రేషన్ కార్డుల జారీలో అవకతవకలు


మహబూబ్‌నగర్ అర్బన్:  అర్హులందరికీ ఆహారభద్రత కార్డులిస్తామని తెలంగాణ ప్రజాప్రతినిధులు ఆర్భాటంగా చెప్పుకుంటున్నా.. వాటి జారీలో అవకతవకలు చోటు చేసుకుంటున్నాయి. తెలంగాణ రాష్ట్రానికి చెందిన పలు ఆధార్‌కార్డు నెంబర్లు, లబ్ధిదారుల పేర్లు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రేషన్ కార్డుల్లో నమోదయ్యాయి. దీంతో ఇక్కడి ఆహారభద్రత కార్డుల్లో ఆ పేర్లు తిరస్కరించాలని, రేషన్‌ను త గ్గించడమే కాకుండా వాటిని సరిచేయించాలని నిబంధన పెట్టడంతో లబ్ధిదారులు తీవ్ర అందోళన చెందుతున్నారు.

 

 జిల్లా కేంద్రంలోని ఇంటి నెం.1-4-18/6బి ఇంటి యజమాని సయ్యద్ మసూద్, టీఆర్‌ఎస్ రాష్ట్ర మైనార్టీసెల్ మాజీ కార్యదర్శి కుటుంబంలో సయ్యద్ ఉమేర్ అబ్దుల్లా ఆధార్ కార్డు నెంబర్ 671054918839, ఆయేష బేగం ఆధార్ కార్డు నెంబర్ 973873376268 ఏపీ రాష్ట్రంలోని కర్నూల్ అర్బన్ పరిధిలోగల ఇంటినెంబర్ 2-86ఏ, పెద్దపడకన అనే పేరుగల రేషన్ కార్డులో నమోదయ్యాయి.

 

  అదేవిధంగా స్థానిక రాజేంద్రనగర్‌లో నివాసం ఉండే సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యుడు కిల్లె గోపాల్ కుటుంబ సభ్యులైన కిల్లె స్రవంతి ఆధార్‌కార్డు నెంబర్ 382174377630 శ్రీకాకుళం జిల్లా సంతకావిటి గ్రామానికి చెందిన డబ్ల్యూఏపీ 0110038ఏ0181 నంబర్‌గల రేషన్‌కార్డులో నమోదైంది. కిల్లె తేజస్విని ఆధార్‌కార్డు నెంబర్ 650380924946 అనంతపురం జిల్లా కల్యాణదుర్గం గ్రామంలోని డబ్ల్యూఏపీ 122300300532 అనే రేషన్‌కార్డులో నమోదైంది. దీంతో మహబూబ్‌నగర్ పట్టణంలోని వీరి కుటుంబాల్లో ఆయా పేర్లను తిరస్కరించినట్లు ఇక్కడి రెవెన్యూ అధికారులు ధ్రువీకరించి వారి రేషన్‌ను తగ్గించారు.

 

 ఆధార్‌కార్డు నెంబర్లను తస్కరించడమే...

 టీఆర్‌ఎస్ రాష్ట్ర నేత సయ్యద్ మసూద్ మాట్లాడుతూ మచ్చుకు ఈ రెండు ఉదాహరణలే కాకుండా జిల్లాలో వందల సంఖ్యలో ఉన్నాయని అన్నారు. గతంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేషన్‌కార్డులకు ఆధార్‌కార్డు నెంబర్లకు అనుసంధానం చేయడం తప్పనిసరి చేసిన సందర్భంగా ఆన్‌లైన్‌లో నమోదైన కార్డులను తస్కరించి ఇలాంటి అవకతవకలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.

 

  ఈ విషయాలను స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో విన్నవిస్తే వాటిని సరిచేయకుండా మీరే ఏపీలోని ఇతర గ్రామాల్లో పేర్లను నమోదు చేసి ఉంటారని అంటూ తమను అవమానసరుస్తున్నారని అన్నారు. ఈ అవతవకలను రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళుతామని వెల్లడించారు.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top