విశ్వనగరికి 4,051 కోట్లు

విశ్వనగరికి 4,051 కోట్లు - Sakshi


* రాజధానిలో రాచమార్గాలకు అడుగులు

* స్కైవేలు, ఎక్స్‌ప్రెస్ కారిడార్ల నిర్మాణం

* తొలిదశలో ప్రాధాన్యంగా 20 ప్రాంతాల గుర్తింపు

* డీబీఎంటీ విధానంలో ప్రాజెక్టు అమలు


 

 సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ స్థాయి నగరంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దాలనే ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనకు తొలి అడుగు పడింది. స్ట్రాటజిక్ రోడ్ డెవలప్‌మెంట్ ప్లాన్ (ఎస్‌ఆర్‌డీపీ)లో భాగంగా నగరంలో అధునాతన స్కైవేలు, ఎక్స్‌ప్రెస్ కారిడార్లు, మల్టీ లెవెల్ గ్రేడ్ సెపరేటర్లు/ ఫ్లైఓవర్ల నిర్మాణానికి సంబంధించి త్వరలోనే టెండర్లు పిలవనున్నారు. తొలిదశలో రూ.4,051 కోట్ల మేర పనులకు ప్రభుత్వం సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. ఈ మేరకు పరిపాలనా పరమైన అనుమతులిస్తూ మునిసిపల్ పరిపాలన, పట్టణాభివృద్ధి శాఖ శనివారం జీవో జారీ చేసింది. భూసేకరణ, ఆస్తుల సేకరణకు అయ్యే వ్యయాన్ని కూడా ఈ నిధుల నుంచే వినియోగించాలని పేర్కొంది. ఈ ప్రాజెక్టులో భాగంగా స్కైవేలు, ఎక్స్‌ప్రెస్ కారిడార్లు తదితర నిర్మాణాలతో పాటు సిగ్నళ్ల వద్ద ట్రాఫిక్ ఆగకుండా జంక్షన్లను అభివృద్ధి చేయనున్నారు. తొలిదశ పనులు చేసేందుకు ఇప్పటికే అత్యంత ప్రాధాన్యత కలిగిన 20 ప్రదేశాలు గుర్తించారు.

 

 భారీ వ్యయమయ్యే ఈ ప్రాజెక్టుకు డీబీఎంటీ (డిజైన్, బిల్డ్, మెయింటైన్, ట్రాన్స్‌ఫర్)- యాన్యుటీ విధానాన్ని ఎంచుకున్నారు. అంటే ప్రాజెక్టు పనుల్ని ప్రైవేటు సంస్థలే చేపట్టి పూర్తి చేస్తాయి. ప్రాజెక్టు పూర్తయ్యాక  జీహెచ్‌ఎంసీ వాటికి డబ్బులు తిరిగి చెల్లిస్తుంది. ఇందుకు ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుంది. కాల వ్యవధి 10 నుంచి 15 ఏళ్లు ఉండే అవకాశం ఉంది. భారీ ప్రాజెక్టు కావడంతో అంతర్జాతీయ నిర్మాణ సంస్థలు టెండర్లలో పాల్గొనవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ప్రాజెక్టుకు సంబంధించి జీహెచ్‌ఎంసీ కమిషనర్, ప్రత్యేక అధికారి సోమేశ్ కుమార్ రాసిన లేఖకు స్పందించి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

 

 రెడ్ సిగ్నళ్ల వద్ద రైట్..రైట్..

 నగరంలోని ఆయా ప్రదేశాల్లో ట్రాఫిక్ జాం లేకుండా, రెడ్ సిగ్నళ్ల వద్ద కూడా వాహనదారులు ఆగకుండా వెళ్లేందుకు అవసరాన్ని బట్టి జంక్షన్ వద్ద ఫ్లై ఓవర్లు, అండర్ పాస్‌లు, ఒకటి/ రెండు/ మూడు లెవెల్స్‌లో ఫ్లైఓవర్లు వంటివి ఏర్పాటు చేయనున్నారు. మెట్రోరైలు మార్గాలున్న ఉప్పల్ వంటి ప్రాంతాల్లో మెట్రో మార్గానికి పై వరుసలో లేదా దిగువ వరుసలో వీటిని ఏర్పాటు చేస్తారు.

 

 టెండర్లకు పీఎంయూ ..

 ఈ నిర్మాణాలకు సంబంధించిన టెండర్ల నిర్వహణకు ప్రభుత్వం ప్రాజెక్టు మానిటరింగ్ కమిటీ (పీఎంయూ)ని నియమించింది. కమిటీ చైర్మన్‌గా జీహెచ్‌ఎంసీ కమిషనర్, స్పెషలాఫీసర్‌లను, మెంబర్ కన్వీనర్‌గా జీహెచ్‌ఎంసీ ఇంజనీర్ ఇన్ చీఫ్‌ను, సభ్యులుగా హెచ్‌ఎండీఏ చీఫ్ ఇంజనీర్, ఫైనాన్స్ (పీఎంయూ) విభాగానికి చెందిన ప్రతినిధిని నియమించింది. భూసేకరణ వ్యయాన్ని తగ్గించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాల్సిందిగా సూచించింది. ఈ మేరకు భూ యజమానులతో సంప్రదింపులు జరపాలని, మాస్టర్‌ప్లాన్ రోడ్లకు అమలు చేసిన టీడీఆర్ వంటి విధానాలను  అమలు చేయాలని సూచించింది.

 

 అభివృద్ధి పనులు చేపట్టనున్న ప్రదేశాలు

 1.    కేబీఆర్ పార్కు ప్రవేశద్వారం జంక్షన్

 2.    మహారాజ అగ్రసేన్ జంక్షన్

     (రోడ్డు నంబర్ 12 జంక్షన్)

 3.    కేన్సర్ హాస్పిటల్ (రోడ్డు నంబర్ 10 జంక్షన్)

 4.    ఫిల్మ్‌నగర్, 5. రోడ్డు నంబరు 45 జంక్షన్

 6.    జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు జంక్షన్

 7.    ఎల్‌బీ నగర్ జంక్షన్

 8.    బైరామల్‌గూడ జంక్షన్

 9.    కామినేని హాస్పిటల్ జంక్షన్ (ఇన్నర్ రింగ్‌రోడ్డుపై)

 10. చింతలకుంట చెక్‌పోస్టు జంక్షన్

 11. రసూల్‌పురా

 12. ఉప్పల్

 13. ఒవైసీ హాస్పిటల్

 14. బయో డైవర్సిటీ పార్కు జంక్షన్

 15. అయ్యప్ప సొసైటీ జంక్షన్

 16. రాజీవ్‌గాంధీ విగ్రహం జంక్షన్

 17. బహదూర్‌పురా

 18. ఆబిడ్స్ జీపీఓ - చాదర్‌ఘాట్, మలక్‌పేట

 19. సైబర్ టవర్స్ జంక్షన్ (ఎలివేటెడ్ రోటరీ కమ్ గ్రేడ్)

 20. మైండ్‌స్పేస్

 నోట్: వీటిల్లో గ్రేడ్ సెపరేటర్లు/ఫ్లై ఓవర్లు/జ ంక్షన్ల

 అభివృద్ధి, ఇతరత్రా పనులున్నాయి.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top