మహిళా కూలీలకు రక్షణేది?


 లింగాల: ఉన్న ఊరిలో ఉపాధి లేక పొట్టచేతబట్టుకొని హైదరాబాద్‌కు బతుకుదెరువు కోసం వలసవెళ్లిన మహిళా కూలీలకు రక్షణ లేకుండాపోయింది. పనిప్రదేశంలో వారు అఘాయిత్యాలకు గురవుతున్నారు. గుంపుమేస్త్రీల లాభాపేక్షకు వారు బలవుతున్నారు. వెలుగుచూసినవి కొన్నే అయినా బయటికి తెలియని ఎన్నో దారుణాలు ఉన్నాయి. తాజాగా లింగాల మండలానికి చెందిన ఓ గిరిజన మహిళ(21)పై హైదరాబాద్‌లో దుండగులు గ్యాంగ్‌రేప్‌నకు పాల్పడడం సంచలనం రేకెత్తించింది.



తన భర్తతో కలిసి ఉపాధి కోసం నగరానికి వె ళ్లింది. పనికి వెళ్తున్న ఆమెను హైదరాబాద్- వరంగల్ హైవేకు సమీపంలోని మేడిపల్లి పోలీస్‌స్టేషన్ పరిధి నారపల్లిని ఆనుకొని ఉన్న అటవీప్రాంతానికి తీసుకెళ్లి ఐదుగురు యువకులు గ్యాంగ్‌రేప్‌కు పాల్పడ్డారు. తనపై జరిగిన దారుణాన్ని భర్త, మరిది సహాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది.

     

2013 ఆగస్టు 3న మండల పరిధిలోని కొత్తచెర్వుతండాకు చెందిన ఓ గిరిజన వివాహిత మహిళ సికింద్రాబాద్‌లోని వెస్ట్ వెంకటాపురంలో ఇంటి వద్ద ఉండగానే అత్యాచారానికి గురైంది. ఇద్దరు పిల్లలు అనాథలయ్యారు. ఈ సంఘటన మరువకముందే సోమవారం రాత్రి లింగాలకు చెందిన ఓ వివాహిత సామూహిక అత్యాచానికి గురికావడం ఈ ప్రాంతంలోని వలసకూలీలను భయాందోళనకు గురిచేసింది. మం డలం నుంచి జీవనోపాధికి వందల కుటుంబాలు హైదరాబాద్‌కు వెళ్తున్నా యి. పనిచేసే చోట ప్రమాదాలకు గురవడం, అత్యాచారాలకు బలవుతుండడం వలసకూలీల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

 

దుండగులను శిక్షించాలి

అచ్చంపేట టౌన్: లింగాలకు చెందిన గిరిజన మహిళా వలసకూలీపై హైదరాబాద్‌లో దారుణానికి ఒడిగట్టిన దుండగులను శిక్షించాలని తెలంగాణ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో బుధవారం అచ్చంపేట పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా టీ జీవీపీ జిల్లా ఇన్‌చార్జి విజయరామరాజు మాట్లాడుతూ..దుండగులను గుర్తించి అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.



విద్యార్థినులు, మహిళలపై అరాచకాలు జరుగుతున్నా.. ఎలాంటి చర్యలు తీసుకోవడం సిగ్గుచేటన్నారు. బస్టాండ్లు, రద్దీగా ఉండే ప్రాంతాల్లో పోలీస్ పికెట్‌ను ఏర్పాటుచేయాలని కోరారు. కార్యక్రమంలో బీజేపీ నాయకుడు శ్రీనునాయక్, గౌస్, గౌతం, రాధాకృష్ణ, వెంకటేష్ పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top