రైతన్నా.. కదలిరా!

రైతన్నా.. కదలిరా! - Sakshi


సాక్షిప్రతినిధి,సంగారెడ్డి: రైతాంగం అంతా కలసికట్టుగా కదలి నారాయణఖేడ్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి, అధికార పార్టీ మీద నిరసన తెలపాలని శాసనసభ పక్ష నాయకుడు జానారెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం జిల్లాలో నిర్వహించిన ‘రైతు భరోసా యాత్ర’లో ఆయన ఉప ఎన్నికల ప్రచారానికి తెరలేపారు. కాంగ్రెస్ పార్టీలో నాయకులంతా సమైక్యంగానే ఉన్నామని, అధికారంలో ఉన్నా లేకున్నా రైతులకు అండగా  నిలబడతామన్నారు.అది నిరూపించేందుకే అందరం కలసి మీ ముందుకు వచ్చామని జానారెడ్డి అన్నారు.



ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు ఆర్థిక సాయం అందించేందుకు కాంగ్రెస్ పార్టీ నేతలు మంగళవారం రైతు భరోసా యాత్ర పేరుతో జిల్లాలో పర్యటించారు. వ్యవసాయ దుస్థితిని పరిశీలించారు. రైతుల కష్టాలను విని, వారికి భవిష్యత్తుపై  భరోసా ఇచ్చే ప్రయత్నం చేశారు. కాంగ్రెస్ పార్టీ నేతలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జానారెడ్డి, భట్టి విక్రమార్క, దామోదర రాజనర్సింహ, సునీతారెడ్డి, గీతారెడ్డి, శ్రీధర్‌బాబు, కుంతియా, డీకే అరుణ, పొన్నాల లక్ష్మయ్య, ఆకుల లలిత  శ్రావణ్‌కుమార్‌రెడ్డి, మధుయాష్కీ, జగ్గారెడ్డి, రామ్మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో తూప్రాన్ మండలం ఇస్లాంపూర్‌ను నుంచి ఈ యాత్రను ప్రారంభించారు. రెండు రైతు కుటుంబాలను ఓదార్చారు.



ఇస్లాంపూర్‌లో ఇటీవలే ఆత్మహత్య చేసుకున్న ఆకుల వెంకటేశ్ కుటుంబాన్ని, శివ్వంపేట మండలం దొంతిలో శంకర్ అనే రైతు కుటుంబాన్ని నేతలు పరామర్శించి, ఒక్కొక్క కుటుంబానికి రూ.లక్ష చొప్పున ఆర్థిక సహకారం అందించారు.  చంది గ్రామ శివారులో నేతలు రైతులతో మాట్లాడారు. నీళ్లు లేక ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించారు. నీళ్లు లేక  పొట్టపోసుకునే  దశలో   ఎండిపోయిన వరి చేనును పరిశీలించి ఎస్ మల్లయ్య, వీరయ్య,నర్సింహ అనే బాధిత రైతుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు.



ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షురాలు సునీతా రెడ్డి మాట్లాడుతూ తాము చేపట్టిన భరోసా యాత్ర రైతు భరోసా యాత్ర కాదని, కాంగ్రెస్ పార్టీ సభ  అని విమర్శించడం పట్ల ఆమె తీవ్రంగా స్పందించారు. కాంగ్రెస్‌పార్టీ హయాంలో  ప్రజల  చేతి నిండా డబ్బు ఉండేదని, దసరా దీపావళి ఘనంగా చేసుకునే వారని గుర్తు చేశారు. రైతుల చెల్లించాల్సిన రుణ మాఫీని ఏకకాలంలో బ్యాంకుల్లో జమ చేయాలని డిమాండ్ చేశారు. కరువు మండలాలను గుర్తించి ప్రతి గ్రామంలో ఉపాధి హామీ పనులు చేపట్టాలని ఆమె కోరారు. రైతులకు ఇవ్వాల్సిన చెరకు బకాయిలు ఇప్పటి వరకు ఎందుకు ఇవ్వటం లేదని ఆమె ప్రశ్నించారు.

 

ఖబర్దార్ కేసీఆర్: జగ్గారెడ్డి హెచ్చరిక

ఎన్ని తిట్లు తిట్టినా కేసీఆర్‌లో మార్పు రావడంలేదని, వాళ్లను తిట్టి కూడా ప్రయోజనం లేదని మాజీ ప్రభుత్వ విప్ జగ్గారెడ్డి ఘూటుగా విమర్శించారు.  ఎండిపోతున్న తెలంగాణ సస్యశ్యామలం అవుతుందనే ఆలోచనతో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు పల్లెంలో పెట్టి ఇచ్చారని గుర్తు చేశారు.ఎన్నికల ముందు కేసీఆర్ చెప్పింది ఏమిటీ? ఇప్పుడు చేస్తున్నది ఏమిటని ప్రశ్నించారు.



250 మంది రైతులు చనిపోతే ఒక్క రైతు కుటుంబానైనా పరామర్శించడానికి ఆయనకు టైం లేదా? రైతు ఆత్మహత్యలు మీకు కనిపించటం లేదా? ఖబర్దార్ కేసీఆర్ అంటూ  హెచ్చరించారు. రైతులు భయపవద్దని, కాంగ్రెస్ పార్టీ ఉండగా ఉంటుందని అన్నారు. ఆయన మాట్లాడుతున్నంత సేపు సభికుల నుంచి మంచి స్పందన వచ్చింది.



మెదక్ పార్లమెంటరీ నాయకులు శ్రావణ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ రైతు కుటుంబాలలో భరోసా నింపటానికి  రాహుల్ గాంధీ ఢీల్లీ నుంచి ఆదిలాబాద్ జిల్లాకు వచ్చిరని, మండే వేసవిలో 15 కిలో మీటర్లు నడిచి వెళ్లి  రైతు కుటుంబాలను ఓదార్చారని, అడద్దపు మాటలతో ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన కేసీఆర్‌కు రైతు కుటుంబాలను పరామర్శించేందుకు తీరిక లేదా అని ఆయన ప్రశ్నించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top