రండిబాబూ.. రండి!


ఇంజనీరింగ్ కళాశాలల్లో మళ్లీ తనిఖీల పర్వం మొదలైంది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జేఎన్‌టీయూహెచ్ అధికారులు బుధవారం నుంచి రంగంలోకి దిగారు. తెలంగాణ వ్యాప్తంగా ఒక్కో కళాశాలకు ఒక్కో నిజనిర్దారణ కమిటీ (ఎఫ్‌ఎఫ్‌సీ)ని పంపి తనిఖీ చేయిస్తున్నారు. దాదాపుగా ఇరవై రోజులు ఈ తనిఖీల పర్వం కొనసాగనుంది. గత తనిఖీల్లో పలు కాలేజీల్లో డొల్లతనం బయటపడడంతో ఈసారి తమ లోపాలను కప్పిపుచ్చుకునేందుకు యాజ మాన్యాలు అడ్డదార్లు తొక్కుతున్నాయి.

 -కరీంనగర్    

 

 జిల్లాలో మొత్తం 19 ఇంజనీరింగ్ కళాశాలలుండగా ఈ ఏడాది ఏడు కళాశాలలకు అనుబంధహోదా నిలిపి వేయంతో తొలి విడత ఎంసెట్ కౌన్సెలింగ్‌లో ప్రవేశాలకు నోచుకోలేకపోయాయి. అనంతరం కళాశాల యాజమాన్యాలు కోర్టు ద్వారా మలి విడతలో అఫిలియేషన్‌ను సాధించినప్పటికీ చెప్పుకోదగ్గ ఫలితాలు రాకపోవడంతో నిరాశకు లోనయ్యాయి.



కనీసం ఇప్పుడైనా తనిఖీలను విజయవంతంగా ఎదుర్కొంటేనే భవిష్యత్తు ఆశాజనకంగా ఉంటుందని, లేదంటే వచ్చే సంవత్సరం కూడా ప్రవేశాలు కోల్పోవాల్సి వస్తుందనే భయంతో యాజమాన్యాలు నిజనిర్దారణ కమిటీలను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డాయి. అదే సమయంలో కమిటీ ఎక్కడా అభ్యంతరం చెప్పకుండా ఉండేందుకు అన్ని అర్హతలు కలిగిన అధ్యాపకులను ఒక రోజు అద్దెకు తెచ్చుకునేందుకు సిద్ధమయ్యాయి.



అందుకోసం అన్వేషణ ప్రారంభించిన యాజమాన్యాలు తగిన అర్హతలున్న అధ్యాపకుడికి ఒక్కరోజు తమ కళాశాల లెక్చరర్‌గా పనిచేస్తే రూ.10 వేలు ఇచ్చేందుకూ వెనుకాడటం లేదు. అన్ని అర్హతలుండీ ప్రస్తుతం పలు కళాశాలల్లో చాలీచాలని జీతంతో అధ్యాపకులుగా పనిచేస్తున్న వారికి ఇదో సువర్ణవకాశంగా మారింది.



 కమిటీ తనిఖీలో పరిశీలించేవి...

 నిజనిర్దారణ కమిటీ తనిఖీచేసినప్పడు కళాశాలలు ఏఐసీటీయూ ఆమోద లేఖ, భూమి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్, కళాశాల ప్రాంగాణానికి సంబంధించిన మాస్టర్ ప్లాన్, బిల్డింగ్ ప్లాన్ డాక్యుమెంట్, లైబ్రరీలలో పుస్తకాల జాబితా, 15 మంది విద్యార్థులకు ఒక్కో అధ్యాపకుడి చొప్పున లెక్చరర్ల జాబితా, సిబ్బంది వేతనాలు, బ్యాంకు ఖాతా సహా మొత్తం 11 అంశాలకు సంబంధించిన వివరాలు సమర్పించాలి. జిల్లాలో తనిఖీలు ప్రారంభమవుతుండడంతో ఇంజనీరింగ్ కళాశాలల యాజమన్యాలు అన్ని పత్రాలు సిద్ధంగా ఉంచుకోనే పనిలో నిమగ్నమయ్యాయి.



 కనీస వసతులకే దిక్కులేదు

 జిల్లాలోని పలు ఇంజనీరింగ్ కళాశాలలు పేరుకు పెద్ద కళాశాలలుగా చెలామణి అవుతున్నా కనీస వసతులకు దిక్కులేని పరిస్థితి నెలకొంది. వేసవిలో విద్యార్థులకు సరిపడా నీరందించలేని కళాశాలలున్నాయంటే అతిశయోక్తి కాదు. ఇదే కాకుండా చాలీచాలని ప్రయోగశాలలు, కానరాని సౌకర్యాలతో విద్యార్థుల నానా అవస్థలు పడుతున్నారు. పలు కళాశాలల్లో మూత్రశాలల నిర్వహణ బస్టాండ్‌లో కంటే అధ్వానంగా ఉన్నాయని విద్యార్థుల తల్లిదండ్రులు వాపోతున్నారు. కళాశాల యాజమన్యాల ధోరణిలో మార్పు రావాలని, విద్యార్థుల భవిష్యత్తుతో యజమాన్యాలు ఆడుకోకూడదని పలు విద్యార్థి సంఘాలు గగ్గోలు పెట్టినా వాటిని పెడచెవిన పెట్టి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు.



 అర్హతకు... జీతానికి కుదరని పొంతన

 జిల్లాలో పేరుగాంచిన ఇంజనీరింగ్ కళాశాలల్లోనూ అన్ని అర్హతలున్న బోధన, బోధనేతర సిబ్బందికి ఏఐసీటీఈ నిబంధనల ప్రకారం జీతాలు చెల్లించడం లేదు. అన్ని అర్హతలుండి కూడా ఇప్పటికీ ఐదారు వేల రూపాయలకు లెక్చరర్‌గా పనిచేస్తున్న వారెందరో ఉన్నారు. వాస్తవానికి వీరికి ఏఐసీటీఈ నిబంధనల ప్రకారం ఇవ్వాల్సిన జీతంలో పావులా వంతు కూడా చెల్లించడం లేదు. జీతాల రిజిస్టర్‌లో మాత్రం ఏఐసీటీఈ లెక్కల ప్రకారం జీతాలు తీసుకుంటున్నట్లు సంతకాలు చేయించుకుంటున్నారు.



యాజమాన్యాలు చెప్పినట్లుగా సంతకం చేయకపోతే ఉన్న ఉద్యోగం పోతుందనే భయంతో బానిసలుగా బతుకుతున్నామని ప్రముఖ కళాశాలలో పనిచేస్తున్న అధ్యాపకుడొకరు వాపోయారు. పరీక్షల సమయంలో ఇన్విజిలేటర్‌గా విధులు నిర్వహించినా సకాలంలో డబ్బులు చెల్లించే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల నుంచి ముక్కుపిండి వేలాది రూపాయల ఫీజులు వసూలు చేస్తున్న యజమాన్యాలు అధ్యాపకుల గురించి కాస్తంత కూడా ఆలోచించడం లేదని చెబుతున్నారు.



 ఒక్క రోజుకు రూ.10 వేల వరకు

 తనిఖీల సమయంలో విద్యార్థులకు సరిపడా అధ్యాపకులను నిజనిర్దారణ క మిటీకి చూపించాల్సి ఉంటుంది. ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా పలు కళాశాలల్లో విద్యార్థుల సంఖ్యకు తగిన సిబ్బంది లేకపోవడంతో ఇంతవరకు పనిచేస్తున్న అధ్యాపకులతో పాటు పలు కళాశాలల్లో పీజీ చదువుతున్న వారిని, పీజీ పూర్తయిన అర్హులను తనిఖీ రోజు అద్దెకు తెచ్చుకుంటున్నాయని విశ్వసనీయ సమాచారం.



ఒక్కోరోజుకు ఒకరికి దాదాపు వారి హోదాను అనుభవాన్ని బట్టి నాలుగు వేల నుంచి పది వేల రూపాయల వరకు చెల్లిస్తున్నాయంటే కళాశాల యాజమాన్యాల గారడీ ఎంతో అర్ధమవుతోంది. అద్దెకు తీసుకొచ్చిన అధ్యాపకులకు నిజనిర్దారణ కమిటీ తనిఖీ వచ్చే సమయంలో ఆరోజు ఏయే సబ్జెక్టులు బోధించామనే అంశంతోపాటు జీతభత్యాల వివరాలు చెప్పి మరి తనిఖీలో పావులాగా వాడుకుంటున్నారు.



కాసులిస్తే... లోపాలన్నీ మాయమైనట్లే!

ఇంజనీరింగ్ కళాశాలల్లో నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రభుత్వం ఎన్ని నిబంధనలు రూపొందించినా, చివరకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసినా ఆచరణలో మాత్రం కళాశాల యాజమాన్యాల్లో మార్పు రావడం లేదు. తనిఖీల సమయంలో అధికారులకు కావాల్సిన మేరకు కాసులు ముట్టజెపితే నిబంధనలు గాలిలో కలుస్తున్నాయి.



కళాశాలల్లో కనీస సౌకర్యాల్లేకున్నా... అన్నీ ఉన్నట్లుగా రాసుకుని వెళుతున్నారనే విమర్శలున్నాయి. ఇప్పటికైనా అధికారులు కళ్లు తెరిచి భావిభారతావనికి వెన్నుముక లాంటి ఇంజనీరింగ్ విద్యార్థులకు అన్యాయం చేయకుండా ఏ సౌకర్యాలు కళాశాలల్లో  లేకున్నా వెంటనే దాని అనుమతులు, అఫిలియేషన్ రద్దు చేయాలని పలు విద్యార్థి సంఘాలు కోరుతున్నాయి.

 

 సౌకర్యాలు లేని కళాశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలి

 జిల్లావ్యాప్తంగా పలు ఇంజనీరింగ్ కళాశాలలను ఏఐఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో గతంలో సందర్శించాం. చాలా కళాశాలలలో తాగునీటి సమస్య, మూత్రశాలల సమస్యలతో సతమతమవుతున్నట్లు విద్యార్థులు తెలిపారు. అర్హతకు తగిన జీతభత్యాలు ఇవ్వడం లేదని పలు కళాశాలల్లో పనిచేస్తున్న అధ్యాపకులు విన్నవించారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు జరుగుతున్న ఈ తనిఖీల్లో మౌలిక సదుపాయాలు లేకుండా నడుస్తున్న కళాశాలలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం.

 - బోయిని సురేష్, ఏఐఎస్‌ఎఫ్ నాయకులు





ఇంజనీరింగ్ కళాశాల, తనిఖీల పర్వం, జేఎన్‌టీయూహెచ్ అధికారులు

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top