మాజీ మంత్రి రాజయ్యకు గుండెపోటు

మాజీ మంత్రి రాజయ్యకు గుండెపోటు


హైదర్‌గూడ అపోలో ఆస్పత్రికి తరలింపు

⇒  ఐసీయూలో వైద్య పరీక్షలు

మంత్రి చందూలాల్ సహా పలువురు నేతల పరామర్శ

చికిత్స అనంతరం డిశ్చార్జి


సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి తాటికొండ రాజయ్య మంగళవారం గుండెపోటుతో ఆస్పత్రి పాలయ్యారు. మంత్రివర్గం నుంచి బర్తరఫ్ అవడంతో ఆవేదన చెందుతున్న ఆయన మూడు రోజులుగా బీపీ, షుగర్ మందులు వేసుకోవట్లేదు.



దీంతో రక్తపోటు, షుగర్ లెవల్స్ బాగా పెరిగాయి. ఈ క్రమంలో మంగళవారం హైదరాబాద్‌లో తనను కలిసేందుకు వచ్చిన కార్యకర్తలు, మిత్రులతో మాట్లాడుతూ రాజయ్య ఛాతీ నొప్పితో కూలబడిపోయారు. దీంతో కుటుంబ సభ్యులు ఆయన్ను హుటాహుటిన హైదర్‌గూడలో ఉన్న అపోలో ఆస్పత్రికి తరలించారు.



వైద్యులు రాజయ్యను ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ)లో ఉంచి వైద్యం అందించారు. ఆయనకు ఈసీజీ, 2డీ ఎకో, షుగర్, బీపీ పరీక్షలు నిర్వహించారు. షుగర్, బీపీ స్థాయిలు పెరగడం వల్లే ఛాతీ నొప్పి వచ్చినట్లు ‘హెల్త్ బులిటెన్’లో పేర్కొన్నారు. అనంతరం రాత్రి సుమారు 10 గంటల సమయంలో ఆయన్ను ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు. అంతకుముందు రాజయ్య అస్వస్థత విషయం తెలుసుకున్న రాష్ట్ర పర్యాటకాభివృద్ధిశాఖ మంత్రి చందూలాల్, మాజీ మంత్రి మారెప్ప, ఎమ్మెల్సీ జూపూడి ప్రభాకర్‌రావు.



మాజీ ఎంపీ మధుయాష్కి, ప్రొఫెసర్ గాలి వినోద్‌కుమార్, టీడీపీ నేత మోత్కుపల్లి నరసింహులు తదితరులు ఆస్పత్రికి చేరుకొని రాజయ్యను పరామర్శించి ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. కాగా, రాజయ్యపట్ల సీఎం కేసీఆర్ ప్రదర్శిస్తున్న తీరును తప్పుబడుతూ తెలంగాణ మాల మహానాడు అధ్యక్షుడు చెన్నయ్యతోపాటు పలువురు ఎమ్మార్పీఎస్ (మంద కృష్ణమాదిగ వర్గం) నాయకులు ఆస్పత్రి వద్ద కాసేపు రాస్తారోకో చేపట్టారు.

 

తప్పు చేసి ఉంటే ... విచారణ జరపండి: రాజయ్య

‘బర్తరఫ్ మాట విని ఆవేదన చెందా. నా పొరపాటు ఉంటే విచారణ జరపండి. వైద్య, ఆరోగ్యశాఖలో జరిగిన అవినీతిపై విచారణ జరిపించండి. సీఎం కేసీఆర్ నాకు తండ్రిలాంటి వారు. ఆయన తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉన్నా. మూడు రోజులుగా నిద్ర లేదు. తీవ్ర ఒత్తిడికి గురయ్యాను. మంత్రి వర్గం నుంచి తప్పించిన తీరు కలచి వేసింది.



ఇప్పటికీ చెబుతున్నా, నేను ఎలాంటి తప్పు చేయలేదు. ఈ అంశంపై విచారణ జరిపించాలి..’ అని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అనంతరం రాజయ్య మీడియాతో పేర్కొన్నారు. తన ఆరోగ్య పరిస్థితి మెరుగైందని, కార్యకర్తలు, అభిమానులు ఆందోళన చెందవద్దని, మినిస్టర్స్ క్వార్టర్స్‌లో అందరికీ అందుబాటులో ఉంటానని తెలిపారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top