ఠాణాలో కలకలం


గొంతుకోసుకుని నిందితుడి ఆత్మహత్యాయత్నం

గద్వాల పోలీస్‌స్టేషన్‌లో  ఓ యువకుడి అఘాయిత్యం

గోప్యంగా  ఉంచిన పోలీసులు


 

 గద్వాల: చోరీకేసులో నిందితుడిగా ఉన్న ఓ యువకుడు ఠాణా ఆవరణలో గొంతుకోసుకుని ఆత్మహత్యాయత్యానికి పాల్పడ్డాడు. ప్రాణాపాయస్థితిలో కొట్టుమిట్టాడుతుండగా చికిత్సకోసం ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటన మంగళవారం గద్వాల పోలీస్   స్టేషన్ ఆవరణలో జరిగింది. విశ్వసనీయ సమాచారం మేరకు.. జడ్చర్ల మండలం దేవునికుంటతండాకు చెందిన కాట్రావత్ రాజు(22) మంగళవారం తెల్లవారుజామున స్థానిక కేవీఎస్ ఫంక్షన్‌హాల్ ఎదురుగా ఓ ఇంటిమిద్దెపై నిద్రిస్తున్న వినోద్ సెల్‌ఫోన్ దొంగిలించాడు.



స్థానికంగా గస్తీ నిర్వహిస్తున్న గూర్ఖా ప్రేమ్‌బహదూర్‌కు కనిపించడంతో వెంబడించి పట్టుకున్నాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య కొద్దిసేపు గొడవ జరిగింది. అటువైపుగా వస్తున్న ఆటోడ్రైవర్ సహాయంతో రాజును టౌన్ పోలీస్‌స్టేషన్‌లో అప్పగించాడు. సెల్‌ఫోన్ల చోరీకి పాల్పడిన రాజును పోలీసులు కొట్టినట్లు తెలిసింది. ఈ క్రమంలో ఉదయం 7గంటల ప్రాంతంలో స్టేషన్ వెనకభాగంలో రాజు బ్లేడ్‌తో గొంతుకోసుకొని పెద్దఎత్తున అరిచాడు. ప్రాణాపాయస్థితిలో కొట్టుమిట్టాడుతున్న రాజును స్థానిక ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో కర్నూలులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి వైద్యచికిత్సలు అందిస్తున్నారు. సీఐ సురేష్, టౌన్‌ఎస్‌ఐ సైదాబాబు రాజు ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు.  



 గోప్యంగా ఉంచిన పోలీసులు..

 కాగా, ఈ విషయాన్ని పోలీసులు గోప్యంగా ఉంచారు. కర్నూలు ప్రభుత్వాసుపత్రిలో నిందితుడు రాజును చేర్చితే గొంతుకోసుకున్న విషయం బహిర్గతమవుతుందనే ఉద్ధేశంతో గుట్టుచప్పుడు కాకుండా ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించి వైద్యం అందిస్తున్నారు. స్టేషన్ ప్రాంగణంలో రక్తపు మరకల ఆనవాళ్లు లేకుండా చేశారు. ఉదయం 10గంటల వరకు ఏ పోలీసు అధికారి కూడా ఈ సంఘటనను ధ్రువీకరించలేదు. ఈ విషయమై టౌన్‌ఎస్‌ఐ సైదాబాబును వివరణ కోరగా.. స్టేషన్ ఎదురుగా ఎవరో గొంతు కోసుకొని కిందపడి ఉంటే ఆస్పత్రిలో చేర్పించామని తెలిపారు. అనంతరం డీఎస్పీ బాలకోటి టౌన్ పోలీస్‌స్టేషన్‌ను సందర్శించారు. స్టేషన్ ప్రాంగణంలో గొంతు కోసుకున్న సంఘటన ప్రదేశాన్ని పరిశీలించి వివరాలు ఆరాతీశారు.



 దేవునిగుట్ట తండాలో విషాదం

 జడ్చర్ల: ఈ ఘటన దేవునిగుట్టతండా వాసులను ఆందోళనకు గురిచేసింది. గద్వాల ఠాణాలో కాట్రావత్ రాజు గొంతుకు తీవ్రగాయం కావడంతో పోలీసులు కర్నూలు ఆస్పత్రికి తరలించారు. దీంతో విషయం తెలిసిన అతడి తల్లిదండ్రులు ఘోరీ, సోమ్లా తదితర తండావాసులు హుటాహుటిన కర్నూలుకు తరలివెళ్లారు. రాజు వైద్యచికిత్సల అనంతరం క్రమంగా కోలుకుంటున్నాడని తండాకు చెందిన అతడి బంధువు జెమ్లానాయక్ తెలిపారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top