రూ.18లక్షలు గోల్‌మాల్!


కరీంనగర్ రూరల్: కరీంనగర్ మండల పరిషత్ కార్యాలయం అవినీతికి నిలయంగా మారింది. తాత్కాలిక ఎంపీడీవోలు ఇష్టారాజ్యంగా వ్యవహరించి లక్షలాది రూపాయల ప్రజాధనాన్ని దోచుకున్నారు. ఎన్నికల స్టేషనరీ, బోరుబావుల పైపులు, సామగ్రి కొనుగోలు, మరమ్మతుల పేరిట దొంగ బిల్లులను సమర్పించి ఏడాదిన్నరకాలంలో రూ.18 లక్షలు దండుకున్నారు. ఉన్నతాధికారులు అవినీతికి సహకరించారు. అయితే వాటాల పంపిణీలో తేడా రావడంతో ‘గోల్‌మాల్’ బాగోతం వెలుగు చూసింది.

 

 కరీంనగర్ ఎంపీడీవోగా పనిచేసిన బి. దేవేందర్‌రాజు గతేడాది మే 20 నుంచి ఫిబ్రవరి 23వరకు పనిచేశారు. ఎన్నికల బదిలీల్లో భాగంగా ఖమ్మం జిల్లాకు వెళ్లగా వరంగల్ జిల్లా నుంచి ఎం.శ్రీను ఫిబ్రవరి 26న విధుల్లో చేరి జూలై 8వ తేదీ వరకు కొనసాగారు. అన ంతరం ఆయన బదిలీపై వెళ్లగా ఈవో పీఆర్డీ దేవకీదేవి ఇన్‌చార్జి ఎంపీడీవోగా జూలై 14వ తేదీ వరకు కొనసాగారు. అనంతరం ఎంపీడీవోగా వచ్చిన వీరబుచ్చయ్య సెప్టెంబరు 16వ తేదీ వరకు పనిచేశారు. ఇలా పనిచేసిన అధికారులు ఎవరి ‘టైం’లో వారు అందినకాడికి దండుకున్నారు. రూ.18 లక్షలు మింగారు.

 

 ఎన్నికల నిధులు రూ.6 లక్షలు స్వాహా..

 ఎంపీటీసీ ఎన్నికలను నిర్వహణకు సంబంధించిన నిధులను అప్పటి ఎంపీడీవో ఎం.శ్రీను స్వాహా చేసినట్లు తెలుస్తోంది. ఎన్నికల విధులు నిర్వహించిన సిబ్బంది వేతనాలు, అలవెన్స్‌లు, వాహనాల కిరాయి తదితర వాటికి చెల్లించడానికి ప్రభుత్వం నిధుల వినియోగానికి ఎంపీడీవోకు అధికారాన్ని కల్పించింది. అయితే ఎన్నికల స్టేషనరీ కొనుగోలు, సిబ్బందికి అలవెన్స్‌లు, వాహనాల కిరాయిలపేరిట సిబ్బంది సహకారంతో దొంగ బిల్లులు సమర్పించి మండల పరిషత్ నిధులు రూ.6 లక్షలు డ్రా చేశారు. అయితే ఎలాంటి ఖర్చుపెట్టకుండానే నిధులు స్వాహా చేసినట్లు తెలిసింది. ఈ వ్యవహరంలో సహకరించిన మండల పరిషత్ సిబ్బందిలో కొందరికి వాటాలు అందినట్లు సమాచారం.

 

 బోరుబావుల విడిభాగాల

 కొనుగోళ్లలో అక్రమాలు

 ముగ్గురు ఎంపీడీవోలు పనిచేసిన కాలంలో బోరుబావుల మరమ్మతులు, విడిభాగాల కొనుగోళ్ల కోసం భారీగా నిధులు వినియోగించారు. ఎన్నికలకు ముందు ఎంపీడీవోగా పనిచేసిన దేవేందర్‌రాజు రూ.2 లక్షలతో బోరు పైపులు, హ్యాండ్‌సెట్లు కొనుగోలు చేశారు. అనంతరం ఎన్నికల వేళ ఎంపీడీవోగా పనిచేసిన ఎం.శ్రీను హయాంలో రూ.4 లక్షలు, వీరబుచ్చయ్య పదవీకాలంలో రూ.3 లక్షల విడిభాగాలను కొనుగోలు చేసినట్లు బిల్లులను సమర్పించారు. మరో రూ.3 లక్షలను ఇతర బోరు పరికరాల కొనుగోలు పేరిట బిల్లులను సమర్పించి రికార్డు చేశారు.

 

 ముగ్గురు ఎంపీడీవోలు పనిచేసిన ఏడాదిన్నరకాలంలోనే రూ. 17.67 లక్షలు బోరుబావుల తవ్వకం, విడిభాగాల కొనుగోళ్లు, ఎన్నికల ఖర్చు పేరిట బిల్లులను సమర్పించి దండుకున్నారు. అయితే క్షేత్రస్థాయిలో ఎలాంటి పనులు జరగకపోవడం..  అవినీతికి అండగా నిలిచిన సిబ్బంది ప్రస్తుతం వాటాల్లో విభేదాలు రావడంతో ఈ వ్యవహారం వెలుగుచూసింది. అధికారుల అవినీతికి తాము బలవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులు సమగ్ర విచారణ నిర్వహించినట్లయితే మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశముందని ఉద్యోగులు పేర్కొంటున్నారు.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top