సర్కార్ సాయమందిందా?

సర్కార్ సాయమందిందా? - Sakshi


* 21జీవో అమలుపై పంజాబ్ బృందం అధ్యయనం

* ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబీకులతో వివరాల సేకరణ


గజ్వేల్: ‘‘అమ్మా...వ్యవసాయం ఎలా ఉంది. అప్పులు ఎందుకు చేయాల్సి వస్తోంది. మీ కుటుంబ యాజమాని మరణించాక సర్కారు ఆదుకుందా...? ఆ సాయం మీకు ఉపయోగపడిందా’ అంటూ ఆరా తీసిన పంజాబ్ రాష్ట్రానికి చెందిన వ్యవసాయశాఖ బృందం రైతు ఆత్మహత్య బాధిత కుటుంబీకులతో 421జీవో అమలు తీరుపై అధ్యయనం జరిపింది. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి రైతు ఆత్మహత్య బాధిత కుటుంబాలను ఆదుకోవడమే లక్ష్యంగా 421 జీవోను తీసుకువచ్చిన సంగతి తెల్సిందే. ఈ జీవోను ప్రస్తుత ప్రభుత్వం ఏవిధంగా అమలుపరుస్తున్నది...? వ్యవసాయానికి దేశంలోనే తలమాణికంగా ఉన్న పంజాబ్ రాష్ట్రంలో ప్రస్తుతం రైతు ఆత్మహత్యలు చోటుచేసుకుంటున్న తరుణంలో ఈ తరహా జీవో తీసుకురావచ్చా...? అనే విషయాలపై ప్రధానంగా ఈ అధ్యయనం సాగింది.



ఆ రాష్ట్రానికి చెందిన వ్యవసాయ యూనివర్శిటీ శాస్త్రవేత్త సుఖ్‌దేవ్‌సింగ్, అక్కడి వ్యవసాయశాఖ కమిషరేట్ కార్యాలయ జేడీఏ సోధి, చీఫ్ అగ్రికల్చర్ ఆఫీసర్ డాక్టర్ రాజేందర్ సింగ్ తదితరులు ముందుగా గజ్వేల్ మండలం కొడకండ్ల గ్రామంలో ఇటీవల ఆత్మహత్యకు పాల్పడిన ఫిరంగి ఎల్లయ్య భార్య మల్లమ్మను కలిశారు. ఈ సందర్భంగా ఎల్లయ్య ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులను తెలుసుకున్నారు. ‘‘సారూ మాకు రెండెకరాల సొంత భూమి ఉంది. మరో రెండెకరాలు కౌలుకు తీసుకొని వ్యవసాయం జేసినం. మూడెండ్ల సంది ఎవుసం కలిసిరాలే. రూ. 3లక్షల దాక అప్పులైనయ్. అప్పులు బాధ భరించలేక మా ఆయన పురుగుల మందు తాగుండి’ అంటూ వాపోయింది.



‘సర్కార్‌నుంచి రూ.లక్షన్నర సాయం మంజూరైందని చెప్పిండ్రు....ఆ పైసలు వస్తే కుదురుకొని పిల్లలను పోషించుకుంటూ బతుకుతా’ అని  చెప్పింది. మరో మృతుడు కొడిశెల రవి భార్య యాదమ్మ మాట్లాడుతూ,  ‘మాకు రెండెకరాల భూమి ఉంది. రెండేళ్ల కాలంలో నాలుగుబోరుబావులు వేసినం. అవి ఫెయిల్ అయినయ్. మరో రెండేళ్ల సంది పదెకరాల భూమిని కౌలుకు తీసుకొని పత్తి, మొక్కజొన్న పంటలు ఎసుకొని ఎవుసం జేసినా కాలం కలిసి రాలేదు. పంటలన్నీ దెబ్బతిన్నయ్. రూ.4 లక్షల అప్పుయ్యింది. అప్పులోళ్ల బాధ భరించలేక మా ఆయన పురుగులు తాగిండు.



మాకు ప్రభుత్వం నుంచి లక్షన్నర సాయం వచ్చిందని చెప్పిండ్రు...అవి వస్తే...పిల్లలను సాదుకుంటా’’ అని వివరించింది. జగదేవ్‌పూర్ మండలం రాయవరం గ్రామంలో ఆత్మహత్యకు పాల్పడిన ముత్యాలు భార్య కనకమ్మ భార్య ప్రభుత్వం మంజూరు చేసిన రూ. లక్షన్నరలో తనకు ఇప్పటివరకు రూ. లక్ష అందాయని వెల్లడించింది. పంజాబ్ రాష్ట్ర బృందం హిందీలో అడిగిన ప్రశ్నలను గజ్వేల్ ఏడీఏ శ్రావన్‌కుమార్ తెలుగులోకి అనువదించి మృతుల కుటుంబీకుల ద్వారా సమాధానాలు రాబట్టి వారికి వివరించారు.  బృందం సభ్యులు విలేకరులతో మాట్లాడుతూ తమ అధ్యయనం వివరాలను తమ రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక రూపంలో అందిస్తామని వెల్లడించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top