ఖరీఫ్ ధాన్యం కొనుగోలుకు సిద్ధమవ్వండి

ఖరీఫ్ ధాన్యం కొనుగోలుకు  సిద్ధమవ్వండి


రాంనగర్ (నల్లగొండ): జిల్లా వ్యాప్తంగా ఖరీఫ్ సీజన్‌లో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ఇప్పటినుంచే ప్రణాళికలు సిద్ధం చేయాలని కలెక్టర్ టి.చిరంజీవులు సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం తన చాంబర్‌లో వివిధ శాఖల అధికారులతో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లావ్యాప్తంగా ఖరీఫ్‌లో 7లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుందని అంచనా వేసినట్లు తెలిపారు. అందులో 25శాతం ధాన్యాన్ని కొనుగోలు చేయాల్సి ఉన్నందున, అందుకు సమగ్ర ప్రణాళికలు రూపొందిం చాలని సూచించారు.

 

జిల్లాలో సుమారు 130 ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని, అందుకు సిద్ధంగా ఉండాలన్నారు. ప్రతి ధాన్యం కొనుగోలు కేంద్రంలో తేమయంత్రం, టార్పాలిన్లు, గన్నీ బ్యాగ్స్, కాంటాలు అందుబాటులో ఉంచాలని కోరారు. కొనుగోలు కేంద్రాల్లో కంప్యూటర్లు ఏర్పాటు చేసి రోజువారీగా ధాన్యం విక్రయించే రైతుల పేర్లు, టోకెన్స్ పంపిణీ తదితర వివరాలను నమోదు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆ టోకన్లు పంపిణీ చేసిన తేదీల వారీగానే వారు ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.

 

అదే విధంగా కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకువచ్చే రైతులకు సలహాలు, సూచనలు చేయటానికి అడ్వయిజరీ కమిటీలు వేయాలని స్పష్టం చేశారు. కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లర్ల వద్ద నుంచి 24 గంటల్లో అన్‌లోడ్ చేయాలని, ట్రాన్సుపోర్టు కాంట్రాక్టర్లను త్వరితగతిన ఫైనలైజ్ చేసేందుకు చర్యలు చేపట్టాలన్నారు. ఎవరైనా బాధ్యతారహితంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు.   సమావేశంలో జాయింట్ కలెక్టర్ ప్రీతిమీనా, జిల్లా పౌర సరఫరాల అధికారి నాగేశ్వర్‌రావు, వ్యవసాయ శాఖ జేడీ నర్సింహారావు, డీఆర్‌డీఏ పీడీ సుధాకర్, ఆర్‌టీఓ హన్మంతరెడ్డి, రైస్ మిల్లర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు నాగేందర్, సంఘం ప్రతినిధులు మల్లయ్య పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top