కాంగ్రెస్ కథేమిటి!

కాంగ్రెస్ కథేమిటి! - Sakshi


‘నాయిని’ని అడిగిన రాహుల్‌గాంధీ

యువనేతతో 38 నిమిషాలు భేటీ

పార్టీని బలోపేతం చేయూలని ఆదేశాలు




వరంగల్ : సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోర పరాజయం పొందడంతో మళ్లీ జవసత్వాలు కల్పించేందుకు ఆ పార్టీ అధిష్టానం చర్యలు మొదలుపెట్టింది. ఓటమికి కారణాలు, పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై కాంగ్రెస్ పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ దేశవ్యాప్తంగా ఎంపిక చేసిన ఆ పార్టీ నేతలతో చర్చలు  జరుపుతున్నారు. ఈ ప్రక్రియలో భాగంగా తెలంగాణ రాష్ట్రం నుంచి నిజామాబాద్ జిల్లాకు చెందిన మాజీ స్పీకర్ కెఆర్ సురేశ్‌రెడ్డి, వరంగల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నాయిని రాజేందర్‌రెడ్డిని ఢిల్లీకి పిలిపించారు. వీరిద్దరితో రాహుల్‌గాంధీ తమ నివాసంలో వేర్వేరుగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ‘రాబోయే వరంగల్ నగరపాలక సంస్థ, శాసనమండలి ఎన్నికల గురించి రాహుల్‌గాంధీకి వివరించానని రాజేందర్‌రెడ్డి చెప్పారు.



సమష్టిగా పని చేద్దాం.. అధికారంలోకి వస్తాం.. : రాహుల్‌గాంధీ



‘క్షేత్రస్థాయి నుంచి కాంగ్రెస్ పటిష్టత కోసం సమష్టిగా పనిచేద్దాం. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికీ పటిష్టంగానే ఉంది. 2019లో అధికారంలోకి రావడం తథ్యం. పార్టీకి అనుబంధ విభాగాలుగా ఉన్న ఎన్‌ఎస్‌యూఐ, యూత్ కాంగ్రెస్‌తో ఉండాల్సిన మేరకు సమన్వయం లేదు. దీనిని సరి చేసుకోవాలి. పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు అన్యాయం జరిగేందుకు కారణమవుతున్న లాబీయింగ్ విధానాన్ని తొలగించాలి. లాబీయింగ్ నాయకులు లేకుంటే పార్టీలోని మెరుగైన నాయకత్వం బయటికి వస్తుంది. సోషల్ మీడియాను వినియోగించుకోవడంలో మనం వెనుకబడుతున్నాం. యూపీఏ హయాంలో సబ్సిడీలను ఆధార్‌కు అనుసంధానించే విషయంలో పెద్ద ఎత్తున గగ్గోలు పెట్టిన బీజేపీ ఇప్పుడు అదే పని చేస్తోంది. ఇలాంటి అంశాలను మనం ప్రజల్లోకి తీసుకెళ్లాలి’ అని రాహుల్‌గాంధీకి వివరించినట్లు నాయిని రాజేందర్‌రెడ్డి తెలిపారు. భేటీలో రాజేందర్‌రెడ్డి జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ సమగ్ర సమాచారాన్ని పుస్తకం రూపంలో రాహుల్‌గాంధీకి అందజేశారు. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నామని తెలిపారు. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షునిగా తనను నియమించినందుకు రాహుల్‌గాంధీకి కృతజ్ఞతలు తెలిపారు. టీపీసీసీ మీడియా వ్యవహారాల ఇన్‌చార్జీ ఇ.వి.శ్రీనివాసరావు, నాయినితో రాహుల్‌గాంధీని కలిశారు.



 గొప్ప అనుభూతి : నాయిని

 

కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడిగా రాహుల్‌గాంధీతో భేటీ కావడం గొప్ప అనుభూతి కలిగిస్తోంది. 30 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇది మంచి సందర్భం. ఎన్నికల సమయంలో రాహుల్‌గాంధీ వరంగల్ పర్యటకు వచ్చినప్పుడు నేను జిల్లా అధ్యక్షునిగా ఉండటం, ఈ రోజు డిల్లీలో ఆయన నివాసంలో ఏకాంతంగా 38 నిమిషాలు సమావేశమవడం జీవితంలోనే మరిచిపోలేని రోజు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top