దొంగ - పోలీస్.. దోబూచులాట!

దొంగ - పోలీస్.. దోబూచులాట! - Sakshi


బ్యాంకుకు కన్నమేసేందుకు ప్రయత్నించిన ఇద్దరు దొంగలు

 వీలుకాకపోవడంతో మద్యం తాగి, బజ్జీలు తిని లోపలే నిద్ర!

వారి వద్ద ఆయుధాలుండొచ్చని రాత్రంతా పోలీసుల కాపలా

 పెద్దేముల్‌లోని విజయా బ్యాంకులో సినీ ఫక్కీలో ఘటన  

 

 పెద్దేముల్:  అనగనగా ఇద్దరు ‘చిన్న’ దొంగలు.. రంగారెడ్డి జిల్లా పెద్దేముల్‌కే చెందిన వారిద్దరి పేర్లు బ్యాగరి లక్ష్మప్ప(26), బ్యాగరి సురేష్(25). వీరు స్థానిక విజయా బ్యాంకులో దోపిడీకి ప్రణాళిక రచించారు. సోమవారం రాత్రి 12 గంటల తర్వాత మద్యం తాగి బ్యాంకు వద్దకు చేరుకున్నారు. బ్యాంకు వెనుక  గోడకు కన్నంవేసి లోపలికి ప్రవేశించారు. మొదట ఏటీఎంను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు.  తర్వాత లాకర్‌ను గునపంతో తెరిచేందుకు యత్నించినా వారి వల్ల కాలేదు. ఈ క్రమంలో బ్యాంకు నుంచి శబ్దాలు రావడం గమనించిన గ్రామస్తులు  కానిస్టేబుల్ ఖదీర్ కు సమాచారమిచ్చారు. ఆయన ఎస్‌ఐ రమేష్‌కు, సీఐ రవికి  తెలపడంతో వెంటనే సిబ్బందితో వారు బ్యాంకు వద్దకు చేరుకున్నారు. ఇదంతా జరిగేందుకు రెండు మూడు గంటలు పట్టింది. బ్యాంకుకు వేసిన కన్నం వద్ద చెప్పులు, ఒక చొక్కా దొరికాయి. చొక్కా కాలర్‌పై కర్ణాటక రాష్ట్రం టైలర్ పేరు ఉంది. దీంతో బ్యాంకు దోపిడీకి వచ్చింది కర్ణాటక దొంగల ముఠా అయి ఉంటుందని పోలీసులు అనుమానించారు. వారివద్ద ఆయుధాలు ఉండొచ్చని భావించి బ్యాంకు చుట్టూ పోలీసులను మోహరించారు. తెల్లారడంతో విషయం తెలిసిన గ్రామస్తులంతా బ్యాంకు వద్దకు చేరారు. బ్యాంకు మేనేజర్ రాము కూడా తాళాలు తీసుకొచ్చారు. కానీ లోపలికి వెళ్లేందుకు పోలీసులు మాత్రం సాహసించలేదు.

 ఖాకీల మర్యాద మంత్రం: ఏం చేయాలో పాలుపోక పోలీసులు దొంగలను బయటకు రప్పించేందుకు మర్యాద మంత్రాన్ని పాటించారు. ‘మీరు దొంగతనానికి వచ్చినా సరే.. మీపైన కేసులు పెట్టం.. మిమ్మల్ని ఏమీ చేయం.. బయటకు రండి’ అంటూ తెలుగు, హిందీ భాషల్లో అరగంటపాటు కన్నం నుంచే బతిమాలుకున్నారు.   ఇది గ్రహించిన దొంగలు బ్యాంకు లోపలే తమవెంట తెచ్చుకున్న మద్యం తాగి, బజ్జీలు తిని హాయిగా నిద్రపోయారు.

 

 చివరకు ఇలా దొరికారు: సమయం.. ఉదయం ఆరున్నర. దొంగల్లో ఒకరైన లక్ష్మప్ప నిద్రలేచాడు. కన్నం వద్దకు వచ్చి చూశాడు. పోలీసులు అక్కడే ఉన్నారు. అతడిని గమనించిన పోలీసులు ‘నిన్ను ఏమీ చేయం.. బయటకురా..’ అని పిలిచారు. దాంతో అతను కన్నం ద్వారా బయటకు వచ్చాడు. ఇంకా లోపల ఎంతమంది ఉన్నారని పోలీసులు ప్రశ్నించగా.. మరొకడు నిద్రపోతున్నాడని చెప్పాడు. చోరీకి వచ్చింది కర్ణాటక దొంగలు కాదని, ‘లోకల్’ దొంగలేనని నిర్ధారించుకున్న పోలీసులు ధైర్యం చేశారు. బ్యాంకు మేనేజర్ ప్రధాన ప్రవేశద్వారం తాళం తీయగా లోపలికి వెళ్లారు. లోపల వెతగ్గా బ్యాంకు స్టోర్‌రూం సజ్జపైన సురేష్ నిద్రపోయి ఉన్నాడు. పోలీసులు  అతడ్ని నిద్రలేపి అదుపులోకి తీసుకున్నారు. ఎస్పీ రాజకుమారి, ఏఎస్పీ వెంకటస్వామి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఈ దొంగలు- పోలీసుల మధ్య దోబూచులాట మంగళవారం ఉదయం 7 గంటలకు ముగిసింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top