గ్రేటర్ పోరుకు రెడీ


వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలకు ఏర్పాట్లు చేస్తున్న యంత్రాంగం

వ్యూహ రచనల్లో రాజకీయ పార్టీలు కార్యక్రమాలు మొదలుపెట్టిన టీఆర్‌ఎస్


 

వరంగల్ : వరంగల్ మహా నగరపాలక సంస్థ(జీడబ్ల్యూఎంసీ) ఎన్నికలకు ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. డివిజన్ల వారీగా రిజర్వేషన్లకు సంబంధించిన ప్రతిపాదనలను ఇటీవల జీడబ్ల్యూఎంసీ అధికారులు మున్సిపల్ శాఖ కమిషనర్‌కు పంపించారు. ప్రభుత్వం వీటిని ఆమోదించిన తర్వాత ఎన్నికల  ప్రక్రియ మొదలవుతుంది. అరుుతే, మేడారం జాతర ముగిసిన వెంటనే ఎన్నికల ప్రక్రియ మొదలవుతుందని అధికారులు భావిస్తున్నారు. ఎన్నికలు ఇప్పటికిప్పుడు జరిగినా సన్నద్ధంగా ఉండేలా ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అధికార యంత్రాంగం ఎన్నికల నిర్వహణ కోసం సిద్ధమవుతుండగా... రాజకీయ పార్టీల్లోనూ గ్రేటర్ వరంగల్ ఎన్నికల వేడి మొదలైంది. నెల రోజుల్లోనే గ్రేటర్ వరంగల్ ఎన్నికలు జరుగుతాయనే సమాచారంతో టీఆర్‌ఎస్ నాయకులు ప్రచార కార్యక్రమాలను మొదలుపెట్టారు. వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయభాస్కర్, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే కొండా సురేఖ, ఎమ్మెల్సీ కొండా మురళీధర్‌రావు... రెండు రోజులుగా నగరంలో అభివృద్ధి పనులను ప్రారంభిస్తున్నారు.



గతంలో మొదలై పూర్తి కావచ్చిన పనులకు ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. ఆలస్యమవుతున్న పనులను త్వరగా పూర్తి చేయించేలా అధికారులకు ఆదేశాలు ఇస్తున్నారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సైతం గ్రేటర్ వరంగల్‌లోని విలీన గ్రామాల్లో ఇలాంటి కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు. కాగా, మేయర్ పదవి కోసం టీఆర్‌ఎస్ నేతల్లో పోటీ పెరుగుతోంది. టీఆర్‌ఎస్ గ్రేటర్ వరంగల్ అధ్యక్షుడు నన్నపనేని నరేందర్‌కు పార్టీ అధిష్టానం మేయర్ పదవిపై గతంలో హామీ ఇచ్చిందని ఆ పార్టీలో ప్రచారం జరుగుతోంది. కొత్తగా పలువురు నాయకులు ఈ పదవి కోసం ప్రయత్నాలు మొదలుపెడుతున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చేపట్టిన రిజర్వేషన్ల ప్రకారం వరంగల్ మేయర్ పదవి జనరల్ కేటగిరీకి కేటాయించారు. గ్రేటర్ హైదరాబాద్ తరహాలోనే అప్పటి రిజర్వేషనే ఇప్పుడు అమలవుతుందని అధికారులు చెబుతున్నారు. వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికలో ఘోర పరాజంతో కుదేలైన కాంగ్రెస్, బీజేపీ-టీడీపీలు గ్రేటర్ వరంగల్ ఎన్నికల్లో బలం చూపించాలని ప్రయత్నిస్తున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలతో మరింత బలహీనమైన ఈ రెండు పార్టీలకు గ్రేటర్ వరంగల్ ఎన్నికలు ప్రతిష్టాత్మకంగా మారనున్నాయి. సంప్రదాయ ఓటు బ్యాంకు ఆధారంగా టీఆర్‌ఎస్‌కు గట్టి పోటీ ఇవ్వాలని కాంగ్రెస్ భావిస్తోంది. తెలంగాణలో కనుమరుగయ్యే పరిస్థితి నుంచి బయటపడాలని బీజేపీ-టీడీపీ కూటమి ప్రయత్నిస్తోంది. ఇలా.. గ్రేటర్ వరంగల్‌లో వీలైనన్ని ఎక్కువ స్థానాలు గెలుచుకుని బలం చూపెట్టాలనే లక్ష్యంతో కాంగ్రెస్, బీజేపీ-టీడీపీలు కార్యక్రమాలకు సిద్ధమవుతున్నాయి.



గ్రేటర్ వరంగల్ పరిధిలోని 58 డివిజన్లు ఉన్నాయి. ప్రతిపాదనల ప్రకారం 13 డివిజన్లు అన్ రిజర్వుడ్ కేటగిరీలో ఉన్నాయి. జనరల్‌కు కేటాయించిన డివిజన్లలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ కేటగిరీలకు సంబంధించిన మహిళలు, పరుషులు పోటీచేసే అవకాశం ఉంటుంది. ప్రత్యేకంగా మహిళలకు 15 డివిజన్లు రిజర్వు చేశారు. ఈ డివిజన్లలో ఎస్టీ, ఎస్సీ, బీసీ, జనరల్ మహిళలు పోటీ చేసే అవకాశం ఉంటుంది. బీసీలకు 19 డివిజన్లు రిజర్వు చేశారు. ఇందులో బీసీ జనరల్‌కు 10, బీసీ మహిళకు 9 డివిజన్లు రిజర్వు చేశారు. ఎస్సీలకు 9 డివిజన్లు కేటాయించారు. వీటిలో ఎస్సీ జనరల్ కేటగిరీలో ఐదు, ఎస్సీ మహిళ కేటగిరీలో ఐదు డివిజన్లు ఉన్నాయి. ఎస్టీలకు రెండు డివిజన్లు కేటాయించారు. ఇందులో ఒకటి ఎస్టీ జనరల్, మరొకటి ఎస్టీ మహిళలకు రిజర్వు చేశారు.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top