కోటి కాంతులు!

రంగారెడ్డి జిల్లా మీర్‌ఖాన్‌పేట సమీపంలో ఏర్పాటు చేసిన పవర్‌గ్రిడ్‌ విద్యుత్‌ టవర్లు.. - Sakshi


రంగారెడ్డి జిల్లా మీర్‌ఖాన్‌పేటలో ‘పవర్‌గ్రిడ్‌’

ఇక్కడి నుంచి పొరుగు రాష్ట్రాలకు విద్యుత్‌ సరఫరా

సామర్థ్యం : 4,800 మెగావాట్లు

నిర్మాణ వ్యయం : రూ.600 కోట్లు

470 కిలోమీటర్ల లైన్ల నిర్మాణానికి రూ.2,400 కోట్లు

6 సర్క్యూట్ల ద్వారా 3000మెగావాట్ల సరఫరా సామర్థ్యం

765/400 కేవీ జీఐఎస్‌ విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ రాష్ట్రంలో రెండోది


పూర్తిగా గ్యాస్‌ ఇన్సులేటెడ్‌ స్విచ్‌ గేర్‌ (జీఐఎస్‌) సాంకేతికతతో నిర్మిస్తున్న రెండో అతిపెద్ద సబ్‌ స్టేషన్‌ ఇదే కావడం విశేషం.

తెలంగాణ కాంతులీననుంది. విద్యుత్‌ వెలుగు జిలుగులతో చిమ్మచీకటిని పారదోలనుంది. కరెంట్‌ కోతలను అధిగమించిన రాష్ట్రం మిగులు విద్యుత్‌ సాధించే దిశగా ముందడుగు వేస్తోంది. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్‌ఖాన్‌పేటలో పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తున్న 765/400 కేవీ సామర్థ్యం గల సబ్‌స్టేషన్‌తో రాష్ట్రంలో నిరాటంకంగా కరెంట్‌ సరఫరా కానుంది.  ఇక్కడ నిర్మిస్తున్న 765/400 కేవీ విద్యుత్‌ సబ్‌స్టేషన్‌తో దేశంలో ఏ రాష్ట్రం నుంచైనా విద్యుత్‌ను కొనుగోలు చేసి రాష్ట్రానికి తెచ్చుకోవడానికి సులువు అవుతుంది.  



రంగారెడ్డి జిల్లా నుంచి డోకూరి వెంకటేశ్వరరెడ్డి :  రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ఫార్మాసిటీ చేరువలో నిర్మిస్తున్న 765/400 కేవీ సామర్థ్యం గల సబ్‌స్టేషన్‌ మరికొన్ని రోజుల్లో పూర్తిస్థాయిలో కార్యకలాపాలు ప్రారంభించనుంది. చత్తీస్‌గఢ్‌ నుంచి మహారాష్ట్ర వార్దా వరకు కారిడార్‌ను ఏర్పాటు చేస్తున్న పవర్‌గ్రిడ్‌ సంస్థ.. ఈ 765/400 కేవీ సబ్‌స్టేషన్‌ సామర్థ్యంతో పొరుగు రాష్ట్రాల విద్యుత్‌ అవసరాలను తీర్చనుంది.



ఛత్తీస్‌గఢ్‌ నుంచి..

ఛత్తీస్‌గఢ్‌ నుంచి మహారాష్ట్ర వార్దా వరకు, అక్కడి నుంచి నిజామాబాద్‌ మిట్టపల్లి వరకు, అక్కడి నుంచి మీర్‌ఖాన్‌ పేటలో నిర్మిస్తున్న 765/400 కేవీ సబ్‌స్టేషన్‌ వరకు రెండు లైన్లద్వారా విద్యుత్‌ సరఫరా అవుతుంది. మొత్తం 470 కిలోమీటర్ల మేర ఏర్పాటు చేస్తున్న కారిడార్‌కు సుమారు రూ.2,400 కోట్లు ఖర్చయింది. ఇక్కడి నుంచి ఆరు సర్క్యూట్ల ద్వారా విద్యుత్‌ను పంపిణీ చేయనున్నా రు. ఒకటి హైదరాబాద్‌ వైపు, మరొకటి కర్నూల్‌ వైపు, మరో రెండు సర్క్యూట్ల ద్వారా స్థానికంగా ట్రాన్స్‌కో పరిధిలోని 400 కేవీ విద్యుత్‌ సబ్‌స్టేషన్‌కు, మరో రెండు సర్క్యూట్ల ద్వారా మహబూబ్‌నగర్‌ జిల్లా వెల్టూరుకు విద్యుత్‌ సరఫరా చేయనున్నా రు. ఒక్కో సర్క్యూట్‌లో 500 మెగావాట్ల విద్యుత్‌ సరఫరా అవుతుంది. ప్రతిపాదిత రెండు ట్రాన్స్‌ఫార్మర్లలో ఒకటి అందుబాటులోకి రావడంతో కర్నూలు సర్క్యూట్‌కు విద్యుత్‌ సరఫరా మొదలైంది. మహబూబ్‌నగర్‌ వైపు లైన్ల నిర్మాణం పూర్తి కాక అటు వైపు మినహా మిగతా మూడు సర్క్యూట్లకు విద్యుత్‌ పంపిణీ చేస్తున్నారు. మరికొద్ది రోజుల్లో ఈ సర్క్యూట్‌కూ కరెంట్‌ సరఫరా చేయాలని పవర్‌గ్రిడ్‌ సంస్థ భావిస్తోంది.



రూ.600 కోట్ల వ్యయంతో..

మీర్‌ఖాన్‌పేట సర్వేనంబర్‌ 120లో ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం 62.5 ఎకరాలు సేకరించి పవర్‌గ్రిడ్‌ కార్పొరేషన్‌కు అప్పగించింది. దీంట్లో రూ.600 కోట్ల అంచనా వ్యయంతో సబ్‌స్టేషన్‌కు అంకురార్పణ చేసింది. గ్రిడ్‌ కుప్పకూలడం, ఇతరత్రా నిర్వహణా వైఫ ల్యాలను నివారించేలా సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తోంది. ఈ క్రమంలో తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ నిర్మాణాలు చేప ట్టిన పవర్‌గ్రిడ్‌.. రెండు రియాక్టర్లు, రెండు బస్‌ రియాక్టర్లు, రెండు ట్రాన్స్‌ఫార్మర్లను ఏర్పాటు చేసింది. మొత్తం 4800 మెగావాట్ల సామర్థ్యంతో సబ్‌ స్టేషన్‌ను నిర్మించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top