ఆధార్ లేకున్నా రేషన్‌

ఆధార్ లేకున్నా రేషన్‌ - Sakshi


సంగారెడ్డి అర్బన్: ఆధార్‌కార్డులేని వారికి కూడా రానున్న రెండు నెలలు రేషన్ సరుకులు అందజేస్తామని, ఆలోపు కార్డుదారులంతా తప్పకుండా ఆధార్ కార్డు పొందాలని కలెక్టర్ రాహుల్ బొజ్జా తెలిపారు. శుక్రవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జెడ్పీ చైర్‌పర్సన్ రాజమణి అధ్యక్షతన జెడ్పీ సర్వసభ్య సమావేశం జరిగింది. సమావేశంలో జిల్లాలో జరుగుతున్న పలు అభివృద్ధి పనుల గురించి అధికారులు వివరించారు. పలువురు జెడ్పీటీసీ సభ్యులు సమస్యలు లేవనెత్తారు.



ఈ సందర్భంలోనే అల్లాదుర్గం జెడ్పీటీసీ సభ్యురాలు మమత, రాయికోడ్ జెడ్పీటీసీ సభ్యుడు అంజయ్యలు మాట్లాడుతూ, ఆధార్ సెంటర్ సమీపంలో లేక, అవగాహన లేక చాలా మంది కార్డుదారులు ఇంతవరకూ ఆధార్‌కార్డులు పొందలేదని, మరోవైపు పౌరసరఫరాలశాఖ ఆధార్‌కార్డు సమర్పించని కార్డుదారులకు రేషన్‌సరుకులు పంపిణీ నిలివేయడంతో చాలామంది పేదలు ఇబ్బందులు పడుతున్నారని, ఆధార్‌కార్డు పొందేందుకు వారికి వారికి  కాస్త సమయం ఇవ్వాలని, అంతవరకూ రేషన్ సరుకులు పంపిణీ చేయాలని సభ దృష్టికి తీసుకువచ్చారు.



దీనిపై స్పందించిన కలెక్టర్...మరో రెండునెలల పాటు ఆధార్‌కార్డుతో అనుసంధానంకాకపోయినా రేషన్ సరుకులు పంపిణీ చేస్తామన్నారు. సర్కార్ ఆహారభద్రత కార్డులను త్వరలోనే పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటోందని, ఆహారభద్రత కార్డు పొందాలంటే తప్పకుండా ఆధార్‌కార్డు ఉండాల్సిందేనని, అందువల్ల ఇంతవరకు ఆధార్‌కార్డు పొందని వారంతా సాధ్యమైనంత త్వరగా కార్డు పొందాలన్నారు. ఇందుకోసం సంగారెడ్డి పట్టణంలో ప్రస్తుతం ఉన్న ఆధార్ కేంద్రంతో పాటు  మండలంలో కూడా కొత్తగా ఆధార్ కేంద్రం కొత్తగా ఏర్పాటుచేస్తామని హామీ ఇచ్చారు.



కూసునే జాగ చూపండి

ఎంపీడీఓ కార్యాలయాల్లో తమకు చాంబర్లు లేక ఎక్కడ కూర్చోవాలో తెలియని దుస్థితి ఉందని పలువురు జెడ్పీటీసీలు ఆవేదన  వ్యక్తం చేయగా, స్పందించిన చైర్‌పర్సన్ రాజమణి, ఎంపీడీఓ కార్యాలయాల్లో జెడ్పీటీసీ సభ్యులకు ప్రత్యేకంగా చాంబర్‌లను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు.

 

సమస్యలు ఏకరువు


పటాన్‌చెరు పారిశ్రామిక వాడలోని పరిశ్రమల కాలుష్యంతో ఇస్నాపూర్ చెరువు నీరు కలుషితమై ప్రజలు రోగాలబారిన పడుతున్నారని,



ఈ విషయంపై గవర్నర్ నరసింహన్ కూడా చెరువును సందర్శించి తగిన చర్యలు తీసుకుపోవాలని సూచనలు చేసినా కాలుష్య నియంత్రణ మండలి అధికారులు పట్టించుకోవడం లేదని పటాన్‌చెరు జెడ్పీటీసీ శ్రీకాంత్‌గౌడ్ సభ సమావేశంలో ఆవేదన వ్యక్తం చేశారు.



చేగుంట మండలం మక్కరాజ్‌పేట వద్ద గల పరిశ్రమలు వ్యర్థాలను చెరువులోకి వదులుతున్నాయని దీంతో నీరంతా కలుషితమై ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని చేగుంట జెడ్పీటీసీ సభ్యుడు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు.



ఘనపురం ఆనకట్ట ఆదుధునికీకరణ పనుల శంకుస్థాపన కార్యక్రమానికి స్థానిక ప్రజాప్రతినిధులకు ఆహ్వానం పంపక పోవడమే కాకుండా శిలాఫలకంపై కూడా పేర్లు ముద్రించలేదని స్థానిక జెడ్పీటీసీ సమావేశంలో ప్రస్తావించగా, స్పందించిన కలెక్టర్ మాట్లాడుతూ,  ప్రతి ప్రభుత్వ కార్యక్రమంలో ప్రొటోకాల్ పాటించి ప్రజాప్రతినిధులందరికీ ఆహ్వానం పంపాలని జిల్లా పంచాయతీ అధికారి , జెడ్పీ సీఈఓ ప్రభాకర్‌రెడ్డికి సూచించారు.



ఇస్మాయిల్‌ఖాన్‌పేట్, బేగంపేట్ , చిద్రుప్ప, ఆరట్ల నుంచి రోజూ రూ.2 కోట్ల విలువచేసే ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారని,  వాహన దారులు ఓవర్‌లోడ్‌తో వెళ్తుడటంతో ప్రమాదాలు జరుగుతున్నాయని జిన్నారం జెడ్పీటీసీ సభ్యుడు ప్రభాకర్ సమావేశంలో ప్రస్తావించారు.



సంగారెడ్డి మండల ఆర్‌ఐ సత్తార్ ప్రోత్సాహంతో మండలంలో అక్రమ ఫిల్టర్లు జోరుగా సాగుతున్నాయని చర్యలు తీసుకోవాలని సంగాారెడ్డి  జెడ్పీటీసీ సభ్యుడు మనోహర్‌గౌడ్ కలెక్టర్‌ను కోరగా, ఇసుక రవాణాను అడ్డుకునేందుకు ప్రత్యేక టీమ్‌లను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు. సమావేశంలో జెడ్పీ వైస్ చైర్మన్ రాగుల సారయ్య, వివిధ శాఖల జిల్లా అధికారులు, జెడ్పీటీసీలు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top