రైల్వే బడ్జెట్‌లో కేటాయింపులు అరకొర

రైల్వే బడ్జెట్‌లో కేటాయింపులు అరకొర


రైల్వే బడ్జెట్ ఈసారి కూడా నిరాశకు గురిచేసింది. పాత ప్రాజెక్టులకు కేటాయించిన నిధులు అరకొరే కాగా కొత్త ప్రాజెక్టుల ఊసే లేదు. ఏటా ఆశించడం ప్రజలు వంతుకాగా.. ఉసూరుమనిపించడం కేంద్రం బాధ్యతగా మారింది. గురువారం రైల్వే మంత్రి పార్లమెంట్‌లో బడ్జెట్ ప్రవేశపెడుతున్న సమయంలో జిల్లా ప్రజలు టీవీలకు అతుక్కుపోయారు. ప్రసంగ పాఠాన్ని వినడానికి ఆసక్తి కనబరిచారు. జిల్లాకు సంబంధించి ప్రాజెక్టుల మంజూరు, నిధుల కేటాయింపుపై దృష్టి పెట్టారు.



అక్కన్నపేట, మనోహరాబాద్ మార్గాలకు అరకొర ఇవ్వడంపై తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. కొత్తపల్లి-మనోహరాబాద్ రైల్వేలైన్‌కు రూ.20 కోట్లు, అక్కన్నపేట-మెదక్ మార్గానికి రూ.5 కోట్లు కేటాయించడంపై పెదవి విరిచారు. ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి మాత్రం పనులు చేపడతామంటున్నారు. మరిన్ని నిధులు రాబట్టే ప్రయత్నం చేస్తామంటున్నారు.


 

కొత్తపల్లి-మనోహరాబాద్‌కు రూ.20 కోట్లు


అక్కన్నపేట-మెదక్ మార్గానికి రూ.5 కోట్లు

మొక్కుబడి నిధులపై జిల్లా వాసుల పెదవి విరుపు

పనులు ప్రారంభిస్తామంటున్న ప్రజాప్రతినిధులు

మెదక్: వ్యయం కొండంత... మంజూరు గోరంత అన్నట్లుంది అక్కన్నపేట-మెదక్ రైల్వే లైన్‌కు కేటాయించిన బడ్జెట్. గురువారం కేంద్ర రైల్వేమంత్రి ప్రవేశ పెట్టిన బడ్జెట్‌లో అక్కన్నపేట-మెదక్ రైల్వేలైన్ కోసం రూ.5 కోట్లు విడుదల చేశారు. పెండింగ్‌లో ఉన్న రైల్వే లైన్లకే ఎక్కువ బడ్జెట్ వస్తుందన్న ఆశతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిపాదనలు పంపారు. మొక్కుబడిగా రూ.5 కోట్లు మాత్రమే నిధులు కేటాయించడంతో రైల్వేలైన్ పనులు ఏ మేరకు ముందుకు కదులుతాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.



అక్కన్నపేట-మెదక్‌కు 17.2 కిలో మీటర్ల మేర రైల్వేలైన్ మంజూరు చేస్తూ 2012-13 బడ్జెట్‌లో ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇందుకు గాను మొత్తం రూ.129.32 కోట్లు అవసరమని నిర్ణయించారు. ఇందులో 50 శాతం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తూ... ఉచితంగా భూ సేకరణ చేసివ్వాలని కేంద్రం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు 19 జనవరి 2014న రైల్వేలైన్‌కు అప్పటి ఎంపీ విజయశాంతి, మంత్రి సునీతారెడ్డిలు శంకుస్థాపన చేశారు. 2012-13లో రూ.కోటి, 2013-14లో రూ.1.10 కోట్లు, 2014-15లో రూ.10 కోట్లు  కలిసి మొత్తం రూ.12.10 కోట్లు మంజూరయ్యాయి. కాగా రాష్ట్ర వాటాకింద 2012-13లో రూ.కోటి, 2012-14లో రూ.75 లక్షలు కలిపి మొత్తం రూ.1.75 కోట్లు మంజూరయ్యాయి.



గత జనవరిలో రాష్ట్ర ప్రభుత్వం రూ.25.26 కోట్లు, భూ సేకరణ కోసం రూ.10 కోట్లు తన వాటా కింద మంజూరు చేసింది. దీంతో భూ సేకరణ పోనూ రైల్వేలైన్ పనుల కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి మొత్తం రూ.24.60 కోట్లు మంజూరు చేసినట్లయింది. అయితే ఇంతవరకు భూ సేకరణ ప్రక్రియ పూర్తి కాలేదు. ఈసారైనా కేంద్రం ఎక్కువ మొత్తంలో నిధులు మంజూరు చేస్తుందని ఆశపడ్డప్పటికీ కేవలం రూ.5 కోట్లు మాత్రమే కేటాయించడంతో మెదక్ వాసులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

 

కేసీఆర్ కల నెరవేరుతుంది..

అక్కన్నపేట-మెదక్, కొత్తపల్లి-మనోహరాబాద్ రైల్వేలైన్ల ఏర్పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ కల. ఉద్యమ సమయం నుంచి ఆయన రైల్వేలైన్ల ఏర్పాటు కోసం డిమాండ్ చేస్తూనే ఉన్నారు. ప్రస్తుతం అక్కన్నపేట-మెదక్‌కు రూ.5 కోట్లు, కొత్తపల్లి-మనోహరబాద్‌కు రూ.20 కోట్లు మంజూరు చేయడం సంతోషం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక మొదటిసారి నిధులు మంజూరయ్యాయి. ఎప్పుడో బ్రిటీష్ కాలంలో వేసిన రైల్వేలైన్లే ఇప్పటికీ కొనసాగుతున్నాయి. ప్రస్తుతం నిధులతో రైల్వేలైన్ పనులు ప్రారంభించవచ్చు. భవిష్యత్తులో అధిక కేటాయింపులు జరిగేలా కృషి చేస్తా.        - కొత్త ప్రభాకర్‌రెడ్డి, మెదక్ ఎంపీ

 

కొత్త ప్రాజెక్టులు సాధించుకుంటాం..

రైల్వే బడ్జెట్‌లో కొత్త ప్రాజెక్టులకు తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడం తీవ్ర నిరాశ పర్చింది. కేవలం పెండింగ్ ప్రాజెక్టులకే ప్రాధాన్యత నిచ్చి, కొత్త వాటి ఊసెత్తక పోవడం సరికాదు. పార్లమెంట్ సమావేశాలు ముగిసే లోగా రైల్వే కొత్త ప్రాజెక్టులను సాధించుకుంటాం. జహీరాబాద్-సికింద్రాబాద్, బోధన్-బీదర్ మధ్య కొత్త రైలు మార్గాల ఏర్పాటుకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలని రైల్వే మంత్రిని కోరుతా. కొత్త ప్రాజెక్టులకు మంజూరు లభిస్తుందనే నమ్మకముంది.    

                 - బీబీ పాటిల్, జహీరాబాద్ ఎంపీ

 

పనులు ప్రారంభిస్తాం..

అక్కన్నపేట-మెదక్ రైల్వేలైన్ పనుల కోసం బడ్జెట్‌లో కేటాయించింది రూ.5 కోట్లే. ఇది చాలా తక్కువ. మరిన్ని నిధులు కేటాయిస్తే బాగుండేది. అయినా పనులు ప్రారంభిస్తాం. రైల్వేలైన్ పనులు ప్రారంభించే అంశంపై చర్చించేందుకు మార్చి 3న సచివాలయంలో సమావేశం ఏర్పాటు చేయనున్నాం. ఈ సమావేశంలో రెవెన్యూ కార్యదర్శి, అటవీశాఖ చీఫ్ సెక్రెటరీ, రైల్వేబోర్డు ప్రతినిధి, జిల్లా కలెక్టర్ పాల్గొంటారు. ఉన్న నిధులతో భూ సేకరణ పూర్తిచేసి పనులు ప్రారంభించేందుకు చర్యలు చేపడతాం. కేంద్రమిచ్చిన రూ.5 కోట్లకు రాష్ట్ర వాటా కింద మరో రూ.5 కోట్లు మంజూరు చేయాలని సీఎంను కోరతాం.

- పద్మాదేవేందర్‌రెడ్డి, డిప్యూటీ స్పీకర్ (మెదక్ ఎమ్మెల్యే)

 

వైఎస్ హయాంలోనే రాష్ట్ర వాటాకు సంసిద్ధత

అక్కన్నపేట-మెదక్ రైల్వే లైన్ కోసం దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి అప్పట్లోనే ఎంతో చొరవ తీసుకున్నారు. ఇందులో సగం వాటాను రాష్ట్రం తరఫున భరించేందుకు ఆయన సంసిద్ధతను వ్యక్తం చేశారు. అప్పట్లో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ లైన్ కోసం వైఎస్‌కు విజ్ఞప్తి చేశా. ఈ మేరకు రూ.120 కోట్ల వ్యయంతో ప్రతిపాదనలు రూపొందాయి. ప్రస్తుత బడ్జెట్‌లో మంజూరు చేసిన రూ.5 కోట్లు ఏ పనికి కొరగావు. ఇప్పటివరకు భూ సర్వే, సేకరణ పూర్తి కాలేదు. పూర్తిస్థాయి సర్వేకూడా జరగలేదు. గత మూడేళ్లుగా మంజూరైన నిధులు కూడా అరకొరే. కనుక పెండింగ్ ప్రాజెక్ట్‌ల నిధులను అక్కన్నపేట-మెదక్ రైల్వేలైన్ పనులకు మళ్లించాలి. -  పి.శశిధర్‌రెడ్డి, పీసీసీ అధికారి ప్రతినిధి

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top