ఎమ్మెల్సీ ఎన్నిక ఎలా?

ఎమ్మెల్సీ ఎన్నిక ఎలా? - Sakshi


 సాక్షి ప్రతినిధి, నల్లగొండ : త్వర లో జరగనున్న నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గ శాసనమండలి ఎన్నికలో పోటీ చేసే అంశంపై భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)లో కదలిక మొదలైంది. రాష్ట్ర కమిటీ నిర్ణయం ఎలా ఉన్నా,  జిల్లా స్థాయిలో అయితే ఎన్నికకు సిద్ధంగా ఉండాలనే అభిప్రాయం ఆ పార్టీలో వ్యక్తమవుతోంది. ఈ మేరకు సోమవారం జరిగిన పార్టీ జిల్లా కమిటీ సమావేశంలోనూ ఎమ్మెల్సీ ఎన్నిక విషయంపై చర్చ జరిగినట్టు తెలిసింది. అయితే, పోటీ చేయాలా..? వద్దా..? అనేది రాష్ట్ర కమిటీ నిర్ణయించాల్సిన అంశం కాబట్టి అక్కడి నుంచి వచ్చే ఆదేశాల మేరకు ముందడుగు వేయాలనే అభిప్రాయాన్ని పార్టీ నేతలు వెలిబుచ్చారు. ఈలోపు పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమాన్ని చేపట్టాలని కూడా జిల్లా కమిటీలో నిర్ణయించారు. ఒకవేళ పార్టీ పోటీకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చి, జిల్లాకు పోటీ చేసే అవకాశం కల్పిస్తే ఎవరిని పోటీలో ఉంచాలన్న దానిపై కూడా ప్రాథమికంగా చర్చించినట్టు సమాచారం.

 

 మహాసభలకూ రెడీ అవ్వాలి...

 పార్టీ మహాసభలతో పాటు రాష్ట్ర కమి టీ ఆదేశాల మేరకు నిర్వహించాల్సిన ఆందోళన కార్యక్రమాలపై కూడా చర్చ జరిగింది.  పార్టీ డివిజన్ మహాసభల పూర్తి, జిల్లా, రాష్ట్ర మహాసభలకు ఎలా సన్నద్ధం కావాలన్న దానిపై నేతలు మాట్లాడారు. సూర్యాపేటలో వచ్చే నెలలో జరిగే జిల్లా మహాసభలకు సి ద్ధం కావాలని, దీంతో పాటు రాష్ట్ర మ హాసభకు రెడ్‌షర్ట్ వలంటీర్లను కూడా పంపాలని నిర్ణయించారు. పార్టీ కేంద్ర కమిటీ ఆదేశాల మేరకు జాతీయ ఉపా ధి హామీ పథకానికి కేంద్ర ప్రభుత్వం పరిమితులు విధించడాన్ని నిరసిస్తూ ఈనెల 26న మండలస్థాయిలో ఆందోళనలు నిర్వహించాలని, వివిధ ప్రజాసమస్యలపై సెమినార్లు నిర్వహించాల ని, ఇందుకోసం సబ్‌కమిటీలను ఏర్పా టు చేసుకోవాలని నిర్ణయించారు.

 

 ఎమ్మెల్సీ ఎన్నిక ఎలా?

 సమావేశంలో ఎమ్మెల్సీ ఎన్నిక వ్యవహారం చర్చకు వచ్చిన సందర్భంగా పోటీలో ఉన్నా లేకపోయినా పట్టభద్రుల ఓటరు నమోదు కార్యక్రమాన్ని చురుగ్గా నిర్వహించాలనే అభిప్రాయం వ్యక్తమైంది. మండలాల వారీ ఓటరులిస్టు ఆధారంగా 2011 లోపు డిగ్రీ ఉత్తీర్ణులయిన వారిని నిర్దేశిత గడువులోపు ఓటర్లుగా నమోదు చేయించాలని నిర్ణయించారు. అయితే, పోటీ చేయాలని రాష్ట్ర కమిటీ నిర్ణయించి జిల్లాకు పోటీ చేసే అవకాశం ఇస్తే ఎవరిని బరిలో ఉంచవచ్చన్న దానిపై కూడా సమావేశంలో ప్రాథమికంగా చర్చ జరిగింది. ఇందులో ప్రొఫెసర్ అందె సత్యం లాంటి మేధావుల పేర్లు ప్రస్తావనకు వచ్చాయి. ఒకవేళ  పీడీఎఫ్(పీపుల్స్ డెమోక్రటిక్ ఫ్రంట్) నుంచి జిల్లాకు చెందిన ప్రముఖ సినీగేయ రచయిత సుద్దాల అశోక్‌తేజ బరిలో ఉంటే ఆయనకు మద్దతిచ్చే యోచనలో కూడా ఉన్నట్టు తెలిసింది. అయితే  ఇప్పుడే ఈ చర్చ అవసరం లేదని, పార్టీ నిర్ణ యం మేరకు ముందుకెళ్లాలని, రాష్ట్ర పార్టీ ఓకే అంటే మరో మారు సమావేశమై అభ్యర్థిత్వాన్ని నిర్ణయించాలని కూడా సమావేశం అభిప్రాయపడింది.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top