ప్రజలందరికీ తాగునీటి హక్కు:కేటీఆర్

ప్రజలందరికీ తాగునీటి హక్కు:కేటీఆర్


ఇంతకుమించిన ప్రాధాన్యత ప్రభుత్వానికి మరొకటి లేదు

మహిళలకే ప్రాజెక్టు బాధ్యతలు

మంచి పేరు పెడితే బహుమతి

వాటర్‌గ్రిడ్‌పై మీడియా సమావేశంలో వెల్లడి


సాక్షి, హైదరాబాద్: విద్యా హక్కు, సమాచార హక్కు మాదిరిగానే తెలంగాణ ప్రజలందరికీ తాగునీటి హక్కు(రైట్ టు డ్రింకింగ్ వాటర్)ను కల్పించాలన్నది సీఎం కె.చంద్రశేఖర్‌రావు ఆకాంక్ష అని పంచాయతీరాజ్ మంత్రి కె.తారకరామారావు చెప్పారు. సీఎం ఆకాంక్షకు అనుగుణంగా రూపుదిద్దుకుంటున్న వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టును ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే మూడేళ్లలో పూర్తి చేస్తామన్నారు.



ఇంటింటికీ నల్లా ఇవ్వకుంటే.. వచ్చే సాధారణ ఎన్నికల్లో ఓట్లడగనని కేసీఆర్ చేసిన భీష్మ ప్రతిజ్ఞను సఫలం చేయడానికి మించిన ప్రాధాన్యత ప్రభుత్వానికి మరొకటి లేదన్నారు. వాటర్‌గ్రిడ్ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించే నిమిత్తం మంత్రి కేటీఆర్ మంగళవారం మహబూబ్‌నగర్ జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా వాటర్‌గ్రిడ్ కీలక అంశాలను ఆయన మీడియాకు వెల్లడించారు. వివరాలు ఆయన మాటల్లోనే..

 

మోదీ లేఖతోనే వాటర్‌గ్రిడ్‌కు నాంది..

రాష్ర్ట ప్రభుత్వం కొలువుదీరిన తొలివారంలో ప్రధాని నరేంద్ర మోదీ నుంచి నాకు లేఖ వచ్చింది. రాష్ట్రంలోని అన్ని గ్రామాల ప్రజలకు సురక్షిత నీరు అందించేలా వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టులను చేపట్టాలని, గుజరాత్‌లో తాము చేపట్టి, విజయవంతంగా నిర్వహిస్తున్న వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టును సందర్శించాలని అందులో సూచిం చారు. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లగా.. నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు నీరందించే ప్రాజెక్టును 15 ఏళ్ల క్రితమే సిద్ధిపేట్‌లో విజయవంతంగా పూర్తి చేశామన్నారు.



అయినప్పటికీ గుజరాత్ వాటర్‌గ్రిడ్‌ను, సిద్ధిపేట్ ప్రాజెక్టును అధ్యయనం చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. వాటర్‌గ్రిడ్ ప్రారంభానికి మునుపు గుజరాత్‌లో దుర్భర పరిస్థితులున్నాయి. నిత్యం 4 వేల ట్యాంకర్లతో తాగునీటిని సరఫరా చేసేవారు. రైళ్ల ద్వారా కూడా నీటి సరఫరా జరిగేది. అలాంటిది, ప్రస్తుతం అక్కడి ప్రజలకు అవసరమైన మేరకు సురక్షిత తాగునీరు లభిస్తోంది. తెలంగాణలో నీరు దొరకని పరిస్థితి లేకున్నా.. సురక్షితమైన నీరు లభించక ప్రజలు ఆనారోగ్యం పాలవుతున్నారు.



అంతేకాకుండా గుజరాత్‌లో భౌగోళిక పరిస్థితులు తెలంగాణలోని పరిస్థితులకు భిన్నంగా ఉన్నా యి. అక్కడికన్నా ఇక్కడ ఎత్తు పల్లాలు అధిక ం. ఈ నేపథ్యంలో కరువు కాలంలోనూ నీరు లభ్యమయ్యేలా కృష్ణా, గోదావరి జీవనదుల నుంచి నీటిని తీసుకుని గ్రావిటీ ద్వారా గ్రామాలకు సరఫరా చేయాలని నిర్ణయించాం. ఈ తరహాలోనే విజయవంతంగా అమలవుతున్న సిద్ధిపేట్ ప్రాజెక్టునే మోడల్‌గా తీసుకున్నాం.

 

ఇరిగేషన్ శాఖతో పేచీల్లేవ్..

వాటర్‌గ్రిడ్‌కు నీటిలభ్యతపై నీటిపారుదల శాఖతో ఎటువంటి పేచీల్లేవు. ప్రతి ప్రాజెక్టులో కనీసం 10 శాతం నీటిని తాగునీటి అవసరాల కోసం వినియోగించుకునే హక్కుంది. కృష్ణా, గోదావరి నదులపై ఉన్న ఇరిగేషన్  ప్రాజెక్టుల్లో రాష్ట్రానికి 800 టీఎంసీలు పొందే హక్కుంది. ఇందులో 10 శాతం అంటే 80 టీఎంసీల నీటిని వాటర్‌గ్రిడ్‌కు వినియోగించుకోవచ్చు. వాస్తవానికి అవసరమైన నీరు 39 టీఎంసీలే.  నిర్మాణాలు, పవర్‌స్టేషన్ల ఏర్పాటుకు భూమి తదితర అంశాలకు సంబంధించి నీటిపారుదల శాఖ నుంచి అన్ని అనుమతులు లభించాయి.

 

వచ్చే నెల రెండో వారంలో పైలాన్..

మూడేళ్లలో వాటర్‌గ్రిడ్‌ను పూర్తి చేసేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. ఫిబ్రవరి రెండో వారంలో వాటర్‌గ్రిడ్ పైలాన్‌ను సీఎం కేసీఆర్ ఆవిష్కరించడంతో పనులు ప్రారంభమవుతాయి. టర్న్‌కీ విధానం ద్వారా నీటి వనరుల నుంచి గ్రామాలకు సరఫరా చేస్తాం. వాటర్‌గ్రిడ్ పూర్తయితే ప్రతి గ్రామంలో ఒక్కో వ్యక్తికి రోజుకు 100 లీటర్లు, మున్సిపాల్టీల్లో 135 లీటర్లు, నగరాల్లో 150 లీటర్ల మంచినీరు అందుతుంది. గ్రిడ్ బాధ్యతలు చేపట్టిన ఆర్‌డబ్ల్యూఎస్ విభాగానికి 1,238 పోస్టులను కొత్తగా మంజూరు చేశాం.



తగినన్ని వాహనాలు, ల్యాప్‌ట్యాప్‌లు అందించాం. నిధుల కొరత ఏర్పడకుండా మిగిలిన ప్రాజెక్టులకు కేటాయింపులు నిలిపేసైనా వాటర్‌గ్రిడ్ కోసం వెచ్చించాలని ప్రభుత్వం భావిస్తోంది. తొలి దశలో 4 వేల గ్రామాలకు నీరందించే పనులకు రూ. 1,340 కోట్లను మంజూరు చేసింది. వాటర్‌గ్రిడ్ కార్పొరేషన్ ఏర్పాటు ప్రక్రియ తుది దశలో ఉంది. హడ్కో, జైకా సంస్థలు నిధులిచ్చేందుకు సుముఖంగా ఉన్నాయి.

 

గ్రిడ్ నిర్వహణే సవాల్..

వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టు నిర్వహణ బాధ్యత లను  మహిళలకే అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రజల నుంచి పన్నులు వసూలు చేసే బాధ్యత  కూడా వారికే అప్పగిస్తున్నాం.

 

పేరు పెట్టండి.. బహుమతి పట్టండి

వాటర్‌గ్రిడ్ పథకానికి మంచి పేరు పెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. మంచి పేరు సూచిం చిన వారికి ప్రభుత్వం తరఫున మంచి బహుమతిని అందిస్తాం.

 

అభయహస్తం పథకానికి కొత్త రూపు

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: శ్రీశైలం ప్రాజెక్టు బ్యాక్‌వాటర్ నుంచి మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్లగొండ జిల్లాల్లో తాగునీటి అవసరాల కోసం 13.11 టీఎంసీల కృష్ణానీటిని వినియోగిస్తామని పంచాయతీరాజ్, ఐటీ శాఖల మంత్రి కె.తారక రామారావు వెల్లడించారు. మహబూబ్‌నగర్ జిల్లా కొల్లాపూర్ మండలం ఎల్లూరు వద్ద మహాత్మాగాంధీ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ మొదటి దశ పంప్‌హౌస్‌ను మంత్రులు జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి, పార్లమెంటరీ కార్యదర్శి శ్రీనివాస్‌గౌడ్, జిల్లా ఎమ్మెల్యేలతో కలసి మంగళవారం ఆయన సందర్శించారు.



అనంతరం అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ వచ్చే నెలాఖరుకు అభయహస్తం పథకం బకాయిలు చెల్లించడంతో పాటు పథకానికి కొత్త రూపు ఇస్తాం. అభయహస్తం లబ్ధిదారులను ఆసరా పథకం కిందకు తెస్తాం. వడ్డీలేని రుణాలిచ్చి, బకాయిలు కూడా త్వరలో చెల్లిస్తామన్నారు. ఆసరా పథకంలో చెంచుల వయో పరిమితిని 50 ఏళ్లకు తగ్గించి పింఛన్లు ఇస్తామని ప్రకటించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top