నాణ్యతకే ప్రాధాన్యం

నాణ్యతకే ప్రాధాన్యం


- లెవీ సేకరణను పరిశీలిస్తాం

- రేషన్ బియ్యం పంపిణీలో అక్రమాలకు తావిస్తే కఠిన చర్యలు

- జాయింట్ కలెక్టర్ రాంకిషన్

సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్:
పేద కుటుంబాలకు చేరాల్సిన రేషన్ బియ్యం పంపిణీలో అక్రమాలకు పాల్పడితే సహించేది లేదని.. క్షేత్రస్థాయి నుంచి దీనిపై పూర్తిస్థాయి నిఘా ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నామని జిల్లా జాయింట్ కలెక్టర్ రాంకిషన్ వెల్లడించారు. శుక్రవారం ‘సాక్షి’ ప్రతినిధితో ఆయన మాట్లాడారు. జిల్లాలో రేషన్ సరుకులు పంపిణీ జరుగుతున్న తీరు.. లెవీ సేకరణ అంశాలను వివరించారు. రేషన్ డీలర్లు తమ షాపులకు కేటాయించిన బియ్యాన్ని గతంలోలాగా దఫాల వారీగా డీడీలు చెల్లించి తీసుకువెళ్లే ప్రక్రియకు ఇక పూర్తిగా స్వస్తి చెప్పనున్నామన్నారు. ఆ డీడీలపై అలాట్ అయిన బియ్యాన్ని ఒకేసారి తీసుకువెళ్లి అర్హులైన రేషన్‌కార్డుదారులకు అందించాలని.. ఈ అంశంలో ఏమాత్రం పొరపాటు జరిగినా సదరు డీలర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని వివరించారు.



అలాగే ‘సాక్షి’లో వారం రోజులుగా లెవీ సేకరణపై వస్తున్న వార్తలకు సంబంధించి ఆయన స్పందించారు. ప్రభుత్వం ఇచ్చిన ధాన్యం మిల్లింగ్ చేసి వారికిచ్చిన దామాషా ప్రకారం ప్రభుత్వానికి బియ్యం లెవీ ఇవ్వాల్సిందేనన్నారు. ప్రభుత్వం ఇచ్చిన నిర్ణీత గడువులోపు లెవీ ఇవ్వని రైస్‌మిల్లర్లపై తగిన చర్యలు తీసుకుంటామని జేసీ వివరించారు. ఇప్పటికే జడ్చర్లకు సంబంధించి గత సంవత్సరం లెవీ ఇవ్వాల్సిన రెండు మిల్లులకు సంబంధించి నోటీసులు జారీచేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టామన్నారు. దీంతో ఒక మిల్లర్ పూర్తిస్థాయి లెవీని చెల్లించారని.. మరో రైస్‌మిల్లర్ లెవీ ఇవ్వడానికి గడువు కోరాడని జేసీ చెప్పారు. గడువు లోపు ఇవ్వని పక్షంలో క్రిమినల్ కేసులు పెట్టడానికి సైతం వెనుకాడబోమన్నారు.



రైస్‌మిల్లర్లు ప్రభుత్వానికి ఇచ్చే లెవీలో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలుంటాయన్నారు. లెవీ బియ్యాన్ని ఏ క్షణమైనా క్వాలిటీ కంట్రోల్ సిబ్బందితో తనిఖీలు చేయిస్తామన్నారు. అవసరమైతే గోదాముల్లోకి లెవీ చేరిన తరువాత కూడా మిల్లర్లు ఇచ్చిన ఏసీకేల ఆధారంగా తనిఖీలు చేస్తామన్నారు. ఇచ్చిన బియ్యంలో నాణ్యత లోపాలు ఉంటే తగిన చర్యలు తీసుకుంటామని ఆయన వివరించారు. ఇప్పటికే ప్రభుత్వానికి చెల్లించాల్సిన లెవీకి సంబంధించి రైస్‌మిల్లర్లు సకాలంలో ఇచ్చేందుకు గాను ఎన్‌ఫోర్స్‌మెంట్ డీటీలను వారికి అనుసంధానం చేశామని జేసీ చెప్పారు. సకాలంలో లెవీ రాని పక్షంలో రేషన్ బియ్యాన్ని ఏ రూపంలో మిల్లర్లు వినియోగించుకున్నా సహించబోమన్నారు.



రేషన్ బియ్యం అక్రమమార్గం పట్టకుండా నిఘాను కట్టుదిట్టం చేస్తున్నామని.. అడుగడుగునా తనిఖీలు చేస్తున్నామన్నారు. ఇప్పటికే రెండు నెలలుగా  నిఘా ఏర్పాటుచేయడం ద్వారా పెద్ద ఎత్తున రేషన్ బియ్యం అక్రమ రవాణాను అడ్డుకోగలిగామన్నారు. పలుచోట్ల కేసులు నమోదు చేశామని జే సీ వివరించారు. ప్రభుత్వం ఇచ్చిన ధాన్యం మిల్లర్ల వద్ద నిల్వ ఉందా లేదా ఆ ధాన్యం మిల్లింగ్ చేసే తమకు లెవీ ఇస్తున్నారా లేదా అన్న అంశాన్ని  క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేస్తున్నట్లు జేసీ వివరించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top