టీసీలు ఇస్తారా.. టీ చర్లను నియమిస్తారా!


మైల్వార్ పాఠశాల ఎదుట ఆందోళన

హెచ్‌ఎంను నిర్బంధించిన గ్రామస్తులు

ఉపాధ్యాయుల కోసం రోడ్డెక్కిన విద్యార్థులు

 

 తాండూరు రూరల్ : మండలంలోని మైల్వార్ పాఠశాలలో గురువారం తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉండటం, ఉన్న టీచర్లు సమయపాలన పాటించకపోవడంపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు భగ్గుమన్నారు. విధులను నిర్లక్షం చేస్తున్నారంటూ ప్రధానోపాధ్యాయుడిని గదిలో నిర్బంధించారు. మైల్వార్‌లోని మూడు పాఠశాలల్లో 387 మంది విద్యార్థులు న్నారు. ఉపాధ్యాయులు మాత్రం ముగ్గురే ఉన్నారు. దీంతో వారం రోజులుగా విద్యార్థుల తల్లిదండ్రులు, స్థానిక నాయకులు పాఠశాలకు వెళ్లి ఉపాధ్యాయులను నియమించాలని కోరుతున్నారు.



హెచ్‌ఎం నుంచి సరైన సమాధానం రాకపోవడంతో ఎస్‌ఎంసీ కమిటీ ఆధ్వర్యంలో గ్రామస్తులు ఆందోళన చేశారు. పాఠశాలలోని విద్యార్థులను బయటికి పిలిచి రహదారిపై బైఠాయించారు. విద్యార్థులు, యువజన సంఘం సభ్యులు ధర్నా చేశారు. పాఠశాలలో 16 మంది వరకు ఉపాధ్యాయులు ఉండాల్సి ఉండగా కేవలం ముగ్గురే ఉన్నారని అలాంటప్పుడు విద్యార్థులకు గుణాత్మక విద్య ఎలా అందుతుందని ప్రధానోపాధ్యాయుడు రాజ్‌పాల్‌సింగ్‌ను ప్రశ్నించారు.



పాఠశాల ఎదుట గొడవ జరుగుతున్న విషయం తెలుసుకొన్న సర్పంచ్ చంద్రశేఖర్, ఉప సర్పంచ్ హన్మంత్‌రెడ్డిలతోపాటు కాంగ్రెస్ మండల మాజీ అధ్యక్షుడు సికిందర్‌ఖాన్, టీఆర్‌ఎస్ మాజీ అధ్యక్షుడు బిచ్చిరెడ్డిలు పాఠశాలకు చేరుకొని ప్రధానోపాధ్యాయుడితో మాట్లాడారు. ఇప్పటికే బాలుర ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుడు లేకపోవడంతో మూతపడిందని, బాలికల ప్రాథమిక పాఠశాలలో ఒకే ఉపాధ్యాయురాలు ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.



విద్యార్థులకు టీసీలైనా ఇవ్వండి.. లేదంటే టీచర్లనైనా నియమించండంటూ పట్టుబట్టారు. సరైన సమాధానం చెప్పడంలేదంటూ గ్రామస్తులు హెచ్‌ఎం రాజ్‌పాల్‌సింగ్‌ను గదిలో నిర్బంధించారు. ఒక దశలో హెచ్‌ఎంపై గ్రామస్తులు దాడికి దిగే ప్రయత్నం చేశారు. బషీరాబాద్ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని గ్రామస్తులకు నచ్చచెప్పడంతో పరిస్థితి సద్దుమణిగింది. కార్యక్రమంలో ఎస్‌ఎంసీ కమిటీ చైర్మన్ భవిత, వైస్‌చైర్మన్ బాల్‌రాం, వివేకానంద యువజన సంఘం సభ్యులు చంద్రశేఖర్, హరీష్, మహిపాల్, శ్రీకాంత్, హన్మంతు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top