అచ్చి.. రాలే..!

మంత్రి ఈటెల రాజేందర్ నివాసం కోసం ముస్తాబు చేస్తున్న క్వార్టర్ - Sakshi


జెడ్పీ క్వార్టర్స్ పేరెత్తితే జంకుతున్న ప్రముఖులు

అడుగుపెడితే అంతేనట.. నివాసముంటే ఓటమే..!  

 సాక్షి ప్రతినిధి, కరీంనగర్: మంత్రులతో పాటు జెడ్పీ చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు ఈ క్వార్టర్లలో నివాసం ఉండటం ఆనవాయితీగా వస్తోంది. వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి 2009లో వైఎస్సార్ హయాంలో మంత్రిగా బాధ్యతలు చేపట్టిన దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఈ క్వార్టర్స్‌లోనే మకాం పెట్టారు. ఇటీవలి ఎన్నికల్లో ఆయనకు చేదు అనుభవం ఎదురైంది. గతంలో రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు ఆయన కరీంనగర్‌లో వేర్వేరు చోట్ల అద్దెగృహాల్లో ఉన్నారు.



మంత్రి హోదాలో వాస్తుకు అనుగుణంగా తన క్వార్టర్‌ను తీర్చిదిద్దుకున్నప్పటికీ.. ఆయనకు కలిసి రాకపోవటం జెడ్పీ క్వార్టర్స్ మహత్యమనే ప్రచారం జరిగింది.  2009 మే వరకు జెడ్పీ చైర్మన్‌గా ఉన్న ఆరెపల్లి మోహన్ సైతం ఈ క్వార్టర్స్‌లోనే నివాసం పెట్టారు. అప్పుడు ఎమ్మెల్యేగా గెలిచిన ఆరెపల్లి ఏడాది పాటు అదే క్వార్టర్స్‌లో కొనసాగారు. ఈసారి ఎన్నికల్లో ఆరెపల్లి కూడా ఓడిపోయారు.

     

ఆయన తర్వాత జెడ్పీ చైర్మన్‌గా ఎన్నికైన అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ ఇటీవలి వరకు అదే క్వార్టర్‌లో నివాసం ఉన్నారు. 2009 అసెంబ్లీ ఎన్నికల్లో ధర్మపురి నుంచి పోటీచేసి ఓడిన లక్ష్మణ్‌కుమార్... ఇందులో అడుగుపెట్టాక వచ్చిన వరుస ఎన్నికలన్నింటా దెబ్బతిన్నారు.

2010 ఉపఎన్నికలు, 2014 ఎన్నికల్లోనూ ఆయన ఓటమి పాలయ్యారు. 1995-2000 వరకు జెడ్పీ చైర్మన్‌గా ఉన్న రాజేశంగౌడ్‌కు ఈ క్వార్టర్స్ కలిసి రాలేదు. తర్వాత కీలక పదవులేమీ వరించకపోగా.. క్రియాశీల రాజకీయాలకు దూరమయ్యారు.

2001-2006 వరకు జెడ్పీ చైర్మన్‌గా ఉన్న కేవీ.రాజేశ్వరరావు కూడా తన పదవీకాలంలో ఇక్కడే ఉన్నారు. తర్వాత ఆయన రాజకీయాలకు దూరమయ్యారు.

కరీంనగర్ మొదటి మేయర్‌గా ఎన్నికైన డి.శంకర్ ఈ క్వార్టర్స్‌లోనే ఉన్నారు. ఈసారి ఎన్నికల్లో ఆయన పోటీకి దూరంగా ఉన్నారు.

ఇప్పుడు కొత్తగా ఎన్నికైన జెడ్పీ చైర్‌పర్సన్ తుల ఉమ ఇటీవలే క్వార్టర్స్‌లో గృహప్రవేశం చేశారు. మంత్రి ఈటెల రాజేందర్ కోసం మరో క్వార్టర్స్‌కు రంగులు వేసి ముస్తాబు చేస్తున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top