ఎమ్మెల్సీ ఎన్నికలకు టీఆర్‌ఎస్ కసరత్తు

ఎమ్మెల్సీ ఎన్నికలకు టీఆర్‌ఎస్ కసరత్తు


ఐదుగురు అభ్యర్థులనూ గెలిపించుకునే యత్నాలు

క్రాస్ ఓటింగ్ జరగకుండా చర్యలు

మాక్ పోలింగ్ నిర్వహించాలని నిర్ణయం

కొత్త ఎమ్మెల్యేలకు అవగాహన కల్పించే కార్యక్రమం


 

హైదరాబాద్: ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార టీఆర్‌ఎస్ దృష్టిసారించింది. ఎట్టిపరిస్థితుల్లోనూ క్రాస్ ఓటింగ్ జరగకుండా సకల జాగ్రత్తలు తీసుకుంటోంది. ఎమ్మెల్యే కోటాలోని ఆరు ఎమ్మెల్సీ స్థానాల భర్తీ కోసం జూన్ ఒకటో తేదీన ఎన్నికలు జరగనున్నాయి. ఐదు స్థానాలకు పోటీ పడుతున్న అధికార టీఆర్‌ఎస్ ఎలాగైనా అన్నింటినీ దక్కించుకోవడానికి వ్యూహాలు రచిస్తోంది. ఎమ్మెల్యేల సంఖ్యా బలం ఆధారంగా టీఆర్‌ఎస్‌కు నాలుగు ఎమ్మెల్సీలు ఖాయంగా వస్తాయి. కానీ ‘అంకెల గారడి’తో ఐదో స్థానాన్ని దక్కించుకోవచ్చునని ఆ పార్టీ నాయకత్వం భావిస్తోంది. ముఖ్యంగా తమ ఎమ్మెల్యేలు గట్టు దాటకుండా చూసుకుంటోంది. ఏమాత్రం పొరపాటు జరిగి తప్పుగా ఓట్లేసినా, ఉద్దేశపూర్వకంగా క్రాస్ ఓటింగ్‌కు పాల్పడినా అనుకున్నన్ని సీట్లు రావు. టీడీపీ సైతం తమ అభ్యర్థి గెలుపును సవాలుగా తీసుకుని పెద్ద మొత్తంలో సొమ్ములు గుమ్మరించే యోచనలో ఉండడం, టీఆర్‌ఎస్‌లోని అసంతృప్త ఎమ్మెల్యేలపై దృష్టి పెట్టడంతో అధికార పార్టీ మరింత జాగ్రత్త పడుతోంది.



టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల్లో అత్యధికులు కొత్తగా గెలిచిన వారు కావడం, తొలిసారి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పాల్గొంటున్నందున వారికి అవగాహన కల్పించాలని పార్టీ నాయకత్వం నిర్ణయించింది. శుక్రవారం(29న) టీఆర్‌ఎస్ శాసనసభాపక్షం(టీఆర్‌ఎస్‌ఎల్పీ) సమావేశంకానుంది. ఈ సమావేశంలోనే ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీ అభ్యర్థులను కేటాయిస్తారని చెబుతున్నారు. ఎమ్మెల్యేలు ఎవరెవరికి ఏ ఏ ప్రాధాన్య ఓటు వేయాలో వివరిస్తారు. ఈ కేటాయింపు పూర్తయ్యాక, మాక్ పోలింగ్ కూడా నిర్వహిస్తారని సమాచారం. సీఎం కేసీఆర్ స్వయంగా ఎమ్మెల్యేలకు ఓటింగ్‌పై అవగాహన కల్పిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

 

ఓట్ల విభజనపై తర్జనభర్జన..




 టీఆర్‌ఎస్ చేతిలో ఉన్న 76 ఓట్లతో నాలుగు స్థానాలు మాత్రమే గెలుచుకోవచ్చు. ఐదో అభ్యర్థి కోసం ఎంఐఎం మద్దతు తీసుకున్నా మరో ఏడు ఓట్లు అవసరం. ఇతర పార్టీల నుంచి ఓట్లను క్రాస్ చేయించడం తప్పనిసరి అన్న ప్రచారం జరుగుతోంది. అయితే పార్టీకున్న ఓట్లతోనే జాగ్రత్తగా ప్లాన్ చేస్తే ఐదుగురు అభ్యర్థులను గెలిపించుకోవచ్చని సోమవారం నాటి కేబినెట్ సమావేశంలో సీఎం కేసీఆర్ మంత్రులతో అన్నట్లు సమాచారం. దీంతో ఈ అంశం చర్చనీయాంశమైంది. ఒక్కో ఎమ్మెల్సీకి ఎన్ని ఓట్లు అవసరమన్న సందేహం తలెత్తుతోంది. అధికారులు చెబుతున్న సాధారణ లెక్కల ప్రకారమైతే ఒక్కో ఎమ్మెల్సీ అభ్యర్థి విజయం సాధించడానికి 18 ఓట్లు అవసరం. దీని ప్రకారమే ఎమ్మెల్యేలను సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. టీఆర్‌ఎస్‌లో ప్రస్తుతం ఇదే తర్జనభర్జన జరుగుతోందని చెబుతున్నారు.

 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top