ఎన్ని‘కల ’లో?


సిద్దిపేట జోన్, న్యూస్‌లైన్: ప్రతిసారి ఎన్నికలు వస్తున్నాయి.. పోతున్నాయి.. పార్లమెంట్ సభ్యులు మారుతున్నారు. కానీ సిద్దిపేట ప్రాంతవాసుల చిరకాల స్వప్నం రైల్వేలైన్ మాత్రం ఎన్ని‘కల’గానే మిగులుతుంది. 1967లో ఏర్పడిన సిద్దిపేట పార్లమెంట్ నియోజకవర్గానికి ఎందరో మహమహులు ఎంపీలుగా పనిచేసినప్పుటికీ రైల్వేలైన్ సాధించడంలో పాలకులు వైఫల్యం చెందారనే చెప్పవచ్చు. సిద్దిపేటకు రైల్వేలైన్ మంజూరు చేయిస్తామని గుప్పెడు హామీలను కురిపించిన నేతలు ఆ దిశగా ఆశించిన స్థాయిలో కృషి చేయలేదన్న విమర్శలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి.



ఎన్నికలు రాగానే ఓట్ల కోసం ఓటర్లను ఎన్ని‘కల’ల్లో ముంచేస్తున్న అభ్యర్థులు మరోమారు సార్వత్రిక పోరులో రైల్వేలైన్ హామీని తెరమీదకి తెవడం విశేషం. మూడు దశాబ్దాలుగా ప్రతి ఎన్నికలల్లో రైల్వేలైన్ మీద హామీల వర్షం తప్పడంలేదు. పార్లమెంట్ పునర్విభజన నాటికి సిద్దిపేట నుంచి జి. వెంకటస్వామి, నంది ఎల్లయ్య, విజయరామారావు, మల్యాలరాజయ్య, సర్వే సత్యనారాయణలు ప్రాతిని ద్యం వహించారు. 2009లో పునర్విభజన జరిగినప్పటికీ సిద్దిపేటకు రైల్వేలైన్ మంజూరుకు శాయశక్తుల కృషి చేస్తానన్న సిట్టింగ్ ఎంపీ విజయశాంతి మెదక్‌లో కొంత మేరకు పనులను ముందుకు తీసుకెళ్లినా సిద్దిపేటపై మాత్రం శీతకన్ను చూపిందన్న విమర్శలున్నాయి.



మరోవైపు  2004లో సిద్దిపేట ఉప ఎన్నికల ప్రచార సభలో కేసీఆర్ సిద్దిపేట నియోజకవర్గ ప్రశస్థని ఉటకిస్తూ రైల్వేలైన్‌ను సాధిస్తామని హామీ ఇచ్చారు. కాలక్రమేనా కేంద్ర మంత్రి వర్గంలో కేసీఆర్‌కు స్థానం లభించడంతో రెండు దశాబ్దాలుగా నోచుకొని రైల్వేలైన్‌కు మార్గం లభిస్తుందన్న అశ నియోజకవర్గ ఓటర్లలో బలంగా నెలకొంది. ఈ క్రమంలోనే 1999లో రైల్వే బడ్జెట్‌లో మనోహరబాద్ నుంచి సిద్దిపేట మీదుగా కొత్తపల్లి వరకు 154 కిలోమీటర్ల పొడవున మార్గానికి ప్రతిపాదనలు రూపొందించారు. సరిగ్గా ఏడు సంవత్సరాల తర్వాత పలు మార్పుల అనంతరం 2006లో సర్వేకు రైల్వే బడ్జెట్‌లో అమోదం లభించింది.



అందులో భాగంగానే 2006లో సర్వే పనులను కూడా ప్రారంభించారు. ముఖ్యంగా భూ పరీక్షలు,లెవలింగ్‌లాంటి పనులను పూర్తి చేసి సమగ్ర నివేదికను సంబంధిత కాంట్రాక్ట్ కేంద్ర ప్రభుత్వానికి అందజేసింది. 4 సంవత్సరాల క్రితం తాత్కలిక సర్వేకోసం రూ. 40 కోట్లను ప్రకటించిన కేంద్రం ఆ తర్వాత సకాలంలో సర్వే పనులు నిర్వహించక పోవడంతో కేటాయించిన నిధులు వెనక్కి వెళ్లాయి. అప్పట్లోనే కేంద్రం నూతన రైల్వే మార్గ నిర్మాణ విషయంలో మూడు డిమాండ్‌లను రాష్ట్ర ప్రభుత్వం ముందు పెట్టింది.



 రైల్వే నిర్మాణ బడ్జెట్‌లో మూడో వంతును రాష్ట్ర ప్రభుత్వం భరించాలని, రైల్వే లైన్ కోసం అవసరమయ్యే భూసేకరణకు రాష్ట్రమే  బాధ్యత వహించాలని, నూతన రైల్వే మార్గంలో అయిదేళ్ల పాటు సంభవించే నష్టాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని షరతులు విధించింది.  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఏకాభిప్రాయం కుదరక పోవడంతో రైల్వేలైన్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి. ఈ సమయంలో సార్వత్రిక ఎన్నికలు ముందుకు రావడం.. మరోసారి ఆయా పార్టీల అభ్యర్థులు రైల్వేలైన్‌పై ‘బాస’లు చేస్తుండడంతో సిద్దిపేటలో చర్చానీయంశంగా మారింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top