రాష్ట్రపతి రాకకు ఏర్పాట్లు ముమ్మరం

రాష్ట్రపతి రాకకు ఏర్పాట్లు ముమ్మరం - Sakshi


శామీర్‌పేట్ : రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ రాకకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఆగస్ట్ 2న సాయంత్రం మండలంలోని నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం 12వ స్నాతకోత్సవానికి రాష్ట్రపతి ముఖ్య అతిథిగా హాజరు కానున్న విషయం విదితమే. ఆయన రాకకు సమయం దగ్గర పడుతుండటంతో అధికారులు ఏర్పాట్లను వేగవంతం చేశారు.



ఏళ్లుగా మరమ్మతులకు నోచుకోని నల్సార్- రాజీవ్ రహదారికి మహర్దశ పట్టనుంది. రాజీవ్ రహదారి నుంచి నల్సార్ లా యూనివర్సిటీ వరకు ఆర్‌అండ్‌బీ మెయింటెనెన్స్ నిధులు రూ. 40 లక్షలతో 2.8 కి.మీ. పొడవు, 5.50 మీటర్ల వెడల్పుతో కొత్తగా తారురోడ్డు పనులు ప్రారంభించారు.

 

శామీర్‌పేట్ మినీస్టేడియంలో హెలిప్యాడ్ ప్రదేశాన్ని గుర్తించారు. ఇక్కడ విద్యుత్ సౌకర్యం లేకపోవడంతో ప్రత్యేకంగా 160 కేవీ ట్రాన్స్‌ఫార్మర్‌ను మంగళవారం ఏర్పాటు చేశారు. ఒకవేళ విద్యుత్‌కు అంతరాయం కలిగితే అత్యవసరంగా వినియోగించేందుకు జనరేటర్‌ను సైతం ఏర్పాటు చేశారు. మినీ స్టేడియంలో మూడు చోట్ల హెలిప్యాడ్‌ల కోసం అధికారుల పర్యవేక్షణలో మార్కింగ్‌లు వేశారు. వీటి చుట్టూ డేలైట్లు ఏర్పాటు చేశారు.

 

దీంతో మినీస్టేడియం వారం రోజులుగా విద్యుద్దీపాల కాంతులతో జిగేల్‌మంటోంది. స్నాతకోత్సవ కార్యక్రమానికి గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు, హైకోర్టు చీఫ్ జస్టిస్, నల్సార్ చాన్స్‌లర్ జస్టిస్ కళ్యాణ్ జ్యోతిసేన్ గుప్తా, ప్రముఖ న్యాయవాదులు వస్తున్నట్లు యూనివర్సిటీ రిజిస్ట్రార్ విజేందర్‌కుమార్ తెలిపారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top