దొంగల వేట !


 ఖమ్మం క్రైం: జిల్లా పోలీసులు దొంగల వేటలో పడ్డారు... ఇదేంటి.. పోలీసులు దొంగలను వేటాడక ఇంకేం చేస్తారనుకుంటున్నారా....! పోలీసులు చేసేది అదే పని అయినా... ఎస్పీ ఆదేశాల మేరకు ప్రత్యేకంగా వేట పనిలో పడ్డారు ఖాకీలు. ‘దొంగలు దొరికేంత వరకు ఠాణా మెట్లు ఎక్కొద్దు... ఠాణాలు విడిచి వెళ్లండి... దొంగలను పట్టుకుని రండి.. అప్పటి దాకా ఠాణా బాధ్యతలు మీ కింది అధికారులకు అప్పగించండి..’ అని ఎస్పీ రంగనాథ్ అన్ని స్టేషన్‌ల హౌస్ ఆఫీసర్ల (ఎస్‌హెచ్‌వో)కు ఆదేశాలు జారీచేశారు. దీంతో జిల్లాలోని కొందరు సీఐలు, ఎస్‌ఐలు ఇదే పనిమీద ఇతర జిల్లాలకు వెళ్లిపోయారు.



 ఇటీవలి కాలంలో జిల్లావ్యాప్తంగా చోరీలు జరుగుతుండటం, గత మూడేళ్లుగా జరిగిన చోరీల సొత్తు రికవరీ కాకపోవడంతో పోలీసు శాఖపై కొన్ని విమర్శలు వచ్చాయి. దీంతో ఎస్పీ ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకున్నారు. ఇటీవల వరుసగా అన్ని సబ్ డివిజన్‌ల పోలీసులతో క్రైమ్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఆయా స్టేషన్‌ల పరిధిలో ఎన్ని చోరీలు జరిగాయి.. ఎంత రికవరీ అయిందనే వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రికవరీ పెద్దగా లేదని తేలడంతో సబ్ డివిజన్ అధికారి నుంచి ఎస్సైల వరకు అందరిపైనా ఎస్పీ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. దీంతో గత రెండు రోజులుగా జిల్లాలోని పోలీస్ స్టేషన్‌ల హౌస్ ఆఫీసర్లు జిల్లా దాటి దొంగల ఆచూకీ కోసం బయలుదేరి వెళ్లారు.



 రికవరీ ఏది సారూ...!

 ఏడాదికి రూ.8.5 కోట్లు విలువైన నగదు, సొత్తు దొంగిలిస్తుండగా వాటిలో రూ.3.5 కోట్లు కూడా పోలీసులు స్వాధీనం చేసుకోలేకపోతున్నారు. గత సంవత్సరం మధిర శ్రీరాం చిట్స్ కార్యాలయంలో రూ.3.5 కోట్లు దొంగలు ఎత్తుకెళ్లిన సంఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం విదితమే. అందులో ఉన్న సీసీ కెమెరాల ద్వారా దొంగల ముఖాలు ఉన్నా కూడా వారికి ఇప్పటి వరకు పోలీసులు గుర్తించలేదు. జిల్లాలో సంవత్సరానికి 150కి పైగా చైన్‌స్నాచింగ్‌లు ఎక్కడో ఒకచోట జరుగుతూనే ఉన్నాయి.



 అయినా పోలీసులు వీటిని అదుపు చేయలేకపోతున్నారు. పోలీస్ స్టేషన్‌లలో చోరీల కేసులు ఫైళ్లలో మూలుగుతున్నాయే తప్ప వాటిని పరిష్కరించే పరిస్థితి లేదు. సొత్తు పోగొట్టుకున్న బాధితులు స్టేషన్‌ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు తప్ప.. అవి రికవరీ కావడం లేదు. వీటినన్నింటినీ దృష్టిలో పెట్టుకున్న ఎస్పీ చోరీల అడ్డుకట్టపై ప్రత్యేక దృష్టి సారించారు. దొంగలపై ఉక్కుపాదం మోపాలని అధికారులకు ఆదేశాలు జారీ చేయడంతోపాటు చోరీకి గురైన సొత్తును రికవరీ చేయాలని ఎప్పటికప్పుడు ఆయా సబ్ డివిజన్‌ల అధికారులు, సీఐ, ఎస్సైలకు తగిన సూచనలు చేస్తున్నారు. జిల్లాలో జరుగుతున్న చోరీలను అరికట్టలేకపోవడంతో ఆయా పోలీస్ స్టేషన్‌లకు సంబంధించిన ఐడీ పార్టీలతోపాటు సీసీఎస్, ఆర్‌సీసీఎస్ సిబ్బందిలో ప్రక్షాళన చేయాలని కూడా ఎస్పీ ఆలోచిస్తున్నట్లు తెలిసింది.



 పక్క జిల్లాలకు వెళ్లిన పోలీసులు..

 దొంగల ఆచూకీ కోసం పోలీసులు పక్క జిల్లాలకు వెళ్లినట్లు తెలిసింది. బృందాలుగా ఏర్పడి హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, విజయవాడ, ఏలూరు తదితర ప్రాంతాలకు వెళ్లి దొంగల ఆచూకీ కోసం ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. ఒకవేళ దొంగల ఆచూకీ ఆ ప్రాంతాల్లో లభించకపోతే పక్క రాష్ట్రాలకు కూడా వెళ్లడానికి పోలీసు అధికారులు సిద్ధమైనట్లు తెలిసింది. ఏదైనా వారం, పది రోజుల్లో జిల్లాలో చోరీకి పాల్పడిన ఒక పెద్ద ముఠాను అరెస్ట్ చేసి తమ ప్రతాపాన్ని చూపించాలని, ఎస్పీ వద్ద గుర్తింపు తెచ్చుకోవాలని పోలీసు అధికారులు సైతం సవాల్‌గా తీసుకున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top