తెలంగాణలో మన జిల్లానే కీలకం

తెలంగాణలో మన జిల్లానే కీలకం - Sakshi


మొయినాబాద్ రూరల్: తెలంగాణ రాష్ట్రానికి రంగారెడ్డి జిల్లా గుండె లాంటిదని, జిల్లాను హైదరాబాద్ మాదిరిగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. శంషాబాద్ నుంచి అమ్డాపూర్ మీదుగా చిలుకూరు బాలాజీ దేవాలయం వరకు ఆర్టీసీ బస్సును మంత్రి సోమవారం ప్రారంభించారు.



ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి పేదను ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తోందన్నారు. భూమిలేని నిరుపేదలకు ప్రభుత్వం మూడెకరాల వ్యవసాయం పొలం ఇవ్వనుందని, రైతులకు తొమ్మిది గంటల విద్యుత్ అందిస్తూ సబ్సిడీపై ఎరువులు, విత్తనాలు అందజేస్తుందని చెప్పారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ప్రతి హామీనీ నెరవేరుస్తామన్నారు. అనంతరం స్థానిక మైసమ్మ దేవాలయంలో పూజలు నిర్వహించి గ్రామంలో పర్యటించారు.

 

యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పిస్తాం

హైదరాబాద్‌కు ఆనుకుని ఉన్న రంగారెడ్డి జిల్లాలో పలు పరిశ్రమలను నెలకొల్పి యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరుస్తామని మంత్రి చెప్పారు. త్వరలో పోలీసు, ప్రభుత్వ కార్యాలయాల్లో ఖాళీగా ఉన్నా 10 వేల పోస్టుల భర్తీకి కృషి చేస్తున్నామన్నారు. నియోజకవర్గంలోని శంకర్‌పల్లి, చేవెళ్ల మండల కేంద్రాల్లో బస్‌డిపోలను నిర్మిస్తున్నట్లు తెలిపారు. మొయినాబాద్‌లో బస్‌డిపో నిర్మించేందుకు సైతం ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని పేర్కొన్నారు.

 

కార్యక్రమంలో రాజేంద్రనగర్ డిపో మేనేజర్ వెంకట్‌రెడ్డి, తహసీల్దార్ గంగాధర్, ఎంపీడీఓ సుభాషిణి, ఎంఈఓ వెంకటయ్య, గ్రామ సర్పంచ్ సిద్ధయ్య, ఎంపీటీసీ సామ రాంరెడ్డి, మాజీ సర్పంచ్ నర్సింహారెడ్డి, సర్పంచ్‌ల సంఘం అధ్యక్షుడు మల్లేష్ యాదవ్, మండల విశ్వకర్మ సంఘం ఉపాధ్యక్షులు నర్సింహాచారి, నాయకులు అనంతరెడ్డి, పెంటయ్య, జేవంతు, సామ రవీందర్‌రెడ్డి, అర్జున్, క్రిష్ణాగౌడ్, సత్యలింగంగౌడ్, అంతయ్య, దయాకర్ పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top