ఎండ్ ప్రాంతాల్లోని చివరి పొలాలకూ సాగు నీరందిస్తామన్నారు. డ్వాక్రా రుణాల పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.15 ల క్షల వరకు పెంచుతున్నట్లు తెలిపారు.



గోదావరి పుష్కరాల సమయంలో ధర్మపురిలోనే పుష్కర స్నానం ఆచరిస్తానని పేర్కొన్నారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా ఆదివారం కరీంనగర్ జిల్లాలోని పెద్దపల్లి, ధర్మారం మండల కేంద్రాల్లో పర్యటించి మొక్కలు నాటిన కేసీఆర్.. స్థానికంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో ప్రసంగించారు. తొలుత పెద్దపల్లి సభలో మాట్లాడుతూ హరితహారం కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిన ప్రధాన బాధ్యత పంచాయతీ అధికారులదేనన్నారు. సరిగా పనిచేయని అధికారులపై తీవ్రమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.



‘‘పింఛన్లు, షాదీ ముబారక్, కళ్యాణలక్ష్మి, ఉద్యోగుల జీతాల పెంపు సహా అనేక సంక్షేమ కార్యక్రమాలను ఎవరు అడిగినా అడగకపోయినా అమలు చేస్తున్నాం. కరెంటు, రోడ్లు, ఇతరత్రా అభివృద్ధి పనులకు ఎన్ని కోట్లయినా ఖర్చు చేస్తాం. కానీ వానలను కొనలేం కదా! వానలు రావాలంటే చెట్లు పెంచాలి. అడవులు విస్తరించాలి. అందుకే హరితహారం కార్యక్రమం చేపట్టింది. దీనిని విజయవంతం చేయాల్సిన బాధ్యత మాత్రం స్థానిక ప్రజాప్రతినిధులు, పంచాయతీ అధికారులదే’’ అని ఉద్ఘాటించారు.



ఎవరి ఊరును వారే బాగు చేసుకుంటూ హరితహారం కార్యక్రమాన్ని మహాయజ్ఞంలా చేపట్టాలని పిలుపునిచ్చారు. వారం, పదిరోజులకే హరితహారం పరిమితం చేయొద్దని, వర్షాకాలం ముగిసే వరకు కార్యక్రమాన్ని కొనసాగించాలని సూచించారు. మంత్రులు ఈటల రాజేందర్, జోగు రామన్న, ఇంద్రకరణ్‌రెడ్డి, ఎంపీ బాల్కసుమన్, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ తుల ఉమ, కలెక్టర్ నీతూప్రసాద్, జిల్లాకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

కొప్పుల గొప్పోడు... మంత్రిని చేస్తా

అనంతరం ధర్మపురి నియోజకవర్గంలోని ధర్మారంలో జరిగిన సభలో కేసీఆర్ మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్‌ను పొగడ్తలతో ముంచెత్తారు. ‘‘కొప్పుల ఈశ్వర్ మంచి వ్యక్తి. తెలంగాణ ఉద్యమంలో నాతో కలసి పనిచేసినోడు. కమిట్‌మెంట్, క్యారెక్టర్ ఉన్న గొప్పోడు. మంత్రి పదవి రాలేదని నిరుత్సాహ పడాల్సిన అవసరం లేదు. త్వరలోనే ఈశ్వర్‌ను మంత్రిని చేస్తా’’అని పేర్కొన్నారు.



గత గోదావరి పుష్కరాల్లో ధర్మపురికి వచ్చి పుష్కర స్నానం చేసి తెలంగాణ వస్తే మళ్లీ పుష్కరాలకు వస్తానని లక్ష్మీనరసింహస్వామికి మొక్కుకున్నానని కేసీఆర్ గుర్తుచేసుకున్నారు. భగవంతుడి దయవల్ల తెలంగాణ వచ్చినందున ఈనెల 13న రాత్రి ధర్మపురికి రావడంతోపాటు 14న పుష్కర స్నానం ఆచరిస్తానన్నారు. ధర్మపురి అభివృద్ధికి ఎన్ని కోట్లు అవసరమైతే అన్ని నిధులను ప్రకటిస్తానని హామీ ఇచ్చారు.  

 

సీఎం బస్సుకు సాంకేతిక లోపం

పెద్దపల్లి: సీఎం కేసీఆర్ ప్రయాణిస్తున్న బస్సు సాంకేతిక లోపంతో కరీంనగర్ జిల్లా పెద్దపల్లిలో కాసేపు మొండికేసింది. సీఎం కోసం నూతనంగా కొనుగోలు చేసిన తెలంగాణ ప్రగతి రథంలో పెద్దపల్లి సభకు వచ్చారు. ఆయన బస్సు దిగి సభ వద్దకు వెళ్లగా, ఈ క్రమంలో స్థానిక ట్రినిటీ కళాశాల మైదానానికి బస్సును తీసుకొచ్చారు. అరగంటలో మరమ్మతులు చేసి.. బయటికి తీస్తున్న క్రమంలో బస్సు గోడకు తగలింది. అయితే మరమ్మతు పూర్తయి బస్సు బాగవడంతో సభ తర్వాత సీఎం కేసీఆర్‌తో సహా మంత్రులు, ఎమ్మెల్యేలు అదే బస్సులో ధర్మారం వెళ్లారు. కాగా బస్సును చూసేందుకు వచ్చిన వారంతా రూ. ఐదు కోట్ల బస్సుకు అప్పుడే మరమ్మతులా అంటూ ఆశ్చర్యపోయారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top