సాగు సగమే..

సాగు సగమే..


 కాలం కలిసిరాక ఖరీఫ్ రైతులు చిత్తయ్యారు. వర్షాభావం కారణంగా జిల్లాలో సాగు సగానికి తగ్గింది. భవిష్యత్తును తల్చుకుంటేనే రైతున్న వెన్నులో వణుకు పుడుతోంది. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై నెలన్నర రోజులవుతోంది. అన్ని పంటలకు అదను దాటుతోంది. కానీ ఇప్పటివరకు జిల్లాలో 55 శాతమే పంటలు సాగయ్యాయి. ఇక మిగిలిన 45శాతం పంటల సాగు ప్రశ్నార్థకంగా మారింది.

 

 కరీంనగర్ అగ్రికల్చర్  తొలకరి వర్షాలకు జూన్‌లో పత్తి, మొక్కజొన్న విత్తులు పెట్టిన రైతులు తీవ్రంగా దెబ్బతిన్నారు. తొలిదశలో విత్తులు దెబ్బతినగా మరోసారి విత్తుకున్న రైతులను వరుణుడు కొం త ఆలస్యంగా కరుణించాడు. అదును దాటాక కురుస్తున్న వర్షాలు కొంత ఊరటనిచ్చినా.. పూర్తిస్థాయిలో పంటలు సాగు చేసే పరిస్థితి లేదు. మున్ముందు వర్షాలు ఎలా ఉంటాయోనని ఐదెకరాల భూమి ఉన్న రైతులు కూడా రెండు మూడెకరాలకు మించి సాగు చేసేందుకు సాహసించడం లేదు.

 

 రానున్న రోజుల్లో వర్షాలు లేకుంటే పెట్టుబడులు మట్టిపాలై అప్పులు మీదపడుతాయని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఈ ఏడాది ఖరీఫ్ సాధారణ సాగు విస్తీర్ణం 5.18 లక్షల హెకార్లు కాగా, ఇప్పటివరకు 2.86 హెక్టార్లలోనే వివిధ పంటలు సాగయ్యాయి. గతేడాది ఇదే సమయానికి 4.05 లక్షల హెక్టార్లలో రైతులు పంటలు సాగు చేశారు. వరిసాధారణ సాగు విస్తీర్ణం 2.13 లక్షల హెకార్లు కాగా, 38వేల హెక్టార్లలోనే సాగు చేశారు. పత్తి 2.30 లక్షల హెక్టార్లకు 1.84 లక్షల హెక్టార్లలో వేశారు. ఇక మొక్కజొన్న, సోయాబీన్, పసుపు, మిర్చి, పప్పుధాన్యాల పంటలు నామమాత్రంగానే సాగయ్యాయి.

 

 పుట్టని బ్యాంకు రుణాలు

 ఈ ఏడు ఖరీఫ్ సీజన్‌కు రూ.1650 కోట్ల పంట రుణాలు ఇవ్వాలని సర్కారు లక్ష్యంగా పెట్టుకుం ది. ఈ మేరకు అన్ని బ్యాంకులకు ఆదేశాలు జారీ చేసింది. కానీ ఇప్పటివరకు రూ.85 కోట్ల రుణాలను మాత్రమే బ్యాంకులు మంజూరు చేశాయి. జిల్లావ్యాప్తంగా కేవలం 28,300 మం ది రైతులకే ఈ రుణాలు అందించాయి. పాత రుణాలు చెల్లించిన రైతులే తిరిగి రుణాలు పొం దారు. గతేడాది ఇదే సమయానికి రూ.690 కోట్ల రుణాలను 2.30 లక్షల మందికి మంజూరు చేశారు. ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీపై స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల చేయకపోవడంతో బ్యాంకర్లు రుణాలివ్వడం లేదు. దీంతో రైతులు ప్రైవేట్ వ్యాపారుల వద్ద అధిక వడ్డీలకు అప్పులు తీసుకుంటున్నారు. రుణమాఫీపై స్ప ష్టత లేకపోగా పాత రుణాలను రైతులు చెల్లించకపోవడంతో కొత్తగా రుణాలు ఇవ్వలేకపోతున్నామని లీడ్‌బ్యాంకు మేనేజర్ చౌదరి చెప్పారు.

 లోటు వర్షపాతమే..

 జూన్‌లో సాధారణ వర్షపాతం 153 మిల్లీమీటర్ల కాగా.. 78.7 మిల్లీమీటర్లు మాత్రమే కురిసింది. గతేడాది జూన్‌లో 208.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. జూలైలో సాధారణ వర్షపాతం 221.2 మిల్లీమీటర్లకు గాను ఇప్పటివరకు 97.8 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. గతేడాది ఇదే సమయానికి 443.3 మిల్లీమీటర్ల వర్షపాతం రికార్డయింది. జిల్లావ్యాప్తంగా ఇప్పటికీ 45 శాతం లోటు వర్షపాతం నమోదైంది. 47 మండలాలల్లో లోటువర్షం, ఏడు మండలాల్లో అత్యల్పం, మూడు మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో చెరువులు, కుంటల్లో నీళ్లు చేరుతున్నాయి. భూగర్భ జలమట్టం కూడా కొంత పెరిగే అవకాశముంది.

 

 కరెంటు కోతలే అసలు సమస్య

 బోర్లు, బావులున్న రైతులు అధికారులు వద్దంటున్నా వరిసాగుపైనే దృష్టిపెట్టారు. తొలకరి వర్షాలకు పోసిన నార్లు ముదురుతుండటంతో ఇటీవల నాట్లు వేశారు. ఆశించిన వర్షాలు లేకున్నా నీరందించి పంటను కాపాడుకోవచ్చని భావించారు. కానీ రైతులకు అడుగడుగునా కరెంటు సమస్య ఎదురవుతోంది.

 

 వ్యవసాయానికి ఏడు గంటలు సరఫరా చేస్తామన్న సర్కారు ప్రస్తుతం మూడు గంటలు కూడా కరెంటు ఇవ్వడం లేదని రైతులు పేర్కొంటున్నారు. దీనికితోడు ఓవర్‌లోడ్, లోవోల్టేజీ సమస్యలతో నిత్యం కరెంటు మోటార్లు కాలిపోతున్నాయి. ప్రస్తుతం ఉన్న కరెంటు కోతలను చూస్తే.. మున్ముందు కూడా ఇదే పరిస్థితి కొనసాగేలా కనిపిస్తోంది. ఇన్ని ఆటంకాలను అధిగమించి పంటలు పండించడం అన్నదాతకు సాధ్యమయ్యేనా అనే సందేహాలు నెలకొన్నాయి.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top