రాజయ్య ఔట్..కడియం ఇన్

రాజయ్య ఔట్..కడియం ఇన్ - Sakshi

  • సీఎం సలహా మేరకు రాజయ్యను మంత్రి పదవి నుంచి తొలగించిన గవర్నర్

  •  అవినీతి ఆరోపణలు, పనితీరుపై విమర్శల నేపథ్యంలో నిర్ణయం

  •  ఆదివారం మధ్యాహ్నం రాజయ్య బర్తరఫ్

  •  అదే సామాజిక వర్గానికి చెందిన శ్రీహరికి కేబినెట్‌లో చోటు.. వెంటనే ప్రమాణం

  •  డిప్యూటీ సీఎంగా ఎంపిక..విద్యాశాఖ బాధ్యతలు అప్పగింత

  •  మంత్రుల శాఖల్లోనూ మార్పులు

  • సాక్షి, హైదరాబాద్: అవినీతి ఆరోపణలు, పనితీరుపై తీవ్ర విమర్శల్లో కూరుకుపోయిన ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య ‘ఔట్’ అయ్యారు. ముందుగా ఊహించినట్లుగానే ఆయనను మంత్రివర్గం నుంచి తొలగించారు. మూడు రోజులుగా తర్జనభర్జన అనంతరం ఆయనకు ఉద్వాసన పలకాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు  నిర్ణయించారు. సీఎం సూచనల మేరకు రాజయ్యను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేస్తూ గవర్నర్ నరసింహన్ ఆదివారం ఆదేశాలు జారీ చేశారు. అయితే రాజయ్యను తొలగించిన కొద్దిసేపటికే సీఎం కేసీఆర్ అదే సామాజిక వర్గం, అదే జిల్లాకు చెందిన లోక్‌సభ సభ్యుడు కడియం శ్రీహరిని రాష్ట్ర మంత్రివర్గంలోకి తీసుకున్నారు.



    ఆ వెంటనే రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్ కడియంతో మంత్రిగా ప్రమాణం చేయించారు. ఆ తరువాత పలువురు మంత్రుల శాఖల్లో మార్పులు చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. తాత్కాలిక వైద్యులు, పారామెడికల్ పోస్టుల భర్తీ, 108కు వాహనాల కొనుగోళ్లలో అక్రమాలు, అవినీతి జరిగాయని నిఘా వర్గాలు పేర్కొనడం, ఇది పత్రికల్లోనూ రావడం... దీంతోపాటు స్వైన్‌ఫ్లూపై వైద్యశాఖ సరిగా స్పందించలేదన్న విమర్శలు, సీఎంకు తెలపకుండానే కాళోజి ఆరోగ్య యూనివర్సిటీకి రిజిస్ట్రార్‌ను నియమించడం వంటి అంశాల నేపథ్యంలో రాజయ్యను మంత్రివర్గం నుంచి తొలగించారని సమాచారం.



    దీనితో పాటు మంత్రివర్గంలో స్వల్ప మార్పులు చేయాలని శనివారమే నిర్ణయం తీసుకున్న సీఎం కేసీఆర్... రాత్రి పొద్దుపోయాక దీనిపై గవర్నర్ నరసింహన్‌కు సమాచారం అందించినట్లు తెలిసింది. ఈ విషయాన్ని ఆదివారం మధ్యాహ్నం వరకు కూడా గోప్యంగా ఉంచారు. అనంతరం హఠాత్తుగా సీఎం సలహా మేరకు రాజయ్యను తొలగించినట్లు రాజ్‌భవన్ వర్గాలు మీడియాకు సమాచారం అందించాయి. తర్వాత కొద్దిసేపటికే కడియం శ్రీహరితో గవర్నర్ నరసింహన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు.



    ఈ కార్యక్రమానికి లండన్‌లో ఉన్న మంత్రి జగదీశ్‌రెడ్డి మినహా మిగతా మంత్రులు, ఎంపీలు కేశవరావు, బాల్కసుమన్, సీతారాంనాయక్ తదితరులు హాజరుకావడం గమనార్హం. శ్రీహరి ప్రమాణం పూర్తికాగానే.. మంత్రులంతా సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లారు. రాజయ్య బర్తరఫ్ అనంతరం తలెత్తే పరిణామాలపై వారు చర్చించినట్లు సమాచారం. అవినీతిని ఎట్టిపరిస్థితుల్లోనూ సహించేది లేదని సీఎం ఈ సందర్భంగా మరోసారి స్పష్టం చేసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. గతంలోనూ ఒకసారి దీనిపై రాజయ్యను హెచ్చరించిన విషయాన్ని గుర్తుచేసినట్లు తెలిసింది.

     

    ముందుగానే సమాచారం..



    ఆదివారం ఉదయం మంత్రులు హరీశ్‌రావు, తుమ్మల రాజ్‌భవన్‌కు వెళ్లి వచ్చారు. అప్పుడే వారు రాజయ్యను మంత్రివర్గం నుంచి తొలగించాలని సీఎం తీసుకున్న నిర్ణయాన్ని వివరించడంతో పాటు సంబంధిత లేఖను అందించినట్లు తెలిసింది. తరువాత సీఎం సలహా మేరకు రాజయ్యను తొలగిస్తున్నట్లు రాజ్‌భవన్ వర్గాలు ప్రకటించాయి. ఇక కేబినెట్‌లో చేసిన స్వల్ప మార్పుల్లో భాగంగా... రాజయ్య తొలగించడంతో ఖాళీ అయిన వైద్య, ఆరోగ్య శాఖను డాక్టర్ అయిన లక్ష్మారెడ్డికి కేటాయించారు. ఇప్పటివరకు ఆయన నిర్వహించిన విద్యుత్ శాఖను జగదీశ్‌రెడ్డికి అప్పగించారు. ఇప్పటివరకు జగదీశ్‌రెడ్డి నిర్వహించిన విద్యాశాఖను తాజాగా మంత్రిగా ప్రమాణం చేసిన శ్రీహరికి అప్పగించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top