వామ్మో.. దొంగలు

వామ్మో.. దొంగలు - Sakshi

► వేసవిలో భయాందోళనలో ప్రజలు

► గతేడాది ఉమ్మడి జిల్లాలో 86 చోరీలు  

► రాష్ట్రంలోకి బీదర్, గుల్బ్బర్గా ముఠాలు

► అప్రమత్తంగా ఉండాలంటున్న పోలీసులు

 

ఆదిలాబాద్‌: ఈ ఏడాది వేసవి ప్రారంభం కావడంతో ఆదిలాబాద్‌ పట్టణంలో దొంగల బెడద రోజురోజుకు పెరిగిపోతోంది. ఆయా కాలనీల్లో కొంత మంది విహారయాత్రలు, దూర ప్రాంతాల్లోని బంధువుల ఇళ్లు, శుభకార్యాలకు సొంత ఊళ్లకు  వెళ్తున్నారు. రోజుల తరబడి ఇంటికితాళం వేసి ఉండడంతో దొంగలకు ఇదే అనువుగా భావిస్తున్నారు. మధ్యాహ్నం సమయంలో రెక్కీ నిర్వహించి రాత్రి దొంగతనాలకు పాల్పడుతున్నారు. శుక్రవారం రాత్రి జిల్లా కేంద్రంలోని నాలుగు బట్టల దుకాణాల్లో ఏకకాలంలో దొంగతనం జరిగింది.



ఇందులో రూ.50 వేల నగదు, రూ.20వేల విలువగల దుస్తులు చోరీకి గురయ్యాయి. ఉమ్మడి జిల్లాలో గతేడాది మార్చి, ఏప్రిల్, మేలలో 86 దొంగతనాలు జరిగాయి. రూ.28 లక్షల నగదును దొంగలు ఎత్తుకెళ్లారు. ఇందులో రూ.13లక్షలు రికవరీ అయ్యాయి. ఏడాది మొత్తంలో 300 దొంగతనాలు జరగగా రూ.3కోట్ల 26లక్షల 15వేల 809 నగదు, ఆస్తులు దొంగల పాలు కాగా.. పోలీసులు రూ.2కోట్లు రికవరీ చేశారు. 

 

బీదర్, గుల్బర్గా ముఠాలు..

 

రాష్ట్రంలో బీదర్, గుల్బర్గాలకు చెందిన దొంగల ముఠాలు సంచరిస్తుండడంతో జిల్లాలో పోలీసు అధికారులు అప్రమత్తమయ్యారు. ఇప్పటివరకు జిల్లాలో మహారాష్ట్ర, బీహార్, ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రాలకు చెందిన వారే దొంగతనాలు చేసేవారు. ఇప్పుడు బీదర్, గుల్బర్గా ముఠాలు వస్తున్నాయని తెలియడంతో ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలో మూడేళ్ల కిందట బాసర, మంచిర్యాలలో దోపిడీ దొంగలు ఇంట్లో పడుకుని ఉన్న వారిని చంపి చోరీకి పాల్పడ్డారు. వీరిని పార్టీ ముఠాలు అంటారు.



మనుషులను చంపి దొంగతనాలకు పాల్పడడం వీరి ప్రత్యేకత. ఇప్పుడు వస్తున్న ముఠాలు చిన్నపిల్లలు ఏడ్చినట్లు అరుస్తూ.. దొంగతనాలకు పాల్పడుతారు. ఎవరో ఏడుస్తున్నారంటూ బయటకు వస్తే వారిపై దాడులు చేసి దోపిడీకి పాల్పడుతారని పోలీసులు చెబుతున్నారు. ఇలాంటి వారిని నమ్మకుండా ప్రజలు జాగ్రత్తగా ఉండాలంటున్నారు. ఇప్పటికే ఈ ముఠాలకు సంబంధించి వాట్సాప్‌లో ప్రచారం జరుగుతోంది. చిన్న పిల్లల అరుపులు వినిపిస్తే తలుపులు తెరవకూడదంటూ ఎస్పీ ఎం.శ్రీనివాస్‌ వాట్సాప్‌ మెసేజ్‌ ద్వారా జిల్లా ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. 

 

 

అప్రమత్తత అవసరం..

ప్రజల అప్రమత్తతోనే దొంగతనాలను నివారించవచ్చు. వేసవి సెలవులను సరదాగా గడిపేందుకు విహారయాత్రలు, శుభకార్యాలకు సొంత గ్రామాలకు వెళ్తుంటారు. ఇలాంటి సమయంలో ఇంటికి తాళం వేయడమే కాకుండా పక్కింటి వారికి చెప్పి వెళ్లాలి. పోలీసులకు కూడా సమాచారం అందించాలి. అంతేకాకుండా అప్పుడప్పుడు పక్కింటి వారికి ఫోన్‌లో అందుబాటులో ఉండాలి. ఇంట్లో బంగారు నగలు, విలువైన వస్తువులు, డబ్బులు ఉంచకూడదు. వేసవి కావడంతో ఇంట్లోని కూలర్ల చప్పుడుకు పక్కింట్లో ఏం జరుగుతుందో కూడా తెలియదు. దీంతో దొంగలు వారి పని సులువుగా చేసుకుపోయే అవకాశం ఉంటుంది. రాత్రి మెలకువ వచ్చినప్పుడు కాసేపు ఇంట్లోంచి బయటకు వచ్చి చూడాలి. అనుమానంగా శబ్దాలు వినిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలి. 

 

గతేడాది వేసవిలో జరిగిన దొంగతనాలు..

 

మార్చి 25న జైపూర్‌ మండలం ఇందారం గ్రామానికి చెందిన సింగరేణి కార్మికుడు షేర్ల స్వామి ఇంట్లో పట్టపగలే దొంగతనం జరిగింది. రూ.లక్ష నగదు, 13 తులాల బంగారం, 300 గ్రాముల వెండి ఎత్తుకెళ్లారు. ఏప్రిల్‌ 20న ఆదిలాబాద్‌ పట్టణంలోని రైల్వే క్వార్టర్స్‌లోని రైల్వే ఉద్యోగి రఘునాథ్‌ ఇంట్లో పట్టపగలే దొంగతనం జరిగింది. రూ.80 వేల నగదుతో పాటు, మూడు తులాల బంగారు ఆభరణాలు ఎత్తుకెళ్లారు. ఏప్రిల్‌ 16న రామకృష్ణాపూర్‌లోని శివాజీనగర్‌కు చెందిన సింగరేణి కార్మికుడు సత్యనారాయణ ఇంట్లో చోరీ జరిగింది. దొంగలు నాలుగు తులాల బంగారం, రూ.10వేల నగదు ఎత్తుకెళ్లారు. ఏప్రిల్‌ 2న మంచిర్యాల హైటెక్‌సిటీలో నారాయణ ఇంట్లో దొంగతనం జరిగింది. దొంగలు ఐదు తులాల బంగారం, రూ.50వేల నగదు ఎత్తుకెళ్లారు. 

 

నిఘా పెంచాం

జిల్లాలో పోలీసు నిఘా పెంచాం. వేసవిలో ప్రజలు విహారయాత్రలు, శుభకార్యాలకు వెళ్లేటప్పుడు పోలీసులకు సమాచారం అందించాలి. అనుమానిత వ్యక్తులను ఇంట్లోకి రానివ్వకూడదు. కాలనీలో అనుమానిత వ్యక్తులు కనిపిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలి. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారిపై నిఘా ఉంచుతాం. పట్టణంలో బీట్‌లు పెంచి నిరంతరం గస్తీ నిర్వహిస్తాం. 

                                                                                                             – ఎం. శ్రీనివాస్, జిల్లా ఎస్పీ 

 
Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top