లక్ష ఎకరాలు ఔట్‌

లక్ష ఎకరాలు ఔట్‌


సమగ్ర సర్వే నుంచి రియల్‌ ఎస్టేట్, ఇతరత్రా బదిలీ అయిన భూముల తొలగింపు

► సర్వేలో 1.24 కోట్ల ఎకరాల భూమి నమోదు

► ఈ నెల చివరికి తుది నివేదిక

► వచ్చే ఖరీఫ్‌ నుంచే రైతులకు పెట్టుబడి పథకం

► సీఎం భూములకూ ఎకరాకు రూ.4 వేల చొప్పున రూ.3.40 లక్షలు




సాక్షి, హైదరాబాద్‌ :  రైతు సమగ్ర సర్వేలో నమోదైన భూముల జాబితా నుంచి దాదాపు లక్ష ఎకరాలను తొలగించారు. రైతుల వద్ద పట్టాదారు పాసు పుస్తకాలున్నా ఆ భూమి రియల్‌ ఎస్టేట్‌కు మళ్లడం, వివిధ ప్రభుత్వ పథకాల కింద భూసేకరణలో వెళ్లిపోవడం తదితర కారణాలతో ఆ భూములను జాబితా నుంచి తొలగించినట్లు వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. అలాగే కొన్నిచోట్ల రైతులు స్థానికంగా లేకున్నా, కొందరు చనిపోయినా, మరికొందరు ఇతర ప్రాంతాల్లో ఉంటున్నా వ్యవసాయ విస్తరణాధికారులు(ఏఈవో) రెవెన్యూ రికార్డులను ముందేసుకొని ఆయా భూముల వివరాలు సమగ్ర సర్వేలో నమోదు చేశారు.


ఇలా గుర్తించిన భూమిని కూడా జాబితా నుంచి తొలగించినట్లు చెబుతున్నారు. అదనపు భూమి వచ్చి చేరితే వచ్చే ఏడాది నుంచి ప్రతీ రైతుకు ఎకరానికి రూ.4 వేల చొప్పున అందించే పథకం బడ్జెట్‌ మరింత పెరగనుంది. రైతుల వద్దకు వెళ్లకుండా ఇలా రికార్డులు చూసి భూముల వివరాలు నమోదు చేయడంపై మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. దీంతో అధికారులు క్షేత్రస్థాయిలో మరోసారి పరిశీలించి లక్ష ఎకరాల వరకు భూ వివరాలను సమగ్ర సర్వే జాబితా నుంచి తొలగించినట్లు చెబుతున్నారు. ఈ నెల 28 లేదా 29 నాటికి రైతు సమగ్ర సర్వేపై స్పష్టత రానుంది. ఆ రోజు జిల్లాల నుంచి తుది నివేదిక వస్తుందని వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి.



వచ్చే ఖరీఫ్‌కల్లా రైతులకు రూ.4,981 కోట్లు

ప్రభుత్వం ప్రకటించినట్టుగా వచ్చే ఖరీఫ్‌ నుంచి పెట్టుబడి పథకం కింద రైతులందరికీ ఎకరాకు రూ.4 వేల చొప్పున అందించనున్నారు. పేద, ధనిక తేడా లేకుండా నగదు సొమ్మును రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు. ప్రస్తుత లెక్కల ప్రకారం వచ్చే ఖరీఫ్‌లో రూ.4,981.32 కోట్లు రైతు ఖాతాల్లో జమ చేయాల్సి ఉంది. సీఎం కేసీఆర్‌కూ ఎర్రవల్లిలో 85 ఎకరాల భూమి ఉంది. ఆయన భూ వివరాలను కూడా సమగ్ర సర్వేలో నమోదు చేశారు.


ప్రస్తుతం ఆ భూమిలో బొప్పాయి, వరి పంటలు సాగులో ఉన్నాయి. నిబంధనల ప్రకారం సీఎంకూ వచ్చే ఖరీఫ్‌లో రూ.3.40 లక్షలు ఆయన బ్యాంకు ఖాతాలో జమ చేస్తామని వ్యవసాయశాఖ వర్గాలు తెలిపాయి. అలా మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, ఐఏఎస్, ఐపీఎస్‌ తదితర ఉన్నతస్థాయి వర్గాలకు చెందిన వ్యవసాయ భూములకు కూడా పెట్టుబడి పథకం కింద సొమ్ము జమ చేస్తామన్నారు. అయితే పెట్టుబడి పథకం తమకు వద్దంటూ ఎవరైనా విజ్ఞప్తి చేస్తే అప్పుడు ఆలోచిస్తామని అంటున్నారు. ఎవరి నుంచి కూడా తమకు అలాంటి విన్నపాలు రాలేదని అధికారులు తెలిపారు.



సగానికి తగ్గిన ఉద్యాన పంటలు

సీఎంకు వ్యవసాయశాఖ పంపిన నివేదిక ప్రకారం 45.55 లక్షల మంది రైతుల చేతుల్లో 1,24,53,308 ఎకరాల పంట భూమి ఉన్నట్లు సమగ్ర సర్వేలో నమోదు చేశారు. అందులో 51.30 లక్షల ఎకరాలు నీటిపారుదల వనరుల కింద ఉండగా.. 69.40 లక్షల ఎకరాలు వర్షాధార భూములు. ఉద్యానశాఖ పరిధిలో ఇప్పటివరకు 8 లక్షల ఎకరాల పండ్లు, కూరగాయల తోటలున్నట్లు భావించారు.


కానీ సమగ్ర సర్వేలో కేవలం 3.59 లక్షల ఎకరాలే ఉన్నట్లు తేలింది. అందులో మామిడి తోటలు 2.25 లక్షల ఎకరాలు, నిమ్మ, బత్తాయి తోటలు 67,544 ఎకరాలు, జామ తోటలు 4,766 ఎకరాలు, ఇతర పండ్లు, కూరగాయల తోటలు 61,884 ఎకరాలు మాత్రమే ఉన్నట్లు నిర్ధారించారు. ఉద్యాన పంటలకు సరైన ప్రోత్సాహకం లేకపోవడం వల్లే రైతులు ఆయా పంటల నుంచి వైదొలుగుతున్నట్టు ఉద్యానశాఖ వర్గాలు చెబుతున్నాయి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top