కాంట్రాక్టు ఉద్యోగుల పొట్టగొట్టిన ఆర్‌వీఎం!


కొనసాగించాలని ఉత్తర్వులున్నా ఇష్టారాజ్య నిర్ణయాలు

నేడే ఆఖరు పనిదినం అని ఆదేశాలు


 

 సాక్షి, హైదరాబాద్: రాజీవ్ విద్యా మిషన్‌లో (ఆర్‌వీఎం) కాంట్రాక్టు పద్ధతిన పని చేస్తున్న చిరుద్యోగులను ఆర్‌వీఎం రోడ్డుపాలు చేసే నిర్ణయం తీసుకుంది. జూన్ 30వ తేదీ వరకు ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులు ఎవరినీ తొలగించవద్దని ఈనెల 17న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినా.. దానికి విరుద్ధంగా ఆర్‌వీఎం వారి పొట్ట గొట్టింది. రాష్ట్ర ప్రాజెక్టు డెరైక్టర్ ఆదేశాల ప్రకారం అని పేర్కొంటూ.. జిల్లాలో కాంట్రాక్టు పద్ధతిన పని చేస్తున్న ఐఈఆర్‌టీలు, ఎంఐఎస్ కోఆర్డినేటర్లు, డాటా ఎంట్రీ ఆపరేటర్లు, క్లస్టర్ రిసోర్సు పర్సన్లు, పార్ట్‌టైం ఇన్‌స్ట్రక్టర్లను, డివిజనల్ లెవల్ మానిటరింగ్ టీంలు, మెసెంజర్లు, అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్లను ఈనెల 24 నుంచి కొనసాగించవద్దని, ఈనెల 23 వారికి ఆఖరి పనిదినం అని రంగారెడ్డి జిల్లా ప్రాజెక్టు ఆఫీసర్ ఈనెల 21న మండల విద్యాధికారులకు ఉత్తర్వులు జారీ చేశారు.

 

 దీనిప్రకారం ఆర్‌వీఎంలో రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తున్న 23,500 మంది కాంట్రాక్టు ఉద్యోగులు రోడ్డున పడనున్నారు. ఈ ఉత్తర్వులపై కార్మిక సంఘాల నేతలు, కాంట్రాక్టు ఉద్యోగులు మండిపడుతున్నారు. మండలాల్లోని ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో విద్యా కార్యక్రమాలు నిర్వహించేందుకు ఆర్‌వీఎం ఏటా వారిని నియమిస్తోంది. వారంతా కాంట్రాక్టు పద్ధతిన పనిచేస్తున్న వారు అయినందున.. ఏడాది పాటు పూర్తిగా కొనసాగించకుండా బ్రేక్ ఇచ్చి మార్చి 31 తరువాత మళ్లీ కాంట్రాక్టును రెన్యువల్ చేస్తోంది. అయితే ఈసారి ఎన్నికలు రావడం, రాష్ట్ర విభజన జరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతానికి ఎవరినీ తొలగించరాదని ప్రభుత్వం ఈనెల 17న జీవో 84ను జారీ చేసింది. అపాయింటెడ్ డే జూన్ 2 అయినందున రెండు రాష్ట్ర ప్రభుత్వాలు విధానపర నిర్ణయం తీసుకోవాల్సి ఉందని అందులో పేర్కొంది.

 

 ఈ లెక్కన వారిని కొనసాగిస్తారా? లేదా? అన్నది కొత్త ప్రభుత్వాలు ఏర్పడ్డాక నిర్ణయం తీసుకోవాల్సి ఉందని, జూన్ 30 వరకు వారిని కొనసాగించాలని పేర్కొంది. కాని ఆర్‌వీఎం మాత్రం ఆ జీవోను తుంగలో తొక్కి 23,500 మందిని రోడ్డుపాలు చేసే నిర్ణయం తీసుకుంది. దీనిపై ఆందోళనలో పడిన కాంట్రాక్టు ఉద్యోగులు మంగళవారం గవర్నర్ సలహాదారు సలావుద్దీన్‌ను కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు.

 

 వారిని కొనసాగించకపోతే ఆందోళ నలే: జనక్ ప్రసాద్

 ఆర్‌వీఎం తొలగించిన కాంట్రాక్టు ఉద్యోగులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ అధ్యక్షుడు జనక్‌ప్రసాద్ డిమాండ్ చేశారు. వారిని కొనసాగించకపోతే ఆందోళనలు, పోరాటాలు తప్పవని పేర్కొన్నారు. వారికి తాము అండగా ఉంటామని తెలిపారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నపుడు ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడాన్ని ఆయన తప్పుబట్టారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top