ప్రజాప్రతినిధిగా బాధ్యతలను నెరవేరుస్తా

ప్రజాప్రతినిధిగా బాధ్యతలను నెరవేరుస్తా - Sakshi


సమస్యల పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకుంటా..

కాలనీని అభివృద్ధి పథంలో నిలుపుతా




ఆ కాలనీ.. సాయంత్రం 6 గంటలు దాటిందంటే చాలు అంధకార బంధురంగా మారుతుంది. వీధిదీపాలు లేకపోవడంతో ప్రజలు చీకటిలోనే మగ్గాల్సి వస్తోంది. రోడ్డు సక్రమంగా లేకపోవడంతో కాలనీవాసుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. చీకటి పడిందంటే చాలు ఇళ్లనుంచి బయటికి వచ్చేందుకు జనాలు జంకాల్సిన పరిస్థితి.



ఇక్కడ లెక్కలేనన్ని సమస్యలు తిష్టవేశాయి. ఈ దుస్థితి అంతా మరెక్కడో కాదు.. అంతర్జాతీయ విమానాశ్రయానికి అత్యంత చేరువగా ఉన్న చారీనగర్ కాలనీలో నెలకొంది. శంషాబాద్ పంచాయతీ పరిధిలోని చారీనగర్ కాలనీ కుగ్రామాన్ని తలపిస్తుంది. ఇక్కడ నెలకొన్న సమస్యల పరిష్కారానికి ‘సాక్షి’ రిపోర్టర్‌గా రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి. ప్రకాష్ గౌడ్ వచ్చారు. ప్రజలతో ఆయన మమేకమయ్యారు. సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వాటిని అతి త్వరలోనే పరిష్కరించడానికి చర్యలు చేపడతానని.. చారీనగర్ కాలనీ దశ మారుస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు.

 

ఎమ్మెల్యే : ఏమ్మా.. పింఛను వస్తోందా?

కోటేశ్వరి: వికలాంగురాలినైన నాకు పింఛను ఇవ్వడంలేదు. పంచాయతీ కార్యాలయం చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా పట్టించుకోవడంలేదు.

ఎమ్మెల్యే : సర్టిఫికెట్ చూపించావా?

కోటేశ్వరి : చూపించినా చెల్లదంటున్నారు.

ఎమ్మెల్యే: అధికారులతో మాట్లాడి న్యాయం జరిగేలా చూస్తాను. నీకు ట్రైసైకిల్ ఇప్పిస్తాను.

ఎమ్మెల్యే : పెద్దమ్మా.. ఇక్కడేం సమస్యలున్నాయి?

మాణెమ్మ: మా బస్తీలో మురుగు కాలువలు లేవు. మురుగు రోడ్డు మీద పారుతోంది. ఎన్నాళ్ల నుంచో చెబుతున్నా ఎవరూ స్పందించడం లేదు.

ఎమ్మెల్యే : కాలనీలో ప్రాధాన్యత క్రమంగా భూగర్భ డ్రైనేజీల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటాను.

ఎమ్మెల్యే : అమ్మా.. కాలనీలో ప్రధాన సమస్య ఏమిటి?

భారతమ్మ: కాలనీకి ఉన్న రోడ్డు అధ్వానంగా ఉంది. మా గోస ఎవరు పట్టించుకుంటలేరు సారూ..

ఎమ్మెల్యే: కాలనీకి రోడ్డు కోసం ఇటీవలే నిధులు మంజూరయ్యాయి. అంతర్గత రోడ్ల కోసం నిధులు వచ్చేలా, పనులు జరిగేలా కృషి చేస్తాను.

ఎమ్మెల్యే : పెద్దాయనా.. ఫించన్ వస్తోందా?

వీరయ్య: నాకు ఒక కన్ను పూర్తిగా కనిపించదు సార్. పింఛను అడిగితే రాదంటున్నారు.

ఎమ్మెల్యే : సర్టిఫికెట్ తెచ్చుకున్నావా?

వీరయ్య : సర్టిఫికెట్ కోసం ఎన్నిసార్లు తిరిగినా ఇవ్వడం లేదు.

ఎమ్మెల్యే : నీ పేరు అధికారులకు చెబుతాను. ఫించన్ వచ్చేలా చర్యలు తీసుకుంటారు.

ఎమ్మెల్యే : కరెంటు సరఫరా ఎలా ఉంది?

జైబున్నీసాబేగం: మా బస్తీలో వీధి దీపాలు లేవు. బస్తీ చుట్టూ చెట్ల పొదలు ఉండడంతో పాములు తిరుగుతున్నాయి. రాత్రి వేళ బయటికి వెళ్లలేకపోతున్నాం.

ఎమ్మెల్యే: అధికారులతో మాట్లాడి తగు చర్యలు తీసుకునేలా కృషి చేస్తాను.

ఎమ్మెల్యే: బాబూ.. ఏం పని చేస్తున్నావు?

గౌస్: మాకు ఎయిర్‌పోర్టులో ఉద్యోగాలు ఇవ్వడంలేదు. ఉద్యోగం ఇచ్చినా  జీతాలు సక్రమంగా చెల్లించకుండా ఏదో రకంగా ఇబ్బంది పెడుతున్నారు.

ఎమ్మెల్యే: అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటైనా ఇక్కడి నిరుద్యోగులకు ఉపాధి దొరకకపోవడం విచారకరం. ఈ అంశంపై ప్రత్యేకంగా దృష్టిసారిస్తా.

ఎమ్మెల్యే : పెద్దాయనా సమస్యలు ఏమున్నాయి?

జావెదిమియా: మా కాలనీలో ఎవరైనా చనిపోతే పూడ్చిపెట్టడానికి జానేడు జాగ లేదు సార్.  స్మశాన వాటికకు స్థలం కేటాయించాలి.

ఎమ్మెల్యే : అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటాను.

ఎమ్మెల్యే:  చెప్పమ్మా.. ఇక్కడ ఎలాంటి సమస్యలున్నాయి?

మౌనిక: మా కాలనీకి బస్సు సౌకర్యం సరిగ్గా లేదు.

ఎమ్మెల్యే : రోజుకు బస్సు ఎన్ని సార్లు వస్తుంది.

మౌనిక : రోజుకు ఉదయం ఒక ట్రిప్పు మాత్రమే వస్తుంది. మిగతా అన్ని సమయాల్లో శంషాబాద్ వరకు కాలినడకనే వెళ్లాల్సిన పరిస్థితి.

ఎమ్మెల్యే: వెంటనే ఆర్టీసీ అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటాను.  

ఎమ్మెల్యే : అమ్మా.. బాగున్నారా?

మంజుల: ఏం బాగో సారు.. మాకు రోగం వస్తే వైద్యం చేయించుకోవడానికి కూడా ఇబ్బందులు పడుతున్నాం. ప్రతి చిన్న దానికి శంషాబాద్ వెళ్లాల్సిందే.

ఎమ్మెల్యే : వైద్య సౌకర్యం అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటాను.

ఎమ్మెల్యే : మీదగ్గర ఉన్న సమస్యలేమిటో చెప్పండమ్మా?

అనుసూజ: బస్తీలో అందరం పేదవాళ్లం ఉంటున్నాం. మాకు ఇళ్ల పట్టాలు ఇవ్వలేదు. అద్దె ఇళ్లలో నివసిస్తున్నాం. మాకు న్యాయం చేయాలి.

ఎమ్మెల్యే: ఈ విషయమై రెవెన్యూ అధికారులతో చర్చించి సమస్య పరిష్కారానికి ప్రయత్నిస్తాను.

లావణ్య: సార్.. మా బస్తీలో నిరుద్యోగ సమస్య ఉంది. యువతులకు కుటీర పరిశ్రమ ఏర్పాటు చేయించి ఉపాధి కల్పించాలి. కుట్టు మిషన్ నేర్చుకున్న వారికి ఆర్థిక సహాయం అందజేస్తే స్వయం ఉపాధి పొందుతారు. ప్రధానంగా రవాణా సమస్యను పరిష్కరించాలి.

ఎమ్మెల్యే: నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడానికి తప్పకుండా చర్యలు తీసుకుంటాను.

ఎమ్మెల్యే : పెద్దాయనా మీ సమస్యలేమున్నాయి?

మాసయ్య: మాకు సొంత ఇల్లు లేదు. అద్దె ఇంట్లో ఉంటున్నాం. కూలీ చేసుకునే మాకు సొంతిల్లు లేక ఇబ్బందులు పడుతున్నాం. మమ్మల్ని ఆదుకోవాలి.

ఎమ్మెల్యే: కాలనీలో చాలా మందికి ఇళ్ల పట్టాలు లేవని చెబుతున్నారు. ఉన్నతాధికారులతో మాట్లాడి..అందరి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటాను.

ఎమ్మెల్యే : ఇంకా ఏం కష్టాలున్నాయమ్మా..?

సత్తమ్మ : మోరీల దగ్గరి నుంచి రోడ్డు వరకు ఏది చెప్పినా ఎవరూ పట్టించుకుంటలేరు సారూ..

ఎమ్మెల్యే : ఒక్కొక్కటిగా సమస్యలన్నింటినీ పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటా.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top