విద్యుత్ ప్లాంట్లకు అనువుగా రామగుండం


10,000 మెగావాట్ల ప్రాజెక్టుగా స్థాపనకు అనుకూలం

ఎన్టీపీసీ సీఎండీ అరూప్‌రాయ్ చౌదరి




జ్యోతినగర్ (కరీంనగర్ జిల్లా): కరీంనగర్ జిల్లా రామగుండంలోని ఎన్టీపీసీ దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ఎన్టీపీసీల్లోకెల్లా అతిపెద్ద ప్రాజెక్టుగా రూపుదిద్దుకునే అవకాశం ఉందని ఆ సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డెరైక్టర్ అరూప్‌రాయ్ చౌదరి అన్నారు. రామగుండంలో తెలంగాణ స్టేజీ-1 కింద చేపట్టనున్న 8, 9 యూనిట్ల(2+800=1,600 మెగావాట్లు) విద్యుత్ కేంద్రం స్థలాన్ని, మ్యాపును ఆదివారం ఆయన పరిశీలించారు. అనంతరం ప్రాజెక్టులోని ఏడో యూనిట్‌ను సందర్శించి విద్యుత్ ఉత్పాదకతపై అధికారులతో చర్చించారు. అనంతరం ఎన్టీపీసీ డెరైక్టర్ (హెచ్‌ఆర్) యూపీ ఫణి, డెరైక్టర్(టెక్నికల్) కేకే శర్మలతో కలిసి అరూప్‌రాయ్ చౌదరి సమీక్ష నిర్వహించారు.





దేశవ్యాప్తంగా ఎన్టీపీసీ, జాయింట్ వెంచర్స్‌తో కలిపి 40 ప్రాజెక్టులు ఉన్నాయన్నారు. వీటిలో 4,260 మెగావాట్ల అతి పెద్ద విద్యుత్ ఉత్పత్తి కేంద్రంగా మధ్యప్రదేశ్‌లోని వింధ్యాచల్ ఉందన్నారు. దానికంటే రామగుండం ప్రాజెక్టులో 10,000 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేసే ప్రాజెక్టులను నెలకొల్పడానికి అనుకూలంగా ఉందని వెల్లడించారు. థర్మల్ విద్యుత్ ఉత్పత్తికి అనువైన వనరులు బొగ్గు, నీరు, స్థలం అందుబాటులో ఉన్నాయన్నారు. రామగుండంను అతిపెద్ద విద్యుత్ ఉత్పత్తి కేంద్రంగా రూపొందించడానికి ఎన్టీపీసీ ముందుందని, స్థానిక ప్రజలు, సంస్థ ఉద్యోగుల కృషితో అది సాధ్యమవుతుందని తెలిపారు. యాష్‌పాండ్ కోసం సింగరేణి సంస్థతో మాట్లాడి జీవితకాలం పూర్తవుతున్న ఓసీపీ ప్రాజెక్టులను యాష్‌పాండ్‌గా వినియోగించుకోవచ్చన్నారు.





ఈ సందర్భంగా ప్లాంట్‌లోని కంటిన్యూయస్ ఎమిషన్ మానిటరింగ్ సిస్టం(సీఈఎంసీ)ని, కోల్ టెస్టింగ్ లాబొరేటరీని ప్రారంభించారు. కార్యక్రమంలో ప్రాజెక్ట్ గ్రూప్ ఆఫ్ జనరల్ మేనేజర్ ప్రశాంత్‌కుమార్ మహాపాత్ర, జనరల్ మేనేజర్లు రాంకుభేర్, రాజన్, భావరాజు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top