‘ఆసరా’.. సర్కార్ గాబరా!

‘ఆసరా’.. సర్కార్ గాబరా! - Sakshi

  • 28 లక్షలకు చేరువైన పింఛన్లతో అధికమవుతున్న ఒత్తిడి

  •  ఎంపికలో అక్రమాలపై  దృష్టి

  •  ఫిర్యాదుల కోసం టోల్ ఫ్రీ నంబరు

  •  సర్పంచులకు లేఖలు రాయనున్న మంత్రి కేటీఆర్

  • సాక్షి, హైదరాబాద్: ‘ఆసరా’ కింద అందిస్తున్న పింఛన్లు దాదాపు 28లక్షలకు చేరువకావడం సర్కారును  ఒత్తిడికి గురిచేస్తోంది. ప్రస్తుతం వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, నేత, గీత కార్మికులకు మాత్రమే ఇప్పటివరకు వీటిని పరిమితం చేశారు. ఆ పింఛన్ల కోసం నెలకు రూ.314.52 కోట్ల వంతున ఏడాదికి సుమారు రూ. 3,774.24 కోట్లు వ్యయమవుతోంది.. ఇంకా.. స్వయం సహాయక గ్రూపుల్లోని సుమారు 2.5 లక్షలమంది పేద మహిళలకు అభయ హస్తం కింద పెన్షన్లు ఇవ్వాల్సి ఉంది. ఇటీవల బీడీ కార్మికులకు కూడా మార్చి 1 నుంచి‘ఆసరా’ అందిస్తామని సర్కారు ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్మికులు సుమారు మూడు లక్షల మంది ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. వీరందరికీ ప్రభుత్వం పింఛన్లు మంజూరు చేస్తే  పింఛనర్ల సంఖ్య 33లక్షలు దాటే అవకాశం లేకపోలేదు.

     

    ఎంపిక ప్రక్రియలో అక్రమాలు



    ‘ఆసరా’ పింఛన్ల పథకానికి అర్హులైన లబ్ధిదారులను ఎంపిక చేసేందుకు ప్రభుత్వం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ అక్రమాలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. ఇప్పటికే ఒకే వ్యక్తికి రెండు, మూడు పింఛన్లు మంజూరు కావడం, చనిపోయిన వారికి కూడా  మంజూరు చేయడం, ఉన్నత వర్గాలకు చెందిన కొందరు పింఛన్లు పొందుతుండడం.. తదితర అక్రమాలు దాదాపు అన్ని జిల్లాల్లోనూ జరిగాయని ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. గతంలో రూ. 200లుగా ఉన్న పింఛనును రూ. 1,000కి పెంచడం, రూ. 500గా ఉన్న పింఛను 1,500లకు పెంచడంతో గ్రామాల్లో అధికార, విపక్ష నేతలు తమ కుటుంబ సభ్యులకు వాటిని ఇప్పించుకున్నారని ఆరోపణలు వచ్చాయి. మరో వైపు తమకు అర్హత ఉన్నా పింఛన్లు అందలేదని ఎంతో మంది వృద్ధులు, వికలాంగులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూనే ఉన్నారు.ఇదే ఇప్పుడు చర్చనీయాంశమవుతోంది. వాస్తవ లెక్కలు తేలక గందరగోళ పరుస్తోంది.

     

    ఫిర్యాదులు, సలహాల కోసం టోల్‌ఫ్రీ!



    పింఛన్ల అక్రమాలపై ఫిర్యాదులు స్వీకరించేందుకు టోల్‌ఫ్రీ నెంబరును ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే 18002001001 నంబరును ఎంపిక చేసినట్లు తెలిసింది. ఈమెయిల్ సదుపాయాన్ని కూడా కల్పించనుంది. aasarapensions@ gmail.com మెయిల్ ఐడీని అందుబాట్లోకి తేనుంది. ఇక అర్హత కలిగిన వారికి పింఛను అందకపోవడంపై కూడా సర్కారు దృష్టి సారించింది. ఈ విషయమై గ్రామ సర్పంచులకు నేరుగా లేఖలు రాయాలని పంచాయితీరాజ్ శాఖామంత్రి కె.తారకరామారావు భావిస్తున్నారు. ఈ పథకాన్ని సమర్థంగా అమలు చేసేందుకు క్షేత్రస్థాయిలో సరైన సలహాలు, సూచనలు ఇవ్వాల్సిందిగా లేఖలో గ్రామ సర్పంచులను కోరనున్నారని మంత్రి సన్నిహిత వర్గాలు తెలిపాయి.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top