ఒక్క మొక్క తక్కువైనా రాజీనామా చేయాల్సిందే

ఒక్క మొక్క తక్కువైనా రాజీనామా చేయాల్సిందే - Sakshi


‘హరితహారం’ అమలుపై సర్పంచులు, ఎంపీటీసీలకు ముఖ్యమంత్రి హెచ్చరిక



కరీంనగర్/సంగారెడ్డి: ‘‘ఒక్కో గ్రామానికీ 40 వేల మొక్కలు సరఫరా చేసే బాధ్యత మాది. మీకు నయాపైసా ఖర్చు లేదు. ట్రాలీ ద్వారా మీ ఊరికే తెచ్చి మొక్కలు సరఫరా చేస్తాం. ఆ మొక్కలన్నింటినీ పెంచే బాధ్యత మాత్రం మీదే. ఏ ఊర్లో 40 వేల కంటే ఒక్క మొక్క తక్కువగా బతికినా ఆ ఊరి సర్పంచ్, ఎంపీటీసీలు రాజీనామా చేయాలి’’ అని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు హెచ్చరించారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా కరీంనగర్ జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలో పలుచోట్ల స్వయంగా మొక్కలు నాటిన కేసీఆర్ అనంతరం స్థానికంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు.



ఈ సందర్భంగా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల తీరుపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘‘హరితహారమంటే నాలుగు మొక్కలు పెట్టి మంచిగ సాకుడే. దానికి ఇంత హడావుడి ఎందుకు? ఇంత కథ ఏంది? సీఎం వచ్చి మొత్తుకునుడేంది? ఎక్కడో తప్పు జరిగింది. దారి తప్పిపోయినం. సర్పంచులు, ఎంపీటీలకు తెలివి ఉంటే మీ గ్రామంలోనే నర్సరీ పెంచుకుని ఉంటే... ప్రభుత్వం ఇంత బాధపడాల్సిన అవసరమేముంది? పంచాయతీ వ్యవస్థ ఫెయిలైంది. చెట్టు పెంచాలనే సోయి కూడా మర్చిపోయినం కాబట్టే ఈ పరిస్థితి ఏర్పడింది. అసలు సర్పంచులు ఊళ్లల్లో ఉంటలేరు. పొద్దున లేవగానే పంచె సదురుకుని పట్టణాల్లో పడుతుండ్రు. హుస్నాబాద్‌లోనే కాదు. తెలంగాణ అంత టా పరిస్థితి ఇట్లనే తయారైంది’’అని చురకలంటించారు. సభలో మంత్రులు ఈటల, జోగు రామన్న, కేటీఆర్, ప్రభుత్వ చీఫ్ విప్ కొప్పుల ఈశ్వర్, ఎంపీలు బి.వినోద్‌కుమార్, బాల్క సుమన్ తదితరులు పాల్గొన్నారు.



 సిద్దిపేట నర్సరీలో పెరిగిన మొక్కను...

 ‘‘నేను సిద్దిపేట నర్సరీలో పెరిగిన మొక్కను. ఇయ్యాల పెద్దగ పెరిగి నీడపట్టి తెలంగాణ అంతటా విస్తరించాను. మీ ఆశీర్వాదం నా మీద ఉండాలి’’ అని కేసీఆర్ ప్రజలను కోరారు. మెదక్ జిల్లా సిద్దిపేట నియోజకవర్గ కేంద్రంలోని ‘తెలంగాణ రిలే దీక్షల స్ఫూర్తి’ పైలాన్ వద్ద మొక్కను నాటాక జరిగిన సభలో ఆయన ప్రసంగిస్తూ హరితహారం పథకం అమల్లో 100 శాతం విజయం సాధించిన ప్రతి నియోజకవర్గానికీ రూ. 5 కోట్ల బహుమతి అందిస్తామని ప్రకటించారు. ఈ పథకానికి ఓ రైతే తనకు స్ఫూర్తినిచ్చారని కేసీఆర్ పేర్కొన్నారు. నిజామాబాద్ జిల్లా నుంచి తన వ్యవసాయ పొలాన్ని చూసేందుకు వచ్చిన ఒక రైతుతో కలసి భోజనం చేస్తూ ‘మీ దగ్గర వర్షాలు కురుస్తున్నాయా?’ అని అడగ్గా ... ‘జంగల్ ఉంది కాబట్టి మాకు వర్షాలకు ఇబ్బంది లేదు’ అని ఆ రైతు చెప్పినప్పుడే తెలంగాణవ్యాప్తంగా చెట్లు పెంచాలని నిర్ణయించుకున్నామని కేసీఆర్ చెప్పారు. ‘తెలంగాణ వస్తే బంగారు కిరీటం చేయిస్తా స్వామీ’ అని తన భార్య కాళేశ్వరస్వామికి మొక్కుకుందని, త్వరలోనే కిరీటం చేయించి స్వామికి తొడిగుతానని కేసీఆర్ చెప్పారు. హైదరాబాద్ నార్త్‌లో శామీర్‌పేట్ వద్ద మరో పెద్ద విమానాశ్రయం ఏర్పాటు చేయబోతున్నామని కేసీఆర్ ప్రకటించారు. త్వరలోనే మెదక్ జిల్లాను సిద్దిపేట, మెదక్ జిల్లాలుగా చేయబోతున్నామని సీఎం తెలిపారు. మంత్రులు హరీశ్‌రావు, జోగురామన్న, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు సోలిపేట రామలింగారెడ్డి, బాబూమోహన్, తీగల కృష్ణారెడ్డి, జె డ్పీచైర్మన్ రాజమణిముర ళీయాదవ్ పాల్గొన్నారు.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top