‘హిందూస్థాన్’ గోదాంలో అర్ధరాత్రి చోరీ


 నర్సాపూర్ : మెదక్ జిల్లా నర్సాపూర్‌లోని హిందూస్థాన్ లివర్ లిమిటెడ్ సంస్థకు చెందిన గోదాంలో సోమవారం రాత్రి దొంగలు పడ్డారు. సుమారు రూ. 46 వేల విలువైన సరుకును అపహరించారు. అయితే ఈ సమాచారాన్ని అందుకున్న పోలీసులు సరుకును తీసుకెళుతున్న వాహనాన్ని వెంబడించడంతో దొంగలు వాహనాన్ని వదలి పారిపోయారు. ఎస్‌ఐ గోపీనాథ్ కథనం మేరకు.. హిందూస్థాన్ గోదాం షెటర్‌ను గడ్డపారతో పైకి లేపి దొంగలు లోనికి ప్రవేశించారు.



 అంతకు ముందే షెటర్ సమీపంలో ఉన్న సీసీ కెమెరాను పనిచేయకుండా చేశారు. దొంగలు తమతో తెచ్చుకున్న బొలెరో వాహనంలో సబ్బులు, ఇతర సామగ్రిని నింపుకుంటుండగా యజమాని గౌరయ్యగుప్తా గమనించి అక్కడకు పరుగెత్తుకొస్తుండగా గమనించిన దొంగలు అతనిపై రాళ్లు రువ్వుతూ వాహనంతో అక్కడి నుంచి ఉడాయించారు. ఈ విషయాన్ని వెంటనే వారు పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో పోలీసులు తమ వాహనంలో బయలుదేరి దొంగల వాహనాన్ని వెంబడించారు.



ఈ మధ్యలో జిన్నారం మండలం బంతపల్లి వద్ద ఉన్న పోలీసు చెక్‌పోస్టు ఇన్‌చార్జ్ ఏఎస్‌ఐ రాంచందర్‌రావుకు సమాచారం అందించారు. ఆయన కూడా సిబ్బందితో వాహనాన్ని వెంబడించడంతో దొంగలు జిన్నారం మండలం అన్నా రం సమీపంలో వాహనాన్ని వదిలి పారిపోయారు.



 చోరీ చేసిన వాహనంలోనే చోరీకి..

 హిందూస్తాన్ లివర్ లిమిటెడ్‌లో చోరీకి దొంగలు వినియోగించిన వాహనం కూడా చోరీ చేసిందే కావడం గమనార్హం. ఈ వాహనం రంగారెడ్డి జిల్లా ధారూర్ గ్రామానికి చెందిన రాంరెడ్డిది పోలీసులు గుర్తించారు. గత నెల 29 రాత్రి బొలెరోలో కూరగాయలు నింపుకొని రాంరెడ్డి డ్రైవర్ పాషా వికారాబాద్ న్యూగంజ్ మార్కెట్‌కు తీసుకువచ్చాడు.



ఈ సమయంలో ఇద్దరు వ్యక్తులు పాషా వద్దకు వచ్చి తమది మెదక్ జిల్లా సదాశివపేట పట్టణమని,  ఇల్లు ఖాళీ చేస్తున్నామని వాహనం అద్దెకు కావాలని అడిగారు. దీంతో డ్రైవర్ పాషా వారితో కలిసి బయలుదేరాడు. మార్గంమధ్యలో డ్రైవర్‌ను బెదిరించి వాహనాన్ని ఆ ఇద్దరూ చోరీ చేశారు. ఈ మేరకు వికారాబాద్ పీఎస్‌లో కేసు నమోదైంది. ఇదే వాహనంతో గోదాంలో దొంగలు చోరీకి యత్నించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top