చౌక దందా


ఆదిలాబాద్ అర్బన్ : జిల్లా లో ప్రజాపంపిణీ వ్యవస్థ గాడి తప్పుతోంది. ప్రభుత్వం పేదలకు ఇచ్చే కిలో రూపాయి బియ్యం పక్కదారి పడుతోంది. కొందరు దళారీలు రేషన్ బియ్యాన్ని కిలో ఆరు రూపాయల చొప్పున కొనుగోలు చేస్తున్నారు. వాటికి పాలిష్ చేసి కిలో రూ.30 నుంచి రూ.40 వరకు ధర కలిగిన బియ్యంలో కలిపి విక్రయిస్తున్నారు. కొందరు వందల క్వింటాళ్లు పోగు చేసి ఇతర రాష్ట్రాలకు తరలిస్తూ కోట్లాది రూపాయలు సొమ్ము చేసుకుంటున్నారు. పౌర సరఫరాల, విజిలెన్స్ అధికారుల నిఘా ఉన్నా బియ్యం దందా ఆగడం లేదు. ఫలితంగా అధికారులు తనిఖీలు చేసినప్పుడు స్వల్పమే దొరుకుతున్నాయి. ఇదిలా ఉండగా, తమకు రేషన్ రావడం లేదని ప్రజలు నిత్యం ప్రజలు అటూ మండల, ఇటు కలెక్టర్ కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. పేదలకు అందాల్సిన బియ్యం పరుల పాలవుతోంది.



 ప్రణాళిక ప్రకారం వ్యాపారం

 పేదలక అందాల్సిన బియ్యం బ్లాక్‌మార్కెట్‌కు తరలించేందుకు కొందరు వ్యాపారులు పక్కా ప్రణాళిక ప్రకారం వ్యవహరిస్తున్నారు. కొందరు వ్యాపారులు రేషన్ డీలర్ల వద్ద ముందుగానే పెట్టుబడి పెడుతున్నట్లు తెలుస్తోంది. ఇదంతా రవాణాకు అనుకూలంగా ఉండే ప్రాంతాల్లో జోరుగా సాగుతోందని ప్రచారం జరుగుతోంది. పక్కా రవాణా జరిగే ప్రాంతాల వివరాలు విజిలెన్స్ అధికారుల వద్ద ఆధారాలు ఉన్నాయి. దళారుల సాయంతో డీలర్ల వద్ద పోగుచేసిన బియ్యాన్ని లారీలు, ప్యాసింజర్ రైళ్లలో ఇతర జిల్లాలకు, రాష్ట్రాలకు తరలిస్తున్నారు. ఇందుకోసం సంబంధిత విభాగాల సిబ్బంది కూడా మామూళుగా తీసుకుంటున్నట్లు సమాచారం.



 భారీగా నల్లబజారుకు..

 జిల్లాలో సాధారణంగా 6.85 లక్షల ఆహార భద్రత కార్డులు ఉన్నాయి. ఈ కార్డుదారులకు కోటా సరుకులు పంపిణీ చేసేందుకు జిల్లా వ్యాప్తంగా 1,716 రేషన్ షాపుల ద్వారా ప్రభుత్వం ప్రతి నెలా బియ్యం ఇస్తోంది. అయితే భారీగా బియ్యం బ్లాక్‌మార్కెట్‌కు తరలివెళ్తున్నాయి. పౌర సరఫరాల అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరించడమే ఇందుకు కారణమనే ఆరోపణలు ఉన్నాయి.



 అధికారులకు పట్టుబడ్డ సరుకులు

 జిల్లా వ్యాప్తంగా రెవెన్యూ, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు దాడులు నిర్వహించినప్పుడు 772 క్వింటాళ్ల బి య్యాన్ని పట్టుకున్నారు. ఇందులో నుంచి 635 క్విం టాళ్ల బియ్యం డీలర్ల వద్ద పట్టుకున్నదే. ఇక 7,162 లీటర్ల కిరోసిన్‌ను పట్టుకున్నారు. ఇందులో 4,123 లీటర్ల కిరోసిన్ డీలర్ల దగ్గర ఉన్నదే కావడం శోచనీ యం. జిల్లా వ్యాప్తంగా అధికారులు 71 కేసులు న మోదు చేశారు. ఇందులో 23 కేసులకు పరిష్కారం ల భించింది. మిగతా 48 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి.



ఇక అధికారులు పది మందిపై క్రిమినల్ కేసులు నమోదు చేశారు. తిర్యాణి, ఆదిలాబాద్, కాజీపేట, కాగజ్‌నగర్ మండలాల్లో ఒక్కొక్క రేషన్‌షాపు డీలర్‌పై, ఉట్నూర్, మంచిర్యాల, తాండూర్ మండలాల్లో ఇద్దరి చొప్పున రేషన్‌షాపు డీలర్లపై క్రిమినల్ కేసులు నమోదు అయ్యాయి. క్రిమినల్, పెండింగ్ కేసుల వారికి షోకాజ్ నోటీసులు జారీ చేసిన వారి నుంచి స్పందన రాలేదు. కేసుల నమోదై వారికిచ్చిన గడువు దాటిపోయింది. అయితే ఇప్పటివరకు సంబంధిత అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.



 దాడుల వివరాలివీ..

  జనవరిలో రెవెన్యూ, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు జిల్లాలో నిర్వహించిన దాడుల్లో 132 క్వింటాళ్ల బియ్యం పట్టుకున్నారు. ఇందులో రేషన్ డీలర్ల వద్ద పట్టుకున్న అక్రమ బియ్యం 106 క్వింటాళ్లుగా అధికారులు గుర్తించారు. మిగతా బియ్యం అక్రమంగా తరలిస్తున్నప్పుడు పట్టుకున్నట్లు అధికారులు రికార్డుల్లో నమోదు చేశారు.



  ఫిబ్రవరి, మార్చి నెలలో అధికారులు నిర్వహించిన దాడుల్లో మొత్తం 305 క్వింటాళ్ల బియ్యాన్ని పట్టుకున్నారు.  286 క్వింటాళ్ల బియ్యం రేషన్ డీలర్ల వద్ద పట్టుకున్నట్లుగా నిర్థారించారు. 37 క్వింటాళ్ల బియ్యం అక్రమంగా తరలిస్తున్నప్పుడు పట్టుకున్నారు.



  ఏప్రిల్, మే నెలల్లో జిల్లా వ్యాప్తంగా అధికారులు నిర్వహించిన దాడుల్లో 220 క్వింటాళ్ల బియ్యాన్ని పట్టుకున్నారు. ఇందులో రేషన్ డీలర్ల వద్ద పట్టుకున్న బియ్యమే 158 క్వింటాళ్లుగా ఉంది.



  జూన్, జూలై నెలల్లో అధికారులు నిర్వహించిన దాడుల్లో 144 క్వింటాళ్ల బియ్యాన్ని పట్టుకున్నారు. ఇందులో 82 క్వింటాళ్ల బియ్యాన్ని డీలర్ల వద్దే పట్టుకోగా, మిగతా 31 క్వింటాళ్ల బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నప్పుడు పట్టుకున్నట్లుగా అధికారులు రికార్డుల్లో నమోదు చేశారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top