వసూళ్లలో రికార్డు


2014-15లో మార్కెట్ ఆదాయం రూ.23 కోట్లు

 

వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ వసూళ్లలో రికార్డు సృష్టించింది. 2014-15 ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించిన రూ.22.16 కోట్ల లక్ష్యాన్ని ఛేదించింది. ఈ ఆదాయంలో అగ్రభాగం పత్తిది కాగా... మిర్చి ద్వితీయ స్థానాన్ని ఆక్రమించింది.   - వరంగల్ సిటీ

 

 వరంగల్‌సిటీ : ఆసియాలోనే రెండో పెద్ద మార్కెట్‌గా పేరొందిన వరంగల్ వ్యవసాయ మార్కెట్(ఏనుమాముల) 2014-15 మార్చి ఆర్థిక సంవత్సరం వరకు నిర్దేశించిన మార్కెట్ ఫీజును వసూలు చేసి రికార్డు సృష్టించింది. ఈ ఆర్థిక సంవత్సరం వసూళ్ల లక్ష్యం రూ.22 కోట్ల 63 లక్షలుగా నిర్దేశించగా మార్చి 23వ తేదీ వరకే ఆ లక్ష్యానికి చేరుకుంది. మొత్తంగా ఈ ఆర్థిక     సంవత్స రం వరంగల్ మార్కెట్ దాదాపు రూ.23 కోట్ల ఆదాయం ఆర్జించింది. గత ఆర్థిక సంవత్సరం రూ.22 కోట్ల 16 లక్షలు టార్గెట్ నిర్దేశించగా, రూ.18 కోట్ల 61 లక్షలు మాత్రమే వసూలై టార్గెట్‌ను చేరుకోలేక పోయాయి.

 

మార్కెట్‌కు వచ్చిన ఆదాయ వివరాలు

మార్కెట్ టార్గెట్‌లో మార్కెట్‌కు వచ్చిన అన్నిరకాల ఫీజులతోపాటు అరైవల్స్ మీద రూ.18,45,51,167 వసూలు కాగా బజారు డ్యూటీపైన రూ.5,14,824 వసూలయ్యాయి. అలాగే పండ్ల మార్కెట్ మీద ఈ సారి అత్యధికంగా రూ.65,26,115 వసూలయ్యాయి. గత ఏడాది టార్గెట్ రూ.50 లక్షలుగా నిర్దేశించగా రూ.48 లక్షలు మాత్రమే వసూలయ్యాయి. కాగా కూరగాయల మార్కెట్  టార్గెట్ రూ.28 లక్షలు నిర్దేశించగా, రూ.17 లక్షలు మాత్రమే వసూలయ్యాయి. కానీ గత సంవత్సరం రూ.28 లక్షలు వసూలు కావడం గమనార్హం. మొత్తంగా ఈ ఆర్థిక సంవత్సరం మార్చి 31 వరకు రావాల్సిన బకాయిలు కలిపి అనుకున్న టార్గెట్‌నున వ్యవసాయ మార్కెట్ పూర్తి చేసింది.

 

మళ్లీ పత్తిదే మొదటి స్థానం..

మార్కెట్‌కు మొత్తం ఈ ఆర్థిక సంవత్సరం 30,53,939.142 క్వింటాళ్ల పత్తి వచ్చింది. ఇందులో ప్రైవేట్ ట్రేడర్స్ 12 లక్షల క్వింటాళ్లు కొనుగోలు చేయగా మిగతా 18 లక్షల పైచిలుకు క్వింటాళ్ల పత్తిని సీసీఐ కొనుగోలు చేసింది. కేవలం పత్తిపైనే ఈ సంవత్సరం రూ.10 కోట్లు మార్కెట్ ఆదాయం వచ్చింది. ఇక రెండో స్థానంలో మిర్చి నిలిచింది. మార్కెట్‌కు ఈ ఆర్థిక సంవత్సరం 3,42,116 క్వింటాళ్ల మిర్చి మార్కెట్‌కు వచ్చింది.


కేవలం 2014, డిసెంబర్ నుంచి ఈ ఏడాది మార్చి 23వ తేదీ వరకే 2,49,211 క్వింటాళ్ల మిర్చి మార్కెట్‌కు రావడం విశేషం. కాగా అత్యధిక ధర దేశీ రకం మిర్చికి క్వింటాల్‌కు రూ .10,600 పలికింది. అలాగే ఈ ఆర్థిక సంవత్సరంలో మక్కలు 3,53,124 క్వింటాళ్లు వచ్చారుు. ఇక పల్లికాయ, పసుపు, ధాన్యం, ఇతర అపరాలు కలిసి 2 లక్షల పైచిలుకు క్వింటాళ్లు మార్కెట్‌కు తరలివచ్చింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top