‘రాత’బాగుంటే .. గెలుపు వెన్నంటే..

‘రాత’బాగుంటే .. గెలుపు వెన్నంటే.. - Sakshi


మనం రాసే ప్రతి అక్షరం.. చేసే ప్రతి సంతకం.. చూసే ప్రతి వ్యక్తి మదిలోనూ పది కాలాలపాటు చెరగని ముద్ర వేయాలంటే అందమైన చేతి రాతతోనే సాధ్యం. అందుకే బుడిబుడి అడుగులతో బడికి వెళ్లే బుజ్జాయి నుంచి కోటి ఆశలతో కళాశాలలకు వెళ్లే యువత వరకు అందరూ అందమైన దస్తూరి కోసం ఆరాటపడుతుంటారు. నేటి కంప్యూటర్ యుగంలోనూ విద్యా రంగంలో చేతి రాత ప్రాధాన్యం ఏమాత్రం తగ్గలేదు. అక్షరాలను ముత్యాల్లా రాసేవారికి ఉజ్వల భవిత ఉంటుందంటున్నారు చేతిరాత నిపుణులు.



ముఖ్యంగా ఎస్‌ఎస్‌సీ, ఇంటర్ విద్యార్థులకు మంచి మార్కులు సాధించే క్రమంలో చేతిరాత ఓ సాధనంగా ఉపయోగపడుతుందంటున్నారు. మంచి చేతిరాతతో కనీసం 20 మార్కులు అదనంగా సాధించే అవకాశం ఉంటుందంటున్నారు..


 

అందమైన దస్తూరితో ఎన్నో లాభాలు

ఎస్‌ఎస్‌సీ, ఇంటర్ స్థాయిల్లో చేతిరాతకు ప్రాధాన్యం

మార్కులు పెరిగే అవకాశం

సాధనతో సాధ్యమేనంటున్న నిపుణులు


చేరాత చేజారి పోతోంది. కలాన్ని కుదురుగా పట్టుకొని ముత్యాల్లాంటి అక్షరాలను జాలువార్చాల్సిన చేతి వేళ్లు ఇప్పుడు కంప్యూటర్ కీబోర్డుపై నాట్యమాడుతున్నాయి. చిన్నప్పటిలా అందంగా రాయలేకపోతున్నామని మధనపడుతున్నవారెందరో. కొందరు పెద్దలైతే పిల్లలు దస్తూరిగా రాస్తున్నారో లేదో పట్టించుకోవడమే మానేశారు. సాంకేతిక రంగం ఎంత విస్తరించినప్పటికీ ఇప్పటికీ అన్ని రంగాల్లో చేతి రాతే కీలకం. అందమైన చేతి రాత ఉంటే పరీక్షల్లో మార్కుల సాధనలో ముందున్నట్లే.

 

సాధనమున సమకూరు..



రాసేటప్పుడూ కూర్చొనే భంగిమ, కలాన్ని పట్టుకొనే విధానం, కాగితానికి, కలానికి మధ్య దూరం వంటి అంశాలు ముఖ్యపాత్ర వహిస్తాయి.

బాల్ పాయింట్ పెన్ను కన్నా సిరాకలమే రాయడానికి అనుకూలంగా ఉంటుంది. దానితో కొంతమేర చేతిరాత మెరుగవుతుంది.

సున్నా, అరసున్నా, నిలువు గీతలను కూడా బాగా సాధన చేయాలి.

ఆంగ్లం, తెలుగు భాషల్లో మెరుగైన రాత కోసం అపసవ్య దిశలో, హిందీ భాషకు సవ్యదిశలో రాయడం సాధన

 చేయాలి.

మెలకువలను అవపోసనపట్టి నిర్విరామంగా 21 రోజులపాటు ప్రాక్టీస్ చేస్తే అద్భుతమైన చేతి రాత సొంతమ వుతుందని చేతిరాత నిపుణులు పేర్కొంటున్నారు.



విద్యార్థులు ఇవి గుర్తుంచుకోండి..

జవాబుల్ని సూటిగా చెప్పాలి.

సమాధానాలు టీచరుకు తెలుసని గుర్తించాలి. మనంరాసే తీరు పరీక్ష పేపరు దిద్దేవారిని ఇబ్బంది పెట్టే విధంగా ఉండరాదు.

వ్యాకరణ తప్పులేకుండా చూసుకోవాలి.

కొందరు విద్యార్థులు ఒక జవాబు పత్రంపై 25 నుంచి 30 లైన్లు రాస్తారు. ఇది చూసే వారిని ఆకట్టుకోలేదు. కాబట్టి ఒక్కో పేజీలో 16-18 లైన్లకు మించకూడదు.

ఒక పాయింట్ దగ్గర మొదలైన రాత ఆలైను చివరికి వెళ్లే సరికి పైకో, కిందికో పోతుంది. దాంతో ఆ పేజీల్లో అన్నిలైన్లు అలానే పోతాయి. మొదటి లైను రాసే సమయంలోనే మార్జిన్ లైన్‌ను చూస్తూ సమాంతరంగా రాయాలి. దాంతో మిగిలిన లైన్లు కూడా అలాగే సమాంతరంగా వస్తాయి.

గీత చివరి వరకు రాస్తూ చివరికి వెళ్లగానే అక్కడ సగం పదం రాసి.. మరో సగాన్ని కిందిలైనులో రాస్తుంటారు. దీంతో దిద్దే వారికి ఆ పూర్తి పదం ఏంటో వెంటనే అర్థం కాదు.

చాలామంది విద్యార్థులు ప్రశ్నపత్రంలో బాగా ఒత్తిపట్టీ మరీ రాస్తుంటారు. కలాన్ని వేళ్లతో బిగ పట్టుకుంటారు. దీంతో పేజీ రెండోవైపు ఆ అక్షరాలు కనిపిస్తూ గందరగోళపరుస్తాయి. కొద్దిసేపు రాయగానే వేళ్లు నొప్పిపెడతాయి.

చాలామంది విద్యార్థులు అంకెలను సరిగా రాయరు. ఉదాహరణకు...‘2’ అంకెను ఇంగ్లిష్ ‘జెడ్’ తరహాలో ‘5’ను ‘ఎస్’లో

‘0’ను ‘6’తరహాలో రాస్తుంటారు. దీంతో రావాల్సిన మార్కులు తగ్గిపోతాయి.

సామాన్యశాస్త్రంలో బొమ్మల్ని గీస్తే ఆ చిత్రంలోని భాగాల్ని గుర్తించడంలో ఒక క్రమ పద్ధతి పాటించాలి.

పరీక్షలో కొంతసేపు రైటింగ్, అలంకరణకు సమయం తీసుకోవాలి.

పరీక్ష పత్రంలో ఏవైనా తప్పులు రాస్తే వాటిని పెన్సిల్ లేదా పెన్నుతో బాగా రుద్దుతారు. దీంతో పేపరంతా నల్లగా మారుతుంది.

 అక్షరాల్ని ఇలా రాయండి

పేజీకి పైభాగంలో ఒక అంగుళం, ఎడమవైపు అదే స్థాయిలో మార్జిన్‌ను విడిచి పెట్టాలి. పేజీకి కుడివైపు కూడా అర అంగుళం ఖాళీ విడిచిపెట్టి రాయాలి. టీచర్లు పేజీలను దారంతో కట్టినా..రబ్బర్‌బ్యాండ్‌తో చుట్టినా జవాబులు స్పష్టంగా

 కన్పిస్తాయి.

కొన్ని స్కూళ్లలో విద్యార్థులు గీతల పేజీల నోట్‌బుక్‌లో జవాబులు రాస్తుంటారు. పరీక్షల్లో మాత్రం గీతల్లేని పేపర్లపై రాయాల్సి ఉంటుంది. అలాంటి విద్యార్థులు తెల్లకాగితంపై తర్ఫీదు పొందాలి.

పరీక్షల్ని నలుపు, బ్లూపెన్ తప్ప వేరే పెన్నుల్ని వాడరాదు. బాల్ పాయింట్ పెన్నులు అనుకూలమైనవి. రెండు పెన్నులు ఉంటే ఒకే కంపెనీవై ఉంటే మంచిది.

జవాబుల్లో ఏవైనా ముఖ్యమైన పదాలు ఉంటే వాటి కింద నల్లటి పెన్సిల్‌తో గీతగీయాలి.

⇒  విద్యార్థులకు పాఠశాలలు అచ్చు పుస్తకాలు ఇవ్వకుండా ముఖ్యమైన సమాధానాల్ని చేతితో రాయించాలి.

జవాబు పత్రంలో వేసే బొమ్మల్లోని భాగాల్ని ఒకవైపు సరళ రేఖల్ని గీసి భాగాలు పేర్లు రాస్తే మేలు. లేదా వాటికి నంబర్లను ఇచ్చి ఒక వైపు రాయాలి.

పరీక్ష పత్రంలో ప్రశ్నలు సెక్షన్ల వారీగా ఉంటాయి. ఇచ్చిన సమయాల్ని భాగాలుగా విడగొట్టి ఆ సమయంలో ఇచ్చిన

 సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి.

 

సాధన చేయాలి..

సాధనమున పనులు సమకూరు అన్నట్లుగా విద్యార్థులు కష్టపడి సాధన చేస్తే చక్కటి దస్తూరిని రాబట్టడం సాధ్యమే. ముందుగా అక్షరాలు గుండ్రంగా రాయడం అలవాటు చేసుకోవాలి. తర్వాత పదాలు, వాఖ్యాల కూర్పుపై దృష్టి పెట్టాలి. పదో తరగతి, ఇంటర్ విద్యార్థులకు చక్కటి చేతిరాత ఎక్కువ మార్కుల సాధనకు ఉపయోగ పడుతుంది.

- సుభాన్ రెడ్డి, హెచ్‌ఎం, దిర్సంపల్లి తండా ప్రాథమిక పాఠశాల

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top