ధరల స్థిరీకరణనిధి విడుదల చేయండి

ధరల స్థిరీకరణనిధి విడుదల చేయండి


సాక్షి, హైదరాబాద్: ఉల్లి ధరలను నియంత్రించేందుకు ధరల స్థిరీకరణ నిధి నుంచి నిధులు విడుదల చేయాలంటూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసినట్లు మార్కెటింగ్ శాఖ మంత్రి టి.హరీశ్‌రావు వెల్లడించారు. శుక్రవారం శాసనసభ ఆవరణలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఉల్లిని అందరికీ అందుబాటులోకి తెచ్చేలా చేపడుతున్న చర్యలను వివరించారు. ఉల్లి సేకరణకు కేంద్రం నుంచి సకాలంలో నిధులు విడుదల కాని పక్షంలో రాష్ట్ర ఖజానా నుంచి రూ.100 కోట్ల మేర వినియోగించే యోచనలో  ఉన్నామన్నారు.



రూ.20కే కిలో ఉల్లిని అందుబాటులోకి తెస్తూ రాష్ట్ర వ్యాప్తంగా 80 విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. ఇప్పటికే హైదరాబాద్‌లో 40 విక్రయ కేంద్రాలు ఏర్పా టు కాగా, రెవెన్యూ డివిజన్ కేంద్రాలు, ముఖ్య పట్టణాల్లో మరో 40 విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. రాజధాని హైదరాబాద్‌లో రైతు బజార్లతో పాటు ‘మన కూరగాయల’ అవుట్‌లెట్ల ద్వారా ఉల్లి విక్రయాలు ప్రారంభించామన్నారు. మిగతా తొమ్మిది జిల్లాల్లో ఈ నెల ఐదో తేదీ నుంచి ప్రభు త్వ అవుట్‌లెట్లు ప్రారంభమయ్యేలా సన్నాహాలు చేస్తున్నామన్నారు. ఉల్లి సేకరణ, విక్రయాలపై సోమవారం జిల్లా జాయింట్ కలెక్టర్లు, పౌర సరఫరాలశాఖ అధికారులతో వీడియోకాన్ఫరెన్సు ద్వారా సమీక్ష నిర్వహించనున్నట్లు మంత్రి ప్రకటించారు.

 

కుటుంబానికి రెండు కిలోలు

మహారాష్ట్రలోని నాసిక్‌తోపాటు కర్నూలు, హైదరాబాద్‌లోని మలక్‌పేట మార్కెట్ల నుంచి ఉల్లి కొనుగోలుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు హరీశ్ ప్రకటిం చారు. బహిరంగ మార్కెట్‌లో ప్రస్తుతం కిలో ఉల్లి ధర రూ.40 నుంచి రూ.50 వరకు ఉందన్నారు. ప్రభుత్వ ఔట్‌లెట్ల ద్వారా రోజూ 100 టన్నుల ఉల్లి అందుబాటులోకి తెస్తామన్నారు. కుటుంబానికి గరిష్టంగా రెండు కిలోల వంతున  సరఫరా చేస్తామని చెప్పారు. వాట్సప్ ద్వారా ఉల్లి ధరలపై ఎప్పటికప్పుడు మార్కెటింగ్ విభాగం అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నట్లు మంత్రి ప్రకటించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top