శ్రీశైలంలో ఉత్పత్తి ఆపేది లేదు:కేసీఆర్

శ్రీశైలంలో ఉత్పత్తి ఆపేది లేదు:కేసీఆర్ - Sakshi


స్పష్టం చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు

విద్యుదుత్పత్తి ఆపారని చంద్రబాబుకు చెప్పిన

కృష్ణాబోర్డు చైర్మన్ పండిట్ మళ్లీ ఉత్పత్తి చేస్తే ఎలాగన్న బాబు..

 ఊహాజనితమైన వాటికి సమాధానం ఇవ్వలేనన్న చైర్మన్


 

సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం ప్రాజెక్టులో విద్యుత్ ఉత్పత్తిని ఆపేది లేదని తెలంగాణ సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. మంత్రివర్గ సమావేశం అనంతరం ఆయన ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ఇదే సమయంలో తెలంగాణ అధికారులు శ్రీశైలం ప్రాజెక్టులో విద్యుదుత్పత్తిని తిరిగి ప్రారంభించారు కూడా. శుక్రవారం సాయంత్రం శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి ఆగిపోయిందని కృష్ణా బోర్డు చైర్మన్ పండిట్ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు వివరించిన కొన్ని గంటల్లోనే.. తెలంగాణ సీఎం కేసీఆర్ శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తిని ఆపే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. శ్రీశైలం జలాశయం నుంచి తెలంగాణ ప్రాంతానికి 97 టీఎంసీల నీరు కేటాయించారని.. ప్రస్తుతం అన్ని రకాలుగా వినియోగిస్తున్నది 16 టీఎంసీలు మాత్రమేనని, ఇంకా 81 టీఎంసీలు వినియోగించుకునే హక్కు తమకు ఉందని కేసీఆర్ వ్యాఖ్యానించారు.

 

  శ్రీశైలంలో 834 అడుగుల వరకు విద్యుదుత్పత్తి చేసుకోవడానికి ఉమ్మడి రాష్ట్రానికి చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే 1996లో ఉత్తర్వులు జారీ చేశారని గుర్తుచేశారు. శుక్రవారం నాటికి శ్రీశైలంలో నీటిమట్టం 857 అడుగులుగా ఉందని పేర్కొన్నారు. అయితే 1996లో చంద్రబాబు జారీ చేసిన జీవో ప్రకారం వ్యవహరిస్తే.. ప్రస్తుత వివాదం మరింత జటిలం కానుందని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. తెలంగాణ రైతుల పంటలు కాపాడుకోవడానికి ఆ రాష్ట్రం విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే.. చంద్రబాబు శ్రీశైలంలో మళ్లీ విద్యుత్ ఉత్పత్తి చేస్తే ఎలాగని శుక్రవారం తనను కలిసిన కృష్ణా బోర్డు చైర్మన్ పండిట్‌తో పేర్కొనగా.. ఊహాజనితమైన ప్రశ్నలకు తాను సమాధానం చెప్పలేనని పండిట్ చెప్పారు. కానీ చంద్రబాబు పేర్కొన్నట్లే శ్రీశైలంలో విద్యుదుత్పత్తి ప్రారంభమైంది.

 

 ప్రకాశం బ్యారేజీ వద్ద చర్చకు సిద్ధం..

 చంద్రబాబుతో ప్రకాశం బ్యారేజీ వద్దకు చర్చకు సిద్ధమని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. విద్యుత్ అంశంపై చర్చకు తాను సిద్ధమని చంద్రబాబు చెబుతున్నారని ఓ విలేకరి ప్రశ్నించగా... ‘‘హైదరాబాద్‌లోని అబిడ్స్‌లో ఉన్న చాచా నెహ్రూ విగ్రహం వద్ద చర్చకు మేం సిద్ధం. నా వద్దనున్న పత్రాలన్నీ తీసుకుని వస్తా. అక్కడ జరిగే చర్చను ప్రజలంతా చూస్తారు. తెలంగాణ రాష్ట్రంలోనే  కాదే ఆంధ్రాలోని ప్రకాశం బ్యారేజీపై అయినా సరే నేను చర్చకు సిద్ధం..’’ అని కేసీఆర్ స్పష్టం చేశారు. ఎన్నికల సమయంలో చెప్పిన అంశాలు, క్లిప్పింగ్‌లతో సహా వస్తానని.. ఆంధ్రా రైతులు, స్వయం సహాయక సంఘాల మహిళలను చంద్రబాబు ఏ విధంగా మోసం చేశారో స్పష్టంగా చెబుతానని అన్నారు.

 

 మోదీకి విజ్ఞప్తి చేస్తాం..

 రాష్ట్ర విభజన చట్టం సక్రమంగా అమలు జరిగేలా చూడాల్సిన బాధ్యత ప్రధాన మంత్రిగా నరేంద్ర మోదీకి ఉందని.. ఇందులో జోక్యం చేసుకోవాలని ప్రధానిని కోరుతామని కేసీఆర్ చెప్పారు. దీనిపై నాలుగు నెలలుగా తాము అనేక మార్లు కేంద్రానికి విజ్ఞప్తి చేస్తున్నా... కేంద్రం జోక్యం చేసుకోకుండా ప్రేక్షక పాత్ర వహిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర విద్యుత్ ప్రాధికార సంస్థ (సీఈఏ), దక్షిణ ప్రాంత విద్యుత్ లోడ్ డిస్పాచ్ సెంటర్( ఎస్‌ఆర్‌ఎల్‌డీసీ), ఈఆర్‌సీ చెప్పినా వినకుండా పెడచెవిన పెట్టిన చంద్రబాబు చర్యలను చక్కదిద్దాల్సిన బాధ్యత ప్రధానికి ఉందని కేసీఆర్ పేర్కొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top