చిన్నారి కిడ్నాప్ కేసు దర్యాప్తులో పురోగతి


♦ కర్నూలులో నిందితురాలు

♦ పోలీసుల మోహరింపు

 

 చిలకలగూడ/చిన్నశంకరంపేట : సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో అపహరణకు గురైన చిన్నారిని కన్నతల్లి ఒడికి చేర్చేందుకు చిలకలగూడ పోలీసులు కృషి చేస్తున్నారు. అపహరించిన వారిని గుర్తించడంలో పురోగతి సాధించారు. ఏ క్షణమైనా నిందితురాలిని అదుపులోకి తీసుకునేందుకు ప్రత్యేక నిఘా బృందాలు కర్నూలు పట్టణంలో మాటు వేశాయి. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం గౌలిపల్లి అగ్రహారానికి చెందిన రాములు, రేణుకల కుమార్తె కావ్య (9 నెలలు)ను శనివారం తెల్లవారుజామున గాంధీ ఆస్పత్రి విజటర్స్ షెడ్ నుంచి గుర్తుతెలియని మహిళ అపహరించిన సంగతి విదితమే.



చిన్నారి తల్లి ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆదివారం సాయంత్రం.. నిందితురాలికి సహకరించిన వ్యక్తిని ఘట్‌కేసర్‌కు చెందిన రవికుమార్‌గా గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. సెల్‌ఫోన్ కాల్‌డేటా ఆధారంగా నిందితురాలు కర్నూలు పట్టణంలో ఉన్నట్లు గుర్తించి, అక్కడకు వెళ్లారు. నిందితురాలిని రాత్రికి లేదా సోమవారం నాటికి అదుపులోకి తీసుకుంటామని పోలీస్‌వర్గాలు స్పష్టం చేశాయి.



 అడ్డంకిగా మారిన ఆదివారం...

 చిన్నారిని రక్షించేందుకు ఆదివారం అడ్డంకిగా మారినట్లు తెలిసింది. నిందితురాలు వినియోగిస్తున్న సెల్‌నంబర్ కర్నూలు టవర్ లొకేషన్ చూపించింది. అయితే ఆదివారం సెలవు కావడంతో సర్వీస్ ప్రొవైడర్లు.. నిందితురాలి సెల్‌నంబర్ సమాచారాన్ని అందించలేకపోయారని తెలిసింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top