ఆ టికెట్ ఎవరిదో?

ఆ టికెట్ ఎవరిదో? - Sakshi


మెదక్ ఉప ఎన్నికల బరిలో నిలిచేందుకు ఆశావాహులు సన్నాహాలు మొదలుపెట్టారు. ప్రధాన పార్టీల తరపున పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్నవారు తమ తమ స్థాయిలో పైరవీలు మొదలుపెట్టారు. ఈ క్రమంలో అన్ని పార్టీల్లో పలువురు పేర్లు తెరపైకి వస్తున్నాయి. వీరిలో ఉద్యోగ సంఘాలు, ఉద్యమ నాయకులు, కోటీశ్వరులు ఉండడం గమనార్హం.



కాంగ్రెస్ తరపున పోటీ చేసేందుకు మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ సముఖత వ్యక్తం చేశారు. తన అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల పర్యవేక్షకుడు దిగ్విజయ్ సింగ్ ను ఆయన కోరినట్టు తెలిసింది. అయితే టీఆర్ఎస్ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాంను నిలిపితే ఎలా ఉంటుందనే దానిపై కాంగ్రెస్ పార్టీ యోచనలు చేస్తోంది. ఒకవేళ పోటీకి కోదండరాం నిరాకరిస్తే కేంద్ర మాజీ మంత్రి జైపాల్రెడ్డిని హస్తం పార్టీ భావిస్తున్నట్టు తెలుస్తోంది.



ఇక టీఆర్ఎస్ పార్టీ తరపున పోటీ చేసేందుకు తెలంగాణ నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ సెంట్రల్ అసోసియేషన్ (టీఎన్‌జీఓస్) అధ్యక్షుడు జి. దేవీప్రసాదరావు ముందుకు వచ్చారు. సోనీ ట్రావెల్స్ అధినేత కే. ప్రభాకర్ రెడ్డి, మహిధర కన్స్ట్రక్షన్స్ ప్రమోటర్ ప్రశాంత్ రెడ్డి పేర్లు కూడా వినబడుతున్నాయి. మల్కాజ్గిరిలో పోటీ చేసి ఓడిపోయిన మైనంపల్లి హనుమంతరావు కూడా మెదక్ ఎంపీ సీటు ఆశిస్తున్నట్టు సమాచారం. కేసీఆర్ సింగపూర్ నుంచి వచ్చిన తర్వాత అభ్యర్థి ఎవరనేది తేలనుంది.



ఇక ఎన్డీఏ అభ్యర్థిగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి పేరు వినబడుతోంది. ఎం రఘనందన్ కూడా ఆశావహుల లిస్టులో ఉన్నారు. సెప్టెంబర్ 13న జరగనున్న మెదక్ ఉప ఎన్నికలో ఎవరెవరు బరిలో ఉంటారనేది మరికొద్ది రోజుల్లో స్పష్టత వస్తుంది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top