తుమ్మల.. నీకిది తగునా..

తుమ్మల.. నీకిది తగునా..


► టీటీడీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి


సత్తుపల్లి: సత్తుపల్లికి ఇవ్వాల్సిన నీటిని పాలేరుకు తరలించి.. రాజకీయ జన్మనిచ్చిన సత్తుపల్లి ప్రజల కడుపుకొట్టడం నీకు తగునా అని తెలంగాణ టీడీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి మంత్రి తుమ్మల నాగేశ్వరరావును ప్రశ్నించారు. స్థానిక బస్టాండ్‌ రింగ్‌ సెంటర్‌లో మంగళవారం రాత్రి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అధ్యక్షతన జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. పాలేరుకు నీళ్లు ఇచ్చేందుకు తాము వ్యతిరేకం కాదని.. అయితే సత్తుపల్లి నీళ్లు ఇవ్వటం ఎంతవరకు న్యాయమన్నారు. నీ మిత్రుడు సండ్ర వెంకటవీరయ్యను అక్రమ కేసుల్లో ఇరికించి.. జైలుకు పంపిస్తుంటే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఒక్కమాట కూడా మాట్లాడకపోవటం అన్యాయమని అన్నారు.


ఐదుసార్లు ఎమ్మెల్యేను, మంత్రిని చేసిన టీడీపీపై ఎందుకు అంత విషం చిమ్ముతున్నారని, ఉపకారం చేస్తే.. అపకారం చేయటం తగునా అని ప్రశ్నించారు. సత్తుపల్లి జిల్లా కావాలనే ప్రజల న్యాయమైన కోర్కెను పక్కనబెట్టి.. అల్లుడికో జిల్లా.. కొడుక్కో జిల్లా.. బిడ్డకో జిల్లా కానుకగా ఇచ్చి.. అర్హతలున్న సత్తుపల్లికి అన్యాయం చేశారన్నారు. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చి బడ్జెట్‌లు ప్రవేశ పెట్టినా.. రూ.5లక్షల కోట్లు ఖర్చు పెడితే ఎక్కడా పేదలకు ఉపయోగం జరగలేదని విమర్శించారు.  టీఆర్‌ఎస్‌కు 2019 ఎన్నికల్లో రాజకీయ చావు తప్పదని ఆయన హెచ్చరించారు.




కేసీఆర్‌ దుర్మార్గాన్ని బయట పెడతారని.. : ఎల్‌.రమణ

రేవంత్‌రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య కేసీఆర్‌ దుర్మార్గాన్ని, దోపిడీని బయట పెడతారని అసెంబ్లీ నుంచి సస్పెండ్‌ చేశారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌.రమణ అన్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు గవర్నర్‌ను అసభ్య పదజాలంతో దూషించారని నిరూపిస్తే వారు రాజీనామా చేసేందుకు సిద్ధమని సవాల్‌ చేశారు. రాష్ట్రంలో నిరంకుశ పాలన సాగుతోందని, టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని గద్దె దించేవరకు విశ్రమించేది లేదన్నారు. దొరల తరహాలో కేసీఆర్‌ ప్రభుత్వ పాలన సాగుతోందని ఆరోపించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలోనే జిల్లా అభివృద్ధి చెందిందన్నారు. కేసీఆర్‌ నిరంకుశ పాలనపై గవర్నర్, రాష్ట్రపతిని కలుస్తామని, అవసరమైతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామన్నారు.  


అసెంబ్లీలో లేకున్నా.. : ఎమ్మెల్యే సండ్ర

గవర్నర్‌ ప్రసంగం సమయంలో అసెంబ్లీలో లేకున్నా తనను సస్పెండ్‌ చేశారని ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. గతంలో ఇదే గవర్నర్‌పై మంత్రి హరీష్‌రావు దాడి చేసి.. ఇప్పుడు నీతులు వల్లించటం దొంగే దొంగ అన్నట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ నియంతృత్వ పోకడలను ప్రజలకు వివరిస్తామన్నారు.


భారీ మోటార్‌ సైకిల్‌ ర్యాలీ

టీటీడీపీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌.రమణకు స్వాగతం పలికేందుకు సత్తుపల్లిలో భారీ మోటార్‌ సైకిల్‌ ర్యాలీ నిర్వహించారు. దారి పొడవునా ప్రజలకు అభివాదం చేస్తూ ర్యాలీ సాగింది. గజమాలతో రేవంత్‌రెడ్డి, ఎల్‌.రమణ, సండ్ర వెంకటవీరయ్యను అభిమానులు సత్కరించారు. కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు  తాళ్లూరి బ్రహ్మయ్య, అశ్వారావుపేట, కొత్తగూడెం నియోజకవర్గ ఇన్‌చార్జ్‌లు మెచ్చా నాగేశ్వరరావు, కోనేరు సత్యనారాయణ(చిన్ని), టీఎస్‌ ఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు సుమంత్, డీసీసీబీ డైరెక్టర్‌ రాయల శేషగిరిరావు, మోటపోతుల నాగేశ్వరరావు, ఎస్‌కే.మదీనాపాషా పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top