ఓపెన్‌కాస్ట్‌లకు వ్యతిరేకంగా పోరాడాలి

ఓపెన్‌కాస్ట్‌లకు వ్యతిరేకంగా పోరాడాలి - Sakshi


టీజేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం పిలుపు



గోదావరిఖని: ఓపెన్‌కాస్ట్‌లతో ప్రజలు ఉన్న ఊరును, వ్యవసాయ భూములను వదిలిపెట్టి పట్టణాలకు వలసవెళ్లి నిరుద్యోగులుగా బతకా ల్సిన పరిస్థితి ఏర్పడిందని అంతర్జాతీయ గని కార్మిక మహాసభ ఆహ్వాన సంఘం అధ్యక్షుడు, టీజేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం ఆవేదన వ్యక్తం చేశారు. ఓపెన్‌కాస్ట్‌లకు వ్యతిరేకంగా పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. అంతర్జా తీయ గని కార్మికుల 2వ మహాసభ రెండోరోజు శుక్రవారం ఎన్టీపీసీలో ప్రతినిధుల సభ జరగ్గా కోదండరాం ప్రసంగించారు. సింగరేణిలో పర్యావరణాన్ని దెబ్బతీసేలా ఓపెన్‌కాస్ట్‌ల తవ్వకం ఎక్కువగా జరుగుతోందని, ఇందుకు మందమర్రిలోని ఎర్రగుంటపల్లివాసులు ఏడా దిన్నరగా ఆందోళన చేస్తుండడం నిదర్శనమన్నారు.



అందుకే ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉండే ప్రత్యామ్నాయ విధానాల్ని ప్రభుత్వాలు అమలు చేయాలని సూచించారు. ప్రభుత్వాలు ప్రజాసంక్షేమం, పర్యావరణ పరిరక్షణ, కార్మికు ల భద్రతకు అనుకూలంగా మైనింగ్‌ పాలసీని అమలుచేయాలని కోరారు.  ఓపెన్‌కాస్టుల్లో కాంట్రాక్టు కార్మికుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోందని, దీంతో పర్మినెంట్‌ కార్మికుల ఉనికికే ప్రమాదం పొంచి ఉందన్నారు. ప్రభు త్వాలు కేవలం కాంట్రాక్టర్ల ప్రయోజనాలను కాపాడుతున్నాయన్నారు.



తక్కువ డబ్బులిచ్చి కాంట్రాక్ట్‌ కార్మికులతో ఎక్కువ పనులు చేయించుకుంటున్నారన్నారు. సింగరేణిలో ఏడాదిలోపు సర్వీసు ఉన్న కార్మికుల వారసులకు, వీఆర్‌ఎస్‌ డిపెండెంట్లకు, గోల్డెన్‌ హ్యాండ్‌ షేక్‌ పథకం ద్వారా పదవీ విరమణ పొందిన కార్మికుల పిల్లలకు ఉద్యోగావకాశాలు కల్పించాలని కోదండరాం డిమాండ్‌ చేశారు. ఇంటర్నేషనల్‌ కో–ఆర్డినేషన్‌ గ్రూప్‌ (ఐసీజీ) నేతృత్వంలో జాతీయ సన్నాహక కమిటీ సారథ్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్య సమన్వయకర్త ఆండ్రియాస్‌ (జర్మనీ), సమన్వయకర్త బి.ప్రదీప్, చైర్మన్‌ పీకే మూర్తి, వివిధ దేశాలు, భారతదేశంలోని పలు రాష్ట్రాల ప్రతినిధులు పాల్గొన్నారు.



సోషలిజమే శరణ్యం: సుప్రీంకోర్టు రిటైర్డ్‌ జడ్జి గోపాలగౌడ

దేశ ప్రజలకు ప్రస్తుత పరిస్థితుల్లో సోషలిజ మే శరణ్యమని, ఈ క్రమంలో సమాజ నిర్మాణ బాధ్యతలను భారత కార్మికవర్గం చేపట్టాలని సుప్రీంకోర్టు రిటైర్డ్‌ జడ్జి గోపాలగౌడ కోరారు. గోదావరిఖనిలో మహాసభల రెండో రోజు కార్యక్రమానికి వక్తగా హాజరైన ఆయన మాట్లాడుతూ ప్రతి పరిశ్రమలో సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, ప్రభుత్వాలు, ఆయా సంస్థల యాజమాన్యాలు విశాల దృక్పథంతో ఆలోచించాలన్నారు. ప్రపంచవ్యాప్తంగా బలమైన కార్మికోద్యమాలు, పోరాటాలు అవసరమని, ఇందుకోసం కార్మిక సంఘాలన్నీ ముందుకు సాగాలని సూచించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top