వామపక్షాల అభ్యర్థిని నిలబెడతాం

వామపక్షాల అభ్యర్థిని నిలబెడతాం


రాష్ట్రపతి ఎన్నికపై సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం

సాక్షి, హైదరాబాద్‌: వామపక్షాల తరఫున రాష్ట్రపతి అభ్యర్థిని నిలబెడతామని, ఈ నెల 22న అన్ని ప్రతిపక్ష పార్టీలతో కలసి సమావేశం ఏర్పాటు చేసి అభ్యర్థిపై నిర్ణయానికి వస్తామని సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి తెలిపారు. మంగళవారం రాష్ట్ర పార్టీ కార్యాలయం మఖ్దూం భవన్‌లో జాతీయ కార్యదర్శి నారాయణ, రాష్ట్ర సహాయ కార్యదర్శి పల్లా వెంకట్‌రెడ్డితో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు.



ప్రతిపక్షాలతో చర్చల పేరుతో కాలయాపన చేస్తూ బీజేపీ ఏకపక్షంగా అభ్యర్థిని ప్రకటిం చిందని, రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికలో ఆ పార్టీది కుటిల రాజకీయ నీతి అని విమర్శించారు. దేశవ్యాప్తంగా దళిత వ్యతిరేక విధానాలు అవలంబిస్తూ.. దళితుణ్ని రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించి, ఆ వర్గంలో పార్టీ వ్యతిరేకత తగ్గించుకోవాలనే నీచమైన ఎత్తుగడ వేసిందన్నారు. గో సంరక్షణ పేరుతో సంఘ్‌ పరివార్‌ శక్తులు  దళితులు, మైనార్టీలపై దాడులు చేస్తున్నాయని, అయినా ప్రభుత్వం నియంత్రణ చర్యలు చేపట్టలేదని, దీనిపై బీజేపీ సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.



దళిత మోర్చా అధ్యక్షునిగా పనిచేసిన ప్రస్తుత బీజేపీ రాష్ట్రపతి అభ్యర్థి రామ్‌నా«థ్‌ కూడా ఏనాడూ సంఘ్‌ పరివార్‌ దాడులను ఖండించలేదని, అలాంటి వారికి వామపక్షాలుగా తాము మద్దతివ్వమని స్పష్టం చేశారు. తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటకలో రైతులు అప్పుల ఊబిలో ఉన్నారని, పంటలకు గిట్టుబాటు ధర లేక నష్ట పోవాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. స్వామినాథన్‌ కమిటీ సిఫార్సులను అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. వ్యవసాయ సంక్షోభ పరిష్కారం కోసం ఈ నెల 24, 25, 26 తేదీల్లో దేశ వ్యాప్తంగా ఆందోళనలకు సిద్ధం అవుతున్నట్లు సురవరం తెలిపారు. వచ్చే ఏడాది మే నెలలో పార్టీ జాతీయ మహాసభలు కేరళలో నిర్వహించనున్నట్లు తెలిపారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top